Balakot Airstrikes 1st Anniversary: బాలాకోట్ వైమానిక దాడులకు ఏడాది, సరిహద్దులు దాటేందుకు వెనుకాడబోమన్న రక్షణ మంత్రి, బాలాకోట్ దాడితో ఉగ్రవాదులు బయపడ్డారన్న బీఎస్ ధనోవా
పాకిస్థాన్‌లోని (Pakistan) ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బాలాకోట్ శివార్లలో ఉన్న ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2019లో ఇదే రోజున మెరుపు దాడులు చేసింది.
New Delhi, February 26: పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో (Balakot) జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలపై భారత్ వైమానిక దాడులు జరిపి సరిగ్గా నేటికి ఏడాది (Balakot Airstrikes 1st Anniversary) పూర్తయింది. పాకిస్థాన్‌లోని (Pakistan) ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న బాలాకోట్ శివార్లలో ఉన్న ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 2019లో ఇదే రోజున మెరుపు దాడులు చేసింది.
1971 యుద్ధం తర్వాత భారత బలగాలు అంతర్జాతీయ సరిహద్దు దాటి ముందు జాగ్రత్త చర్యగా దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 14న పాకిస్థాన్ అండతో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్‌పై మెరుపు దాడులు చేసింది.
78 వాహనాల్లో 2547 మంది జవాన్లను తరలిస్తుండగా.. వీరిని లక్ష్యంగా చేసుకొని జైషే మహ్మద్‌కి చెందిన ఓ ఉగ్రవాది భారీ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ వైపు దూసుకొచ్చాడు. 40 మంది జవాన్లను బలిగొనడం కోసం ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి 80 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించాడని తేలింది. ఈ ఘటనతో యావధ్భారతం పగతో రగిలిపోయింది.
అభినందన్ వర్థమాన్ సాహసానికి మరో గుర్తింపు
పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (Indian Airforce) ఫైటర్ జెట్లు బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద క్యాంపులపై బాంబులు (2019 Balakot airstrike) జాడ విరిచాయి. వివిధ ఎయిర్‌బేస్‌ల నుంచి బయల్దేరిన భారత యుద్ధ విమానాలు ఫిబ్రవరి 26న తెల్లవారుజామున జమ్మూ కశ్మీర్లో వాస్తవాధీన రేఖను దాటాయి.
కన్నులపండువగా భారత వాయుసేన 87వ వార్షికోత్సవం
స్పైస్ 2000 గైడెడ్ మిస్సైళ్లతో ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో జైషే మహ్మద్‌కు చెందిన శిక్షణా శిబిరం ధ్వంసమైంది. భారీ సంఖ్యలో ఉగ్రవాదులు, శిక్షకులు, సీనియర్ కమాండర్లు, జిహాదీలు ప్రాణాలు వదిలారు.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
బాలాకోట్ ఉగ్రవాద శిబిరంపై భారత వైమానిక దళం (ఐఏఎఫ్) మెరుపు దాడులు నిర్వహించి సంవత్సరం పూర్తైన సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath singh) ట్విటర్ వేదికగా స్పందించారు. ఉగ్రవాదం నుంచి దేశానికి కాపాడుకునేందుకు అవసరమైతే సరిహద్దులు దాటి వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని కేంద్ర రక్షణ మంత్రి పేర్కొన్నారు. బాలాకోట్ వైమానిక దాడులు జరిగి సంవత్సరం పూర్తైన సందర్భంగా దేశం యావత్తూ సంబరాలు చేసుకుంటోందని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
Rajnath Singh's Tweet
శౌర్యవంతులైన ఐఏఎఫ్ వీరులు చేపట్టిన అత్యంత విజయవంతమైన ఆపరేషన్ ఇది. బాలాకోట్ ఆపరేషన్‌లో విజయం సాధించడం ద్వారా తీవ్రవాదులకు భారత్ గట్టి సందేశాన్ని ఇచ్చిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. బాలాకోట్ వైమానిక దాడుల కోసం అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ఆయన కొనియాడారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం గత ప్రభుత్వాలకంటే భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నదని ఆయన పేర్కొన్నారు.
Balakot AirStrike Exclusive Video
ఇక ఇప్పుడు ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అవసరమైతే సరిహద్దులు దాటేందుకు కూడా భారత్ వెనుకాడబోదని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో సరికొత్త మార్పు తీసుకొచ్చిన నరేంద్ర మోదీకి రక్షణమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉగ్రవాదం పట్ల భారత వైఖరిని, పోరాట పంథాని సమూలంగా మార్చిన ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు. 2016 సర్జికల్ దాడులు, 2019 బాలాకోట్ వైమానిక దాడులు ఈ మార్పునకు స్పష్టమైన సంకేతాలని రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు.
వాయుసేన మాజీ అధిపతి బీఎస్ ధనోవా
ఈ సందర్భంగా వాయుసేన మాజీ అధిపతి బీఎస్ ధనోవా (BS Dhanoa) నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. బాలాకోట్ దాడితో ఉగ్రవాదులు భయపడ్డారని, అందుకే ఆ దాడి తర్వాత భారత్‌లో ఎలాంటి పెద్ద ఉగ్ర ఘటనలు చోటుచేసుకోలేదని ధనోవా అన్నారు. ఇప్పుడు మేం వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సంతృప్తిగా అనిపిస్తుందన్నారు.
Here's ANI Tweet
బాలాకోట్ ఆపరేషన్ నుంచి మేం ఎంతో నేర్చుకున్నామని తెలిపారు. మేం చేపట్టే ఆపరేషన్లలో ఇది కీలకమైన మార్పు. పాక్ భూభాగంలో ఉగ్ర శిబిరాలపై దాడులు జరుపుతామని ఆ దేశం ఎన్నడూ ఊహించి ఉండదు. కానీ మేం దాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
గతేడాది మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ఎలాంటి ఉగ్రదాడులు జరగకుండా బాలాకోట్ దాడి నిరోధకంగా పనిచేసిందని తెలిపారు. వైమానిక దాడులతో ముష్కరులకు ముచ్చెటమలు పట్టాయని అన్నారు. మళ్లీ ఉగ్ర ఘటనలు జరిగితే మా స్పందన మరింత తీవ్రంగా ఉంటుందనే విషయం ఉగ్రవాదులకు అర్థమైంది. అందుకే బాలకోట్ దాడి తర్వాత దేశంలో ఎలాంటి పెద్ద ఉగ్ర ఘటనలు చోటుచేసుకోలేదన్నారు.