CoWIN Registration: కో–విన్ 2.0 పోర్టల్ ద్వారా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా? ఆరోగ్య సేతు యాప్ ద్వారా కరోనా వ్యాక్సిన్ అపాయిట్‌మెంట్ ఎలా తీసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకోసం
ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
New Delhi, Mar 2: దేశంలో కరోనా వ్యాక్సిన్ రెండో దశ పంపిణీ మొదలైంది. ఈ దశలో వ్యాక్సిన్ కోసం తొలి రోజు దాదాపు 25 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 24.5 లక్షల మంది సాధారణ ప్రజలు ఉన్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మిగతా వారిలో వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లు ఉన్నట్టు పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారు, 45 ఏళ్లు దాటి కోమార్బిడిటీస్‌తో బాధపడుతున్న వారు టీకా కోసం కొ-విన్ 2.0 పోర్టల్ (CoWIN Registration), ఆరోగ్యసేతు యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
నిన్నటి నుంచే ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇలా చేసుకోలేనివారు వ్యాక్సిన్ కేంద్రాలకు నేరుగా వెళ్లి కూడా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అర్హులు కో-విన్ యాప్ ద్వారా టీకా తీసుకోవాలంటే ముందుగా కో–విన్ 2.0 పోర్టల్ (http://cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, అపాయింట్‌మెంట్ పొందాల్సి ఉంటుంది.
కో–విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘కరోనా టీకా కోసం కో–విన్ పోర్టల్ (www.cowin.gov. in) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అపాయింట్‌మెంట్ పొందాలి. రిజిస్ట్రేషన్ల (CoWIN Vaccine Registration Process) కోసం కో–విన్ యాప్ అంటూ ఏదీ లేదు. ప్లేస్టోర్‌లో ఉన్న కో–విన్ యాప్ కేవలం అడ్మినిస్ట్రేటర్ల కోసమే. పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
టీకా తీసుకునే సమయం వరకూ లబ్ధిదారులు పోర్టల్‌లో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు, తొలగింవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రికార్డు మొత్తం లాక్ అవుతుంది. వివరాలను మార్చడానికి వీలుండదని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది.
ప్రాసెస్ ఎలా ఉంటుందంటే..?
1. కో–విన్ 2.0 పోర్టల్‌లో ముందుగా మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
2. ఫోన్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్(ఓటీపీ) వస్తుంది. మీకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, తర్వాత వెరిఫై బటన్ నొక్కాలి.
3. ఆ తరువాత రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి ప్రవేశిస్తారు.
4. పేరు, వయసు వంటి వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్‌లోడ్ చేయాలి.
5. ఒకవేళ 45 నుంచి 59 ఏళ్ల వయసుండి, వ్యాధులతో బాధపడుతూ ఉంటే గుర్తింపు కార్డుతోపాటు ఆర్‌ఎంపీ సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా అప్‌లోడ్ చేయాలి.
6. రిజిస్ట్రేషన్ బటన్ నొక్కాలి.
7. ఇప్పుడు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి.
8. ఒకే ఫోన్ నంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది(గరిష్టంగా నలుగురు) రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ‘యాడ్ మోర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. వారి వివరాలు నమోదు చేయాలి.
9. ‘షెడ్యూల్ అపాయింట్‌మెంట్’ బటన్ నొక్కాలి.
10. రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారంతోపాటు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి.
11. ఒక స్లాట్‌ను ఎంచుకొని, ‘బుక్’ బటన్‌పై నొక్కాలి.
12. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్‌మెంట్‌తో కూడిన సందేశం ఫోన్‌కు వస్తుంది.
13. వ్యాక్సినేషన్ కంటే ముందు వరకూ అపాయింట్‌మెంట్‌ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే తేదీ, సమయం మార్చుకోవచ్చు. ఇందుకోసం అదే ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లో మళ్లీ లాగిన్ కావాలి.
14. టీకా తీసుకున్న తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు.
ఇక ఆరోగ్య సేతు యాప్ ద్వారా ఎలా చేయాలి
కరోనా టీకా తీసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా అపాయింట్‌మెంట్ పొందవచ్చు.
1. మొబైల్ ఫోన్‌లో ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. యాప్ ఓపెన్ చేసి, కో–విన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
3. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి.
4. ఫోన్ నెంబర్, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
5. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి వెళ్లాలి. దీనితర్వాత కో–విన్ 2.0 పోర్టల్‌లోని ప్రక్రియనే యథాతథంగా అనుసరిస్తూ ముందుకెళ్లాలి.