Military Plane C-17 Globemaster (Photo Credits: ANI)

Washington, August 18: తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను కైవసం చేసుకున్నప్పటి నుంచి అక్కడి పరిణామాలు మరింతగా దిగజారుతున్నాయి. ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య జరిగిన పోరులో అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా అమెరికా దీనికి సంబంధించి ఒక హృదయ విదారక ఘటనను వెల్లడించింది. గతంలో తాలిబన్ల చీకటి పాలన రోజులు మళ్ళీ మొదలు కానుందని భావించిన ఆఫ్గన్ ప్రజలు వాటి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కాబూల్ విమానాశ్ర‌యం నుంచి ఆదివారం ఎగిరిన అమెరికా వైమానికద‌ళ కార్గో విమానంపై ఎక్కేందుకు జ‌నం ఎగ‌బడిన విష‌యం తెలిసిందే. ఆ క్రమంలో ట‌ర్మాక్‌పై కూర్చున్న కొంద‌రు విమానం గాల్లోకి ఎగిరిన త‌ర్వాత కింద ప‌డ్డారు. ఆ హృదయ విదారక దృశ్యాలు మనల్ని క‌లిచివేశాయి. అయితే సీ-17 గ్లోబ్‌మాస్ట‌ర్ సైనిక విమానం (Military Plane C-17 Globemaster) లో ఖాళీ లేక కొందరు ఆఫ్గన్లు విమానం వీల్ భాగంలో దాక్కున్నారు. సుమారు 600 మందికి పైగా వెళ్లిన ఆ విమానం ఖ‌తార్‌లోని ఆల్ ఉబెయిద్ ఎయిర్‌బేస్‌లో దిగింది. ఆ విమానం అక్క‌డ దిగిన త‌ర్వాత వైమానిక ద‌ళ అధికారులకి (US Air Force) మ‌రో షాక్ త‌గిలింది. విమాన చ‌క్రం భాగంలో మాన‌వ శ‌రీర‌భాగాలు, అవ‌య‌వాలు (Human Remains Found in Wheel Well) క‌నిపించాయని అధికారులు తెలిపారు.

బయటపడుతున్న తాలిబన్ల క్రూరత్వం, మహిళలు, పిల్లలపై దాడులు, ఆఫ్ఘన్ జెండా ఉంచాలన్న నిరసనకారులపై కాల్పులు, ప్రఖ్యాత అమ్యూజ్‌మెంట్‌ పార్క్‌ను తగలబెట్టిన తాలిబన్లు

స‌రుకుల‌తో వ‌చ్చిన త‌మ విమానం కాబూల్‌లో ల్యాండ్ అయిన కొద్ది సేపట్లోనే వంద‌లాది మంది విమానం ఎక్కారో లేదో తమకు తెలియ‌ద‌ని అమెరికా అధికారులు తెలిపారు. అక్కడి ప‌రిస్థితి పూర్తిగా అదుపుత‌ప్పుతున్న‌ట్లు కనిపించడంతో వెంటనే సీ-17 విమానాన్ని కాబూల్ నుంచి త‌ర‌లించామన్నారు. కాబూల్ విమానాశ్ర‌యంలో వెలుగు చూసిన ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు అమెరికా వైమానిక ద‌ళం తెలిపింది. విమానాశ్ర‌యం వ‌ద్ద ఏర్ప‌డ్డ గంద‌ర‌గోళంలో ప‌లువురు మృతిచెందగా, ఎంత మంది అనే విష‌యాన్ని మాత్రం స్ప‌ష్టం చేయ‌లేదు.

కాగా కాబుల్‌ విమానాశ్రయంలో మంగళవారం పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. అమెరికా బలగాల పహారాలో అక్కడి నుంచి మిలటరీ తరలింపు విమానాల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, రాత్రివేళ అక్కడకు చేరుకున్న తాలిబన్లు సాధారణ ప్రజలను ఎయిర్‌పోర్టులోకి రానివ్వ లేదు. ప్రహారి దూకి లోపలకు వచ్చేందుకు ప్రయత్నించినవారిపై కాల్పులు జరిపారు.