Silicon Valley Bank Collapse: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ దివాళా, డేంజర్ జోన్‌లో లక్ష ఉద్యోగాలు, 10 వేల స్టార్టప్‌లపై పెను ప్రభావం, భారత్‌లోని స్టార్టప్‌ల భవితవ్యంపై ఆందోళన
ఈ నేపథ్యంలో స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది.
అమెరికాలో ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు బాసటగా నిలిచిన అక్కడి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్‌వీబీ) కేవలం 48 గంటల్లో నిండా మునగడానికి బీజం పడింది. ఈ నేపథ్యంలో స్టార్టప్ సంస్థలు, ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ బ్యాంక్ మూసివేత ప్రభావం సుమారు 10 వేల స్టార్టప్‌లపై పడుతుందని, లక్ష ఉద్యోగులు లేఆఫ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని వై కాంబినేటర్ అనే సంస్థ పేర్కొంది. ఈ సంస్థ భారత్‌లోని 200 స్టార్టప్‌లతో పాటు అమెరికాలో వేలాది స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ వై కాంబినేటర్ సంస్థ సీఈవో, ప్రెసిడెంట్ గార్రీ టాన్ అమెరికా ట్రెజరీ కార్యదర్శి జనెట్ యెల్లెన్, ఇతర ఉన్నతాధికారులకు లేఖ రాశారు. ఈ లేఖపై 56 వేల ఉద్యోగులు కలిగిన 1,200 సంస్థల సీఈవోలు సైతం సంతకాలు చేశారు. సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో దాదాపు 37 వేల చిన్న వ్యాపార సంస్థలకు ఖాతాలు ఉన్నాయని, రెండున్నర లక్షల డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ డబ్బులు వ్యాపారులకు అందుబాటులో లేకపోవడం వల్ల ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) దివాళాతో భారత్‌లోని స్టార్టప్‌ల భవితవ్యంపై సందేహాల నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత సంక్షోభం నుంచి స్టార్టప్‌లను బయటపడవేయడానికి మార్గాంతరాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. స్టార్టప్‌లను కాపాడేందుకు అవసరమైన సాయం అందించడానికి వాటి వ్యవస్థాపకులు, సీఈవోలతో వచ్చేవారం భేటీ కానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
ఎస్వీబీ పతనంతో ఆ బ్యాంకులో పలు భారతీయ స్టార్టప్ సంస్థలు నిధులు డిపాజిట్ చేశాయి. ఫలితంగా ఆయా స్టార్టప్‌ల ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఎస్వీబీ దివాళా ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌ల కార్యకలాపాలకు విఘాతం కలుగుతుంది. #న్యూఇండియాఎకానమీలో స్టార్టప్‌లు చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి` అని రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ఆయా స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావాన్ని అంచనా వేసి, వాటికి చేయూతనందించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. అందుకోసం వచ్చేవారం స్టార్టప్‌ల వ్యవస్థాపకులు, సీఈఓలతో భేటీ అవుతున్నట్లు తెలిపారు.
గ్లోబల్ సాఫ్ట్‌వేర్-యాస్-ఏ-సర్వీస్ (సాస్ SaaS) బేస్డ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్షన్ కథనం ప్రకారం ఎస్వీబీ పతనంతో భారత్‌లో కనీసం 21 స్టార్టప్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలుస్తుంది. ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టిన భారతీయ స్టార్టప్‌ల పేర్లు గానీ, తీవ్రంగా దెబ్బతినే ప్రభావం గల స్టార్టప్‌ల వివరాలు గానీ ట్రాక్షన్ వెల్లడించలేదు. యావత్ ప్రపంచ స్టార్టప్‌లకు సేవలందిస్తున్న అమెరికా బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఎస్వీబీ దివాళా తీయడం తీవ్ర నిరాశ, ఆందోళన కలిగిస్తున్నదని టాప్ వెంచర్ క్యాపిటలిస్టు సంస్థలు ఉమ్మడి ప్రకటన చేశాయి.
లైట్‌స్పీడ్, బియాన్ క్యాపిటల్, ఇన్‌సైట్ పార్టనర్స్‌తోపాటు 2500కి పైగా వెంచర్ క్యాపిటల్ సంస్థలు.. ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టాయి. ఎస్వీబీలో కస్టమర్ల డిపాజిట్లు 175 బిలియన్ డాలర్లు ఉన్నాయి. ఈ బ్యాంక్ దివాళా తీయడంతో డిపాజిటర్లకు భరోసా కల్పించేందుకు శుక్రవారం అమెరికా ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్.. ఎస్వీబీని తన నియంత్రణలోకి తీసుకున్నది.
భారత్‌కు చెందిన 200 స్టార్టప్‌లతోపాటు ప్రపంచవ్యాప్తంగా వేల స్టార్టప్‌లు.. ఎస్వీబీలో పెట్టుబడులు పెట్టాయని యూఎస్ కేంద్రంగా పని చేస్తున్న వై-కాంబినేటర్ స్టార్టప్ యాజమాన్యం.. అమెరికా ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్ తదితరులకు ఫిర్యాదు చేసింది. ఎస్వీబీ దివాళాతో తదుపరి ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరింది. తాజా పరిస్థితుల్లో స్టార్టప్ సంస్థల్లో పని చేస్తున్న లక్ష మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1200కి పైగా స్టార్టప్‌ల సీఈవోలు, ఫౌండర్లు, 56 వేల మందికి పైగా వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఈ పిటిషన్‌పై సంతకాలు చేశారు. స్టార్టప్‌లు, వాటిల్లో పని చేస్తున్న ఉద్యోగులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని వై కాంబినేటర్ సీఈవో అండ్ ప్రెసిడెంట్ గ్యారీ టాన్ కోరారు.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) (Silicon Valley Bank -SVB) దివాళా తీయడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్వీబీ దివాళా తీయడంతో టెక్నాలజీ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని చెప్పారు. ఎస్వీబీ దివాళా తీయడం అమెరికా బ్యాంకింగ్ చరిత్రలోనే రెండో అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ సుస్థిరమైందని, శక్తిమంతమైందని, ఈ సంక్షోభానికి తగిన పరిష్కారం కనుగొంటుందని నెతన్యాహు విశ్వాసం వ్యక్తం చేశారు. నెతన్యాహు ప్రస్తుతం రోమ్ అధికారిక పర్యటనలో ఉన్నారు. స్వదేశానికి తిరిగి రాగానే ఫైనాన్స్, ఆర్థిక మంత్రులు, ఇజ్రాయెల్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌తో ఈ సంక్షోభంపై చర్చిస్తానని వెల్లడించారు. ఎస్వీబీతో బ్యాంకింగ్ లావాదేవీలు జరుపుతున్న ఇజ్రాయెలీ టెక్ సంస్థలకు ద్రవ్య లభ్యత అంటే నగదు లభ్యత సమస్య తలెత్తకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎస్వీబీ పతనం ప్రభావం ఆ సంస్థ శాఖలు గల అమెరికా, బ్రిటన్, ఇజ్రాయెల్ తదితర దేశాల్లోని టెక్ పరిశ్రమపై పడింది.