Afghanistan Crisis: అబ్దుల్ అలీ మజారీ విగ్రహం ధ్వంసం, అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని అదుపులోకి తీసుకున్న తాలిబన్లు, హక్కుల కోసం పోరాడుతున్న ఆప్ఘాన్ మహిళలు
బామియాన్‌లో ఇప్పుడు పగులగొట్టిన విగ్రహం (Taliban Blows Up Slain Hazara Leader Abdul Ali Mazari’s Statue) యొక్క చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Kabul, August 18: తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తరువాత 1995 లో తాలిబన్ల చంపేసిన బామియాన్‌లో హజారా నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. బామియాన్‌లో ఇప్పుడు పగులగొట్టిన విగ్రహం (Taliban Blows Up Slain Hazara Leader Abdul Ali Mazari’s Statue) యొక్క చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2001 లో అప్పటి ముల్లా మహమ్మద్ ఒమర్ ఆదేశాల మేరకు తాలిబాన్లు బుద్ధ విగ్రహాలను పేల్చివేసిన ప్రదేశమే బమియాన్. అబ్దుల్ అలీ మజారీ తాలిబాన్లకు వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో ప్రముఖ నాయకుడు. అతడిని తాలిబాన్లు కిడ్నాప్ చేసి చంపారు మరియు అతని శరీరం 1995 లో గజనీలో హెలికాప్టర్ నుండి బయటకు వచ్చింది. హజారాలు అంటే ఎక్కువగా షియా ముస్లింలు. ఆఫ్ఘనిస్తాన్‌లో సున్నీ ముస్లిం మిలిటెంట్ గ్రూపులు మైనారిటీ షియాలపై పదేపదే దాడులు చేస్తున్నాయి.
ఇక అఫ్గాన్ తొలి మహిళా గవర్నర్ సలీమా మజారీని (Takes Salima Mazari) తాలిబన్లు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తుపాకీ చేతబట్టి తమతో పోరాడిన ఆమెపై పైచేయి సాధించి ఎట్టకేలకు బంధించినట్లు తెలుస్తోంది. కాగా అఫ్గనిస్తాన్‌లోని బల్ఖ్ ప్రావిన్స్‌లోని చహర్ కింట్ జిల్లాకు చెందిన సలీమా అఫ్గన్ తొలితరం మహిళా గవర్నర్లలో ఒకరిగా (Female District Governor in Afghanistan in Custody) గుర్తింపు పొందారు. ఓవైపు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ సహా ఇతర నేతలంతా పారిపోతున్నా బల్ఖ్ ప్రావిన్స్‌ను తాలిబన్లు ఆక్రమించకుండా ఆమె ఎదురొడ్డి పోరాడారు. కానీ.. తాలిబన్లు ఆ ప్రాంతంపై పట్టు సాధించారు. ఈ క్రమంలో సలీమాను వారు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అబ్దుల్ అలీ మజారీ విగ్రహం ధ్వంసం చిత్రాలు
మరోవైపు.. అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైన నేపథ్యంలో అక్కడి మహిళలు హక్కుల కోసం పోరాడుతున్నారు. కాబుల్ వీధుల్లో నలుగురు మహిళలు నిరసన తెలిపారు. తమ హక్కులు కాపాడుకుంటామంటూ ఫ్లకార్డుల ప్రదర్శించారు. కాగా తాము మారిపోయామని, ఇస్లామిక్ చట్టాల ప్రకారం మహిళలకు అన్ని హక్కులు కల్పిస్తామని తాలిబన్లు తమ తొలి మీడియా సమావేశంలో భాగంగా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, మహిళలు మాత్రం తాలిబన్ల రాజ్యంలో తమ హక్కులకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కొందరు మహిళలు తమ హక్కుల్ని కాపాడుకొనేందుకు అక్కడ నిరసన బాట పట్టారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కాబుల్ వీధుల్లో నలుగురు అఫ్గాన్ మహిళలు చేతితో రాసిన కొన్ని కాగితాలను ప్రదర్శిస్తూ కనిపించారు. ‘ఇన్ని సంవత్సరాలుగా మేం సాధించిన విజయాలు, మేం దక్కించుకున్న కనీస హక్కులు వృథాగా పోకూడదు’ అంటూ వారు నినదిస్తున్నారు.
వారు నిరసన వ్యక్తం చేస్తోన్న సమయంలో తాలిబన్లు వారిని చుట్టుముట్టి ఉండటం గమనార్హం. అయినా, వారి మొహంలో భయమేమీ కనిపించడం లేదు. ఈ వీడియోను ఇరాన్‌కు చెందిన పాత్రికేయురాలు, హక్కుల కార్యకర్త షేర్ చేశారు. ‘గుండె నిండా ధైర్యం నింపుకున్న ఈ మహిళలు తాలిబన్లకు వ్యతిరేకంగా కాబుల్ వీధుల్లోకి వచ్చారు. తమ హక్కుల కోసం నిలబడ్డారు. వారికి అండగా మరికొంత మహిళలు, పురుషులు జత కలుస్తారని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
మరోపక్క.. అఫ్గానిస్థాన్‌లో ప్రధాన మీడియా సంస్థ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్ రాకతో ఆందోళన గురైన ఆ సంస్థ మొదట తమ మహిళా యాంకర్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత ధైర్యం చేసి వారిని విధుల్లోకి తీసుకోవడంతో మళ్లీ టీవీ తెరలపై వారు దర్శనమిచ్చారు.
అఫ్గాన్ తాజా పరిణామాలతో మళ్లీ మహిళలంతా ఆంక్షల వలయంలో బందీ కావాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. అయితే, తాలిబన్లు మాత్రం ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదించినట్లు ప్రకటించారు. ఇస్లామిక్ చట్టాలు, దేశ సాంస్కృతి విలువలకు లోబడి మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అయితే, వారి హామీలు వినడానికి బాగానే ఉన్నా.. వాటిలో స్పష్టత కొరవడిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.