ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure) ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై (Bay of Bengal) ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి.
ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
ఇక తెలంగాణలో రానున్న రెండు రోజులు పలు ప్రాంతాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, ఈ నెల 7-9 మధ్య కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏడో తేదీన 12 నుంచి 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, 8, 9 తేదీల్లో అంతకుమించి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు (NDRF) సమాచారం ఇచ్చినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, 7న లేదంటే ఆ తర్వాత వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇది మూడో అల్పపీడనం..
నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది.