Aryan Khan Drug Case: ముంబై డ్రగ్స్ కేసు, 3వ సారి ఆర్యన్ ఖాన్‌కు కోర్టులో చుక్కెదురు, బెయిల్ నిరాకరించిన ముంబై స్పెషల్ కోర్టు, హైకోర్టును ఆశ్రయించిన షారుక్ ఖాన్ తనయుడు
తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను (Shah Rukh Khan’s Son’s Bail Application) విచారించిన స్పెషల్ ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మళ్లీ కోర్టులో చుక్కెదురైంది. తాజాగా ఆర్యన్ బెయిల్ పిటిషన్‌ను (Shah Rukh Khan’s Son’s Bail Application) విచారించిన స్పెషల్ ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. కాగా గత 14 రోజులుగా ఆర్యన్ ఆర్థర్‌రోడ్ జైలులోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆర్యన్ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముంబై హైకోర్టులో (Bombay High Court) అతని తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 26న ఈ పిటిషన్ విచారణకు రానుంది.
కాగా గత ముందు బెయిల్ దరఖాస్తులలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యుత్తరాలను దాఖలు చేస్తుందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా జూనియర్ కోర్టుకు తెలియజేశారు. దీంతో బుధవారం ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక ఎన్‌డిపిఎస్ కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో పలు అంశాలను ప్రస్తావించింది. ఇంటర్నేషనల్ డ్రగ్ నెట్‌వర్క్‌కు చెందిన డీలర్స్‌తో ఆర్యన్‌కు సంబంధాలు ఉన్నాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది.
సంబంధిత వ్యక్తుల గురించి ఆర్యన్ వద్ద పూర్తి సమాచారం ఉంది. అయినా ఇప్పటివరకు ఆర్యన్ వారి గురించి నోరు విప్పలేదు. వారి గురించి ఆర్యన్‌కు తప్ప మరొకరికి తెలియదు. ఆర్యన్‌ను బెయిల్‌పై విడిచి పెడితే సాక్ష్యాలను తుడిచేసే ప్రమాదం ఉందని తెలిపింది. ఆర్యన్‌కు ఇప్పటివరకు ఎలాంటి క్రిమినల్ రికార్డూ లేకపోయినప్పటికీ.. నిషేధిత డ్రగ్స్ (Aryan Khan Drug Case) యాక్టివిటీస్‌తో సంబంధం ఉంది. ఆర్యన్‌తో పాటు అరెస్ట్ అయిన వారందరూ ఒకే తరహా వ్యక్తులు. ఎన్‌సీబీ విచారణలో ఎవరూ తమ సప్లయర్స్ గురించి నోరు విప్పలేదని కోర్టు వ్యాఖ్యానించింది.
వ్యక్తుల వద్ద డ్రగ్స్ దొరకనప్పటికీ.. స్పాట్‌లో దొరికిన మొత్తం మాదక ద్రవ్యాలకు అక్కడున్న అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆర్యన్ వాట్సాప్ ఛాట్ ద్వారా భారీ మొత్తంలో డ్రగ్స్ గురించి, హార్డ్ డ్రగ్స్ గురించి సమాచారం లభించింది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో ఆర్యన్ సంభాషిస్తున్నట్టు వాట్సాప్ ఛాట్ ద్వారా నిరూపితమైందంటూ ముంబై స్పెషల్ కోర్టు ఆర్యన్‌కు బెయిల్ నిరాకరించింది.
ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై దాడి చేసిన పోలీసులు ఆర్యన్‌తో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. మరోవైపు ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. మరోవైపు ఆర్యన్ స్నేహితులు అర్భాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచా పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తిరస్కరించింది.
షారుక్ ఖాన్ తన తనయుడు ఆర్యన్‌ను చూసేందుకు తొలిసారి జైలుకు వచ్చారు. ముంబై ఆర్థర్ రోడ్డు జైలుకు బుధవారం ఆయన తనయుడిని కలిసి కాపేపు ముచ్చటించి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీసుల అదుపులో ఉన్న ఆర్యన్‌ను షారుక్ కలుసుకోవడం ఇదే మొదటిసారి.