Weather Forecast: రేపే బంగాళాఖాతంలో అల్పపీడనం,ఆగస్టు 10 వరకు తెలంగాణలో భారీ వర్షాలు, ఏపీలో ఈ నెల 8 వరకు జోరు వానలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన వాతావరణశాఖ

నైరుతి సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది.

Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, August 6: వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. నైరుతి సీజన్‌ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మరింత జోరందుకునే అవకాశం (Weather Forecast) ఉందని పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడురోజులు (heavy rains in store until Tuesday)అక్కడక్కడ అతిభారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తు తం రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. ఈ ద్రోణి బికనీర్, కోటా, రైసెన్, రాయ్‌పూర్, దిఘా మీదుగా ఆగ్నేయ దిశ నుంచి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ఉంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణికి అనుబంధంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్‌ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి సగటున 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నట్లు వివరించింది.

ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణలో (Telangana Rains) గత రెండ్రోజులుగా భారీ వర్షా లు నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల రెండో వారంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి, అతిభారీ, అత్యంత భారీ వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

నెల 7న బంగాళాఖాతంలో అల్పపీడనం, రానున్న రెండు రోజులు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన, చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు

ప్రస్తుతం నైరుతి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా 40.42 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. శుక్రవారం ఉదయానికి 74.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సగటు సాధారణ వర్షపాతం కంటే 84 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.ఇక నైరుతి సీజన్‌ పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా 72.5 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. ఇప్పటికే అంతకు మించి వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో సీజన్‌ ముగిసే నాటికి రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి భువనగరి, వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షం కురవనుందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సిద్దిపేట, వికారబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 10 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

ఏపీలో 8 వరకు వర్షాలు

రేపు ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవడంతో పాటు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంట గాలులు వీస్తాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు యానాంలోనూ వర్షాలతో ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఈ ప్రాంతాల్లో ఆగస్టు 8 వరకు వర్షాలు కురువనున్నాయి.

దక్షిణ కోస్తాలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో ఆగస్టు 7 వరకు ఓ మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలున్నాయి. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడతారని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.