Washington, November 26: అమెరికాలోని చికాగో సిటీలో గల ఇలియనాస్ యూనివర్శిటీలో (University of Illinois) యూఐసీ హానర్స్ డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతున్న 19 ఏళ్ల రుత్ జార్జ్ (Ruth George) అనే టీనేజీ యువతిని లైంగికంగా వేధించి ఆపై ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ యువతి స్వస్థలం హైదరాబాద్ అని ప్రాథమికంగా తెలుస్తుంది. ఈ ఘటనతో యూనివర్సిటీ ఆఫ్ ఇలియనాస్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. యువతి పేరేంట్స్ కు సంతాపం ప్రకటించింది.
వివరాల్లోకి వెళ్తే, ఈనెల 23న యూనివర్శిటీ సమీపంలోని గ్యారెజీలో తన కారును పార్కు చేసిన చోటికి రుత్ జార్జ్ ఒంటరిగా వెళ్లింది. అదే సమయంలో ఆమె వెనక డోనాల్డ్ థుర్మాన్ (Donald Thurman) అనే 26 ఏళ్ల దుండగుడు వెళ్లాడు. గ్యారేజీలోనే యువతిని లైంగికంగా వేధించాడు. ఆమెపై అత్యాచారం చేసి ఆపై గొంతునులిమి చంపేసి అక్కడ్నించి పరారయ్యాడు.
శుక్రవారం సాయంత్రం నుంచి రుత్ జార్జ్ నుంచి ఎలాంటి ఫోన్ రాకపోవడంతో ఆమె పేరేంట్స్ చికాగో పోలీసులకు శనివారం సమాచారం అందించారు. దీంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులో కారు బ్యాక్ సీటులోనే యువతి శవమై ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత యువతి శవాన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేయగా, ఆమెను లైంగికంగా వేధించి గొంతు నులిమి చంపినట్లు నిర్ధారణ అయ్యింది.
చనిపోయిన రుత్ జార్జ్ గౌరవార్థం యూనివర్శిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన స్మారక చిహ్నం:
Memorial set up to honor UIC student Ruth George, murdered at a campus garage over the weekend. A candlelight vigil is planned at 7pm pic.twitter.com/hxIBvRTFO7
— Michelle Gallardo (@GallardoABC7) November 25, 2019
ఆదివారం రోజు చికాగో మెట్రో స్టేషన్ వద్ద నిందితుడు థుర్మాన్ ను అరెస్ట్ చేశారు. యువతిని హత్య చేసినట్లు అంగీకరించడంతో అతడిపై ఫస్ట్ గ్రేడ్ మర్డర్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై గతంలో కూడా క్రిమినల్ కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా అతడికి యూనివర్శిటీతో కూడా ఎలాంటి సంబంధం లేదని తేలింది.