Fuel Prices: 16 రోజుల్లో రూ. 10 పెంపు, పెట్రోల్, డీజిల్‌పై కొనసాగుతున్న బాదుడు, ముంబైలో రూ.120 దాటిన లీటర్ పెట్రోల్ ధర, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే!
లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు చొప్పున పెంచగా.. డీజిల్ లీటర్ కు 87పైసలు చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో హైదారాబాద్ (Hyderabad) నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కి పెరిగింది.
New Delhi, April 06: దేశవ్యాప్తంగా సామాన్యులకు పెట్రో వాత తప్పడం లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న ఇంధన ధరలతో (Fuel Prices) సామాన్యుల అవస్థలు అగమ్యగోచరంగా మారాయి. పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా సామాన్యులపై మరింత భారం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో దేశీయంగా పెట్రోల్ (Petrol), డీజిల్ (Diesel) ధరలు పెరిగిపోతున్నాయి. బుధవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు (Prices Hiked) అమాంతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్‌పై 90 పైసలు చొప్పున పెంచగా.. డీజిల్ లీటర్ కు 87పైసలు చొప్పున పెరిగాయి. తాజా పెంపుతో హైదారాబాద్ (Hyderabad) నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.119.49కి పెరిగింది. అలాగే డీజిల్ ధర రూ. 105.49కి పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ లీటర్ పెట్రోల్ ధర రూ. 105.41కి పెరిగింది. డీజిల్ లీటర్ ధర రూ.96.67కి పెరిగింది.
ఆర్థిక రాజధాని ముంబైలో(Mumbai) లీటర్ పెట్రోల్ ధర రూ.120.51కి పెరగగా, డీజిల్ ధర రూ. 104.77కి పెరిగింది. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. మార్చి 22 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు రూ. 10.20 చొప్పున పెరిగాయి. విదేశాల నుంచే 85 శాతం చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు వరుసగా పెరిగిపోతుండటంతో ఆటో, క్యాబ్ డ్రైవర్లు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ (Gas) ధరల పెంపుతో నానా అవస్థలు పడుతున్నారు. వాహనాలు అమ్మి ఇతర వృత్తుల్లోకి డ్రైవర్లు వెళ్లిపోతున్నారు. రోజువారీ క్యాబ్, ఆటో డ్రైవర్లకు నిత్యావసరాల ధరలు కూడా మరింత భారంగా మారాయి.
వ్యవసాయాన్ని కూడా ఇంధన ధరలు మరింత భారంగా మారనున్నాయి. పంట పెట్టుబడి పెరుగుతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ముడి చమురు ధరలు పారిశ్రామికరంగంపైనా కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రవాణా ఛార్జీలు పెరగడంతో ముడి పదార్థాల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ ధరల పెరుగుదలతో సూక్ష్మ,చిన్న,మధ్య తరహా పరిశ్రమలు మూతపడే అవకాశం కనిపిస్తోంది.