IPL Auction 2025 Live

Russia-Ukraine Crisis: రెండు-మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి, సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, దాడులకు దిగితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక

ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం (Russia-Ukraine Crisis) ఉందని అమెరికా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 16న దాడి చేస్తుంద‌ని అమెరికా ముందుగా చెప్పిన‌ప్ప‌టికీ ర‌ష్యా ఆ చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేదు.

US President Joe Biden

Kyiv, February 18: ఉక్రెయిన్‌-రష్యా మ‌ధ్య యుద్ధ భ‌యం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం (Russia-Ukraine Crisis) ఉందని అమెరికా ఇప్ప‌టికే ప్ర‌క‌ట‌న చేసింది. ఈ నెల 16న దాడి చేస్తుంద‌ని అమెరికా ముందుగా చెప్పిన‌ప్ప‌టికీ ర‌ష్యా ఆ చ‌ర్య‌కు పాల్ప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఉక్రెయిన్ కి ర‌ష్యాతో ముప్పు (Russian Threat To Invade Ukraine Still Very High) త‌గ్గ‌లేద‌ని అమెరికా చెబుతోంది. ర‌ష్యా సైనికులను ఉపసంహరించలేదని, అంతేగాక‌ అదనంగా మోహరించారని నాటో దేశాలు కూడా చెబుతున్నాయి.

రెండు-మూడు రోజుల్లోనే ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (US President Joe Biden ) తాజాగా చెప్పారు. ఉక్రెయిన్‌ సరిహద్దులో సైనికుల‌ను ఉపసంహరిస్తున్నట్లు రష్యా ప్రకటించినప్ప‌టికీ, ర‌ష్యా ఆ దిశ‌గా ముందుకు వెళ్ల‌డం లేద‌ని బైడెన్ తెలిపారు. బయటి ప్రపంచాన్ని మభ్యపెట్టడానికే అటువంటి ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌ని చెప్పారు. ఉక్రెయిన్‌ సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించడానికి తమ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ను ఐక్యరాజ్యసమితి కార్యాల‌యానికి పంపుతున్నానని బైడెన్ చెప్పారు.

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగే ఆలోచనలను రష్యా తక్షణం మానుకోవాలని బైడెన్‌ అన్నారు. దాడికి దిగితే ఎదుర్కొనేందుకు ప్రపంచమంతటినీ కూడగడతామని స్పష్టం చేశారు. ‘‘నిర్ణాయక రీతిలో స్పందించి తీరతాం. సుదీర్ఘకాలం పాటు తేరుకోలేనంతగా రష్యాపై తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తాం’’ అంటూ ఘాటుగా హెచ్చరించారు. ‘‘యుద్ధ ముప్పు అలాగే ఉంది. కనీసం లక్షన్నరకు పైగా రష్యా దళాలు ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోనే ఉన్నాయి. అందుకే పరిస్థితులు దిగజారకముందే ఉక్రెయిన్‌ నుంచి వచ్చేయాలని అక్కడున్న అమెరికన్లకు సూచించానని తెలిపారు.

 వెనక్కి తగ్గిన రష్యా, ఉక్రెయిన్ స‌రిహ‌ద్దుల నుంచి బలగాలు ఉపసంహరణ, డ్రిల్స్ పూర్తి చేసుకున్న త‌ర్వాత దళాలు స‌రిహ‌ద్దు నుంచి వెన‌క్కి మ‌ళ్లాయని తెలిపిన రష్యా రక్షణ మంత్రి

మా రాయబార కార్యాలయాన్ని కీవ్‌ నుంచి పశ్చిమ ఉక్రెయిన్‌కు మార్చాం. రష్యా ఎలాంటి చర్యకు దిగినా దీటుగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’’ అని స్పష్టం చేశారు. అయితే యూరప్‌ భద్రత, సుస్థిరతను మెరుగుపరిచేందుకు రష్యాతో, అక్కడి మా మిత్రపక్షాలతో మాట్లాడేందుకు ఎప్పుడూ సిద్ధమేనన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునేందుకే చివరిదాకా ప్రయత్నిస్తామంటూ ముక్తాయించారు.

ఉక్రెయిన్‌పై రష్యా ఒకవేళ దాడి చేస్తే దానికి వ్యతిరేకంగా భారత్ త‌మ‌ సరసన నిలుస్తుందని అమెరికా ఆశిస్తోంది. ఇప్ప‌టికే భార‌త్ చ‌తుర్భుజ కూట‌మిలో ఉన్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో స‌భ్య‌దేశాలు భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. ఇందులో రష్యా, ఉక్రెయిన్‌ల గురించి చర్చ వచ్చింద‌ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్ చెప్పారు. మ‌రోవైపు, గత 48 గంటల్లో అదనంగా 7,000 మంది రష్యన్‌ సైనికులు సరిహద్దుకు తరలి వచ్చారని నాటో దేశాలు చెప్పాయి. కాగా, తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్క్స్, లుహాన్స్‌క్‌ ప్రాంతాల్లో కాల్పుల క‌ల‌క‌లం చెల‌రేగింది. అక్క‌డి రష్యా అనుకూల వేర్పాటువాదులు, ఉక్రెయిన్‌ దళాలు ప‌ర‌స్ప‌రం కాల్పులు జ‌రుపుకోవ‌డంతో అల‌జ‌డి రేగింది.

భారతీయులు వెంటనే ఉక్రెయిన్ వదిలి దేశానికి రండి, ర‌ష్యా వైమానిక దాడులు చేసే అవ‌కాశాలున్నాయని తెలిపిన దౌత్య కార్యాల‌యం

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో సైనిక బలగాల కదలికలపై ప్రపంచాన్ని రష్యా తప్పుదోవ పట్టిస్తోందని నాటో కూటమి దేశాలు ఆరోపించాయి. సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను వెనక్కు పంపుతామని అసత్యాలు ప్రచారం చేస్తోందని నాటో సెక్రటరీ జనరల్‌ జెన్స్‌ స్టోల్టెన్‌బర్గ్‌ విమర్శించారు. బలగాలు ఉపసంహరిస్తామని చెబుతూ మరో 7వేలకు పైగా బలగాలను సరిహద్దుల్లోకి రష్యా తరలించిందని యూఎస్, మిత్రపక్షాలు ఆరోపించాయి.శాటిలైట్‌ చిత్రాల్లో రష్యా బలగాల మోహరింపు పెరిగినట్లు తెలుస్తోందని మాక్సర్‌ టెక్నాలజీస్‌ అనే వాణిజ్య సంస్థ తెలిపింది.

మరోవైపు ఉక్రెయిన్‌ సరిహద్లుల్లో ఉద్రిక్తతలు గురువారం కూడా కొనసాగాయి. ఉక్రెయిన్‌ బలగాలకు, రష్యా మద్దతున్న వేర్పాటువాదులకు మధ్య ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో దాడులు జరిగాయి. గురువారం తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ సైనికుల కూడా ఎదురుకాల్పులు జరిపినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు రష్యా వేర్పాటువాదులు ఆరోపించారు. అయితే ఈ కాల్పుల్లో ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇద్దరు పౌరులు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. ఈ ఎదురుకాల్పులపై అగ్ర రాజ్యం అమెరికా స్పందించింది. రష్యావి రెచ్చగొట్టే చర్యలు అంటూ ఘాటు వ్యాఖ‍్యలు చేసింది. ఈ క్రమంలో రష్యా.. సరిహద్దుల్లో మోహరించిన తన దేశ సైనికులను వెనక్కి రప్పించినట్టు పేర్కొంది. ఇక ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో దాదాపు 1.5 లక్షల మంది బలగాలను రష్యా మోహరించింది. అయితే చర్చలకు తాము సిద్ధమని, ఆక్రమణ ఉద్దేశాలు లేవని, కొంతమేర బలగాలను ఉపసంహరిస్తున్నామని రష్యా వారం ఆరంభంలో పక్రటించింది.

అయితే రష్యా మాటలు కార్యరూపం దాల్చలేదని నాటో చీఫ్‌ ఆరోపించారు. రష్యా చెప్పేదానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, తాజాగా 7వేల బలగాలను సరిహద్దుకు తరలించిందని బ్రిటన్‌ డిఫెన్స్‌ సెక్రటరీ బెన్‌ వాలెస్‌ చెప్పారు. ఎలాంటి బలప్రయోగం జరిగినా రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. రష్యా బలగాల ఉపసంహరణ తప్పుడు సమాచారమని బ్రిటన్‌ సాయుధ బలగాల మంత్రి జేమ్స్‌ హ్యాపీ విమర్శించారు. ఇప్పటికీ ఉక్రెయిన్‌ ఆక్రమణ అవకాశాలు అధికంగానే ఉన్నాయని నాటోదేశాలు భావిస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్‌ సరిహద్దు దేశాలకు బలగాలను తరలిస్తున్నాయి. ఉక్రెయిన్‌ మాత్రం చర్చలతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. నాటోలో తమ చేరికను కొన్ని సభ్యదేశాలు అంగీకరించడంలేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు చెప్పారు.

ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించడం ఖాయమని పాశ్చాత్య దేశాలు చెబుతున్న నేపథ్యంలో ఉక్రేనీయులు రష్యాకు వ్యతిరేకంగా తమ దేశ జెండాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఉక్రెయిన్‌ బలగాలు ప్రజలను చంపేస్తున్నాయని, అమెరికాతో కలిసి ఉక్రెయిన్‌ సొంత ప్రజలపై రసాయన ఆయుధాలు ప్రయోగిస్తోందని రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఉక్రెయిన్‌ను ఆక్రమించే ముందు రంగం సిద్ధం చేయడానికి రష్యా ఇలాంటి కథనాలు వెలువరిస్తోందని యూఎస్‌ ఆరోపించింది. రష్యాతో బలమైన మిలటరీ భాగస్వామ్యం కొనసాగిస్తామని వెనిజులా ప్రకటించింది.

ఉక్రెయిన్‌ నుంచి భారతీయులను తక్షణమే స్వదేశానికి తరలించే యోచన లేదని భారత విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, ప్రస్తుతం దానిపైనే దృష్టి పెట్టామని తెలిపింది. నాటో, రష్యా మధ్య చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారమని విదేశాంగ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ చెప్పారు. కీవ్‌లోని భారతీయ ఎంబసీ అక్కడి భారతీయ విద్యార్థులతో టచ్‌లో ఉందనిచెప్పారు.

ఉక్రెయిన్‌లో నివసించే భారతీయులు తాత్కాలికంగా ఆ దేశాన్ని వీడాలని గత మంగళవారం భారత్‌ సూచించింది. మరోవైపు ఉక్రెయిన్, భారత్‌ మధ్య తిరిగే విమానాల సంఖ్యపై విధించిన పరిమితులను పౌరవిమాన యాన శాఖ తొలగించింది. ఎయిర్‌ బబుల్‌ ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల మధ్య తిరిగే విమనాలు, వాటిలో సీట్ల సంఖ్యపై ఇంతవరకు పరిమితులున్నాయి. వీటిని తాజాగా తొలగించారు. వీలైనంత మంది భారతీయులు స్వదేశానికి తొందరగా వచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు.