Iran Plane Crash: క్షిపణితో ఉక్రెయిన్ బోయింగ్ విమానాన్ని కూల్చివేసిన ఇరాన్, ధ్రువీకరిస్తున్న అంతర్జాతీయ మీడియా, అందుకు సంబంధించిన వీడియో వైరల్

మృతుల్లో తమ దేశానికి చెందిన 63 మంది ఉండటంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇరాన్ పై ధ్వజమెత్తారు. దీనికి సమాధానం చెప్పాలని ఇరాన్ ను నిలదీస్తున్నారు.....

Video Shows Ukrainian Plane Being Hit Over Iran | Photo: Twitter

Tehran, January 10:  ఇరాన్ దేశంపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. క్షిపణితో ప్యాసెంజర్ విమానాన్ని (Ukrainian passenger) కూల్చివేసి అందులోని అమాయక ప్రజల బలితీసుకుందని వివిధ దేశాల నేతలు ఇరాన్ పై ఆరోపణలు చేస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో రెండు రోజుల క్రితం జననవరి 8, తెల్లవారుఝామున ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 176 మంది అమాయక ప్రజలు మరణించారు.

అయితే ఇది ప్రమాదం కాదు, ఇరాన్ పొరపాటున క్షిపణి దాడి (Missile Hit) చేసి ఉంటుందనే అనుమానాలు ముందునుంచే తలెత్తాయి. ఈ అనుమానాలకు బలమిచ్చేలా ఓ వీడియో బయటకు వచ్చింది. అది ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతుంది. అంతర్జాతీయ మీడియా ఆ వీడియో ఫుటేజీని చూపిస్తూ విమానంపై ఇరాన్ దాడి చేసిందనడానికి ఇదే సాక్ష్యం అని కథనాలు వెలువరించింది. ఆ వీడియోలో ఒక క్షిపణి ఆకాశంలో ఒక వస్తువును ఢీకొట్టి అక్కడే పేలినట్లు కనిపిస్తుంది. ఇదే సమయంలో ఒక కుక్క ఆకాశంలో ఆ మెరుపును గమనించి మొరుగుతుంది.

ఒకసారి ఆ వీడియోను పరిశీలించండి

'న్యూయార్క్ టైమ్స్' ఒక అడుగు ముందుకు వేసి ఈ వీడియో ఫుటేజీని - శాటిలైట్ చిత్రాలతో పోల్చుతూ ఇది ఖచ్చితంగా ఇరాన్ చేసిన క్షిపణి దాడేనని నిర్ధారించింది.  ఆ మార్గంలో ప్రయాణాలు మానుకోవాలని భారతీయులకు కేంద్రప్రభుత్వం హెచ్చరిక

ఇరాన్- యూఎస్ మధ్య ఉద్రిక్త వాతావరణం (Iran- USA tensions) కొనసాగుతుండగా, టెహ్రాన్ నుంచి టేకాఫ్ తీసుకున్న ఉక్రెయిన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం కొద్దిసేపటికే మంటలంటుకొని నేలకూలింది. ఈ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే ఇరాక్ లోని యూఎస్ సైనిక స్థావరాలపై ఇరాన్ వైమానిక దళం 22 క్షిపణిలతో విరుచుకుపడింది. అదే సమయంలో ఉక్రెయిన్ విమానం టేకాఫ్ తీసుకోగా, అమెరికా ప్రతిదాడి చేస్తుందేమోనని భ్రమపడి పొరపాటున పేల్చేసిందనేది ఇప్పుడు ఇరాన్ పై వివిధ దేశాధి నేతలు మోపుతున్న అభియోగం.  క్షిపణి దాడిలో 80 మంది 'అమెరికా ఉగ్రవాదులు' హతం అయ్యారని పేర్కొన్న ఇరాన్ 

ఆ ప్రమాదంలో మరణించిన వారిలో 82 మంది ఇరాన్ దేశస్తులు కాగా, 63 మంది కెనడా వాసులు, 11 మంది ఉక్రెయిన్ వాసులు ఉన్నారు. మృతుల్లో తమ దేశానికి చెందిన 63 మంది ఉండటంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇరాన్ పై ధ్వజమెత్తారు. దీనికి సమాధానం చెప్పాలని ఇరాన్ ను నిలదీస్తున్నారు. రష్యా తయారు చేసిన SA 15 క్షిపణి (SA 15 Missile) తో ఈ దాడి జరిగిందని యూఎస్ ఇంటలిజెన్స్ పేర్కొంది. ఈ క్షిపణులను ఇరాన్ 2002లో కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో ఉంది.