Telangana Rains Update: తెలంగాణలో రానున్న నాలుగైదు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
Hyderabad, Nov 27: తెలంగాణకు (Telangana) వాతావరణ శాఖ భారీ వర్షాల (Heavy Rains) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడనున్న అల్పవాయు పీడనంతో రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. అల్పపీడనం రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. దీంతో ఏపీతో పాటు తెలంగాణ రాష్ర్టాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వర్షాలు పేర్కొంది. నల్లగొండ, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, జగిత్యాల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టు వెల్లడించింది.
83% లోటు వర్షపాతం
ఈశాన్య రుతుపవనాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా 83 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతం 117.5 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటి వరకు కేవలం 20.4 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అత్యల్ప వర్షపాతం నిర్మల్ జిల్లాలో 0.6 మి.మి, ఆ తర్వాత వరుసగా జగిత్యాల జిల్లాలో 2 మి.మి, పెద్దపల్లిలో 5.7 మి.మి, రాజన్నసిరిసిల్లలో 7 మిల్లీమీటర్లు, సిద్దిపేటలో 9.3, మెదక్ 12.2, కరీంనగర్ 12.7 , మహబూబ్‌నగర్‌లో 13.8, ఆదిలాబాద్‌లో 15.4, కామారెడ్డిలో 15.7 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఖమ్మం జిల్లా వైరాలో 4.5 మిల్లీమీటర్లు, కొణిజర్ల 2.4, బోనకల్‌లో 2, భద్రాద్రి కొత్తగూడెం ముల్కలపల్లెలో 3.4, సూర్యాపేట జిల్లా కోదాడలో 1.8, తిరుమలగిరిలో 0.5, సూర్యాపేటలో 0.2, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా పాల్వంచలో 1 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ తెలిపింది. అక్టోబర్‌లో సాధారణ వర్షపాతం 95.8 మిల్లీమీటర్లు కాగా, 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నవంబర్‌లో ఇప్పటి వరకు 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది.