Posani Vs Pawan: నువ్వు సైకోవి పవన్, రేపే నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తా, జనసేనాధినేతపై మండిపడిన పోసాని కృష్ణమురళి, టీడీపీ శ్రేణులు చిరంజీవిని తిట్టినప్పుడు ఎక్కడున్నావు అంటూ ఫైర్
పబ్లిక్ మూవీ ప్రీ -రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు (Pawan Kalyan comments ) తీవ్ర దూమారం రేపుతున్నాయి. దీంతో ఆయన కామెంట్స్‌ను తప్పుబడుతూ సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ నిన్న మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేశారని ఆరోపిస్తూ పోసాని మరోసారి మీడియా (Posani Krishna Murali Press Meet) ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారంటూ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali) మండిపడ్డారు.పవన్ ఫ్యాన్స్ తనని టార్గెట్ చేసి బెదిరింపులు దిగారని ఆరోపిస్తూ ఆయన మరోసారి మీడియా ముందుకు వచ్చారు.
మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌కబ్‌లో నిర్వహించిన ప్రస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ (Pawan Kalyan) ఫ్యాన్స్‌తో గ్రూపులు పెట్టుకున్నారు. ఫంక్షన్లలో నీ గ్రూపులతో పవన్.. పవన్ అని నినాదాలు చేయించుకుంటావు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు నేను భయపడను. నన్ను ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ప్రశ్నిస్తూనే ఉంటా. నీకు నీ కటుంబం ఎంత గొప్పో.. నాకు నా కుటుంబ కూడా అంతే గొప్పా. విమర్శలు తట్టుకోలేని వాడివి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత తిట్టినా నేను డిమోరలైజ్ కాను. ఒకే నన్ను చంపిస్తావా.. నేను రెడీ. నా డెడ్ బాడీ కూడా నిన్ను వదలదు’ అంటూ పోసాని ధ్వజమెత్తారు.
పోసాని ప్రెస్‌క్లబ్ వద్దకు వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు భారీగా అక్కడి చేరుకున్నారు. పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోసానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు.. అనంతరం పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పవన్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని తెలిపారు.
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై విమర్శలు చేయడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని, తనని తిడుతూ గత 24 గంటల్లో కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, కక్ష కట్టి మాట్లాడటం సరికాదు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి గుర్తులేదా? ఒకసారి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ జరుగుతుంటే రాత్రి షెడ్యూల్ చేయాల్సి వచ్చింది.
సాధారణంగా నేను సాయంత్రం 6 గంటలకు వెళ్లిపోతా. పెద్ద హీరో కదాని రాత్రి 9గంటల వరకూ వేచి చూసినా ఆయన రాలేదు. రాత్రి 10.30గంటలకు ఇంట్లో భోజనం చేస్తుంటే ఆయన ఫోన్ చేశారు. ‘ఏవండీ మేము పిచ్చోళ్లమా? చెప్పకుండా ఎలా వెళ్తారు? సినిమా అంటే ఏమనుకున్నారు?’ అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టారు. నాకు కోపం వచ్చింది. ‘మీరు 10గంటలకు వస్తే, మేము అప్పటివరకూ ఉండాలా? నేను కూడా ఆర్టిస్ట్‌నే. 9గంటల వరకూ వేచి చూశా. నువ్వు రాలేదు’ అని నేను కూడా కాస్త గట్టిగానే మాట్లాడా! ఆ తర్వాత ఆ సినిమా నుంచి నన్ను తీసేశారు.
నామీద ఆయనకు పీకల వరకూ కోపం ఉంది. అయితే, నేను మాత్రం ఆయనపై ఎప్పుడూ కోపం పెట్టుకోలేదు. 30ఏళ్లుగా పరిశ్రమలో ఉంటున్నా. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్‌గారి అభిమానిని. ఆయనను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. మీ అభిమానుల్లా నేను అసభ్య పదజాలంతో మాట్లాడను. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతా! నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు నిన్న రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్‌లు వచ్చాయని పోసాని అన్నారు.
పవన్‌కల్యాణ్ ప్రజల మనిషి కాదు. ఇండస్ట్రీ మనిషి అంతకన్నా కాదు. కేవలం తనని తాను ప్రేమించుకుంటారు. కనీసం ఐదారు కి.మీ. కూడా నడవలేని పవన్.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కి.మీ. నడిచిన జగన్‌తో పోల్చుకుంటారా? ప్రభుత్వ పాఠశాలలు ఎలా మార్పు చెందాయో ఎప్పుడైనా చూశారా? విద్యార్థులకు అన్నీ ఉచితంగా ఇవ్వటంతో పాటు, స్కూల్‌కు వెళ్లిన వాళ్లకు జగన్ ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తోంది. చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి, జగన్‌కు వదలి వెళ్లారు. వాటిని తీరుస్తూ, వడ్డీలు కడుతూ, కొత్త అప్పులు తెస్తూ, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవటం మామూలు విషయం కాదు. చంద్రబాబులా జగన్ ఏమీ విదేశీ పర్యటనలు చేయలేదు. పవన్ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారు. కొన్నాళ్లు తెదేపాను, ఇంకొన్నాళ్లు భాజపాను, ఇప్పుడు వైకాపాను విమర్శిస్తున్నారు. వామపక్షాలతో కలిసి పనిచేశారు. ఎప్పుడైనా వాళ్లతో కలిసి ఆలోచనలను పంచుకున్నారా’’ అంటూ మండి పడ్డారు.
ఒకవేళ నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే, ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే నిర్మాతలు అక్షయ పాత్రలు. వాళ్ల పుణ్యంతోనే మేము అన్నం తింటున్నాం. హీరోలు, హీరోయిన్‌లు వస్తుంటారు.. పోతుంటారు. నాకూ చిరంజీవికి రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, వ్యక్తిగతంగా మంచిగానే ఉంటాం. ఏం చెప్పినా, విని అర్థం చేసుకునే పరిణతి ఆయనకు ఉంది. చిరంజీవి పార్టీ పెట్టి పొరపాటు చేశారు. జనం శిక్షించారు. అయిపోయింది. ఆయన వ్యక్తిత్వాన్ని దూషించకూడదు.
చంద్రబాబు పార్టీ మనషులు చిరంజీవి కుటుంబాన్ని విమర్శించారు. నువ్వు మాట్లాడావా? నేను మాట్లాడా. చిరంజీవి కోసం చచ్చిపోవడానికి సిద్ధమని నేను చెప్పాను. ఎక్కడ ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి? నీకు తెలియదు. మిమ్మల్ని మారమని నేను చెప్పడం లేదు. మీరు మారరని నాకు తెలుసు. అయితే, కొంచెం విజ్ఞతతో మాట్లాడండి. మీరు అలా మాట్లాడితే, వీళ్లు ఇలా మాట్లాడతారు. మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజమైనా ఉందా? పెద్ద హీరో అయిన మీరు అలా అనిపించుకోవడం బాగుందా? జగన్ పార్టీలో ఎవరైనా సరిగా పనిచేయకపోతే నేనే ఫోన్ చేసి చెబుతా. మీ రెమ్యునరేషన్ ఎంతో కూడా చెప్పలేకపోయారు. ‘కనీసం 10 అనుకోండి’ అన్నారు. 10 కాదు 15 ఇస్తా నాలుగైదు సినిమాలు చేస్తారా? మీ రెమ్యునరేషన్ రూ.50కోట్లు కాదా? అబద్ధమైతే చెంప పగలకొట్టండి’’ అంటూ మండి పడ్డారు.
చిరంజీవిగారు పార్టీ పెట్టిన కొత్తలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆయనను అప్రతిష్టపాలు చేద్దామని కొందరు టీడీపీ నాయకులు అనుకున్నారు. చిరంజీవి కుమార్తె గురించి, ఇంట్లో మహిళల గురించి లైవ్‌లో ఘోరంగా మాట్లాడారు. ఈ విమర్శలు చిరుకు తెలిసి అన్నం తినకుండా వ్యాన్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కన్నబాబు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆయన నాకు సన్నిహితుడు. కన్నబాబుగారు నాకు ఫోన్ చేశారు. జరిగింది చెప్పారు. నేను ‘అన్నయ్యకు ఫోన్ ఇవ్వండి’ అంటే ఆయనకు ఇచ్చారు. ఆయన గద్గద స్వరంతో ‘పోసాని.. రాజకీయాలకు, నా భార్యాబిడ్డలకు ఏం సంబంధం’ అని వాపోయారు.
వెంటనే ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్‌కు వెళ్లి, ప్రెస్‌మీట్‌పెట్టి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించా. అంతే అటు వైపు నుంచి సమాధానం రాలేదు. అప్పుడు చిరంజీవి సన్నిహితులతో ‘పోసాని నా గుండెల్లో ఉన్నారు’ అని అన్నారట. ఆరోజు మీ అన్నయ్య కుటుంబాన్ని వాళ్లు అన్నేసి మాటలు అంటే పవన్‌కల్యాణ్, ఆయన అభిమానులు ఎక్కడ ఉన్నారు? బయటకు వచ్చి ప్రశ్నించలేదే? బెల్లంకొండ సురేశ్‌గారు చిరంజీవిని ఏదో అన్నారని, అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇది సినిమా ఇండస్ట్రీ విషయం మీకు సంబంధం లేదు’ అని చిరంజీవి వారిపై కేకలేసి పంపించివేశారు. మీరు, మీ ఫ్యాన్స్ సైకోలు.
ఇతర హీరోల ఫంక్షన్‌లకు వెళ్లి ‘పవన్.. పవర్‌స్టార్’ అని అరుస్తుంటారు. నాకు ఇప్పటివరకూ ఆరేడు వేల మెస్సేజ్‌లు వచ్చాయి. మంచు విష్ణు నామినేషన్ వేయడానికి వెళ్తే, అక్కడకు కూడా 10మంది పవన్ ఫ్యాన్స్ వచ్చారట. పవన్‌కల్యాణ్.. నీ సైకో ఫ్యాన్స్‌కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక నుంచి రాజకీయాల్లో నా గురించి మాట్లాడు. నన్ను టార్గెట్ చెయ్. నాది తప్పు అయితే, నీకు దండం పెడతా. అంతేకానీ, నా కుటుంబ సభ్యులను ఈ వివాదంలో లాగొద్దు. చిరంజీవిగారు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు.