Telugu Student Killed in America: వీడియో ఇదిగో, అమెరికాలో తెలుగు యువతిని కారుతో గుద్ది చంపి ఘటన, డబ్బులు ఇస్తే సరిపోద్దిలే అంటూ పగలబడి నవ్విన పోలీస్
సదరు పోలీసు అధికారి తెలుగు యువతి మృతిపై నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
US, Sep 14: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందడంపై అక్కడి పోలీసు అధికారి చులకనగా మాట్లాడిన వీడియో కలకలం రేపుతోంది. సదరు పోలీసు అధికారి తెలుగు యువతి మృతిపై నవ్వుతూ, జోకులు వేస్తున్న వీడియో బయటికి రావడంతో.. అక్కడి ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అమెరికాలో సియాటెల్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుతున్న కర్నూలు జిల్లా ఆదోని యువతి జాహ్నవి (23) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసు పెట్రోలింగ్ వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడిక్కడే మరణించారు. ఆ ఘటన విషయం తెలిసి దర్యాప్తు చేయడానికి వచి్చన పోలీసు అధికారి డానియెల్ అడరర్.. పై అధికారికి వివరాలు చెప్తూ జాహ్నవి పట్ల చులకనగా మాట్లాడారు. గట్టిగా నవ్వుతూ ‘ఆమె చచ్చిపోయింది. ఆ ఓ మామూలు వ్యక్తేలే..’ అని వ్యాఖ్యానించారు. ఏముంది.
ఓ పదకొండు వేల డాలర్లకు చెక్కు రాస్తే చాలు.. ఆమెకు 26 ఏళ్లు ఉంటాయేమో.. విలువ తక్కువే..’ అని పగలబడి నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డైంది. తాజాగా ఈ దృశ్యాలు వెలుగులోకి రావడంతో.. సియాటెల్ కమ్యూనిటీ పోలీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని పేర్కొంది. డానియెల్ అడరర్‌పై విచారణకు ఆదేశించింది.
Here's Video
ఇక జాహ్నవిని ఢీకొని ఆమె మృతికి కారణమైన తోటి పోలీసు అధికారి కెవిన్‌ను కాపాడేందుకు కూడా ఈ డానియెల్ ప్రయత్నించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో కెవిన్ కారును గంటకు 50 మైళ్ల వేగంతోనే నడుపుతున్నాడని, కారు అదుపు తప్పలేదని డానియల్ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నాడు. తప్పు జాహ్నవిదే అన్నట్టుగా చూపడానికి ప్రయత్నించాడు. అయితే కెవిన్ కారును పరిమితికి మించి 74 మైళ్ల వేగంతో నడిపాడని, కారు అదుపు తప్పిందని తర్వాత ఫోరెన్సిక్, ఇతర దర్యాప్తు నివేదికల్లో తేలడం గమనార్హం.
ఇక, జాహ్నవి మృతిపై భారత ఎంబసీ స్పందించింది. ఈ కేసుపై తగు చర్యలు తీసుకోవాలని సియోటెల్ పోలీసు అధికారులను కోరింది. అలాగే, కేసుతో సంబంధం ఉన్న వారిని శిక్షించాలని కోరింది.