IAF releases promo video featuring Balakot airstrike (photo-Twitter)

New Delhi, October 4: పాకిస్తాన్ పుల్వామాదాడులకు ప్రతీకార చర్యలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో భారత వాయుసేన బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడులు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియోను ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చాలా రోజుల తర్వాత విడుదల చేసింది.

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఈ వీడియోను రిలీజ్ చేశారు. కాగా భారత వాయుసేన దళాధిపతిగా ఇటీవలే భదౌరియా బాధ్యతలు స్వీకరించారు. ఎయిర్ మార్షల్ బీఎస్ దనోవా ఎయిర్ చీఫ్‌గా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ఆర్‌కే భదౌరియా బాధ్యతలు తీసుకున్నారు.

బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై మెరుపుదాడుల వీడియో

భారత వైమానిక యుద్ధ విమానాలు(మిరాజ్-2000) గాల్లోకి ఎగురుతున్న, ఉగ్రవాద శిబిరాలపై బాంబులు జారవిడుస్తున్న దృశ్యాలతో ఈ ప్రమోషనల్ వీడియోని రూపకల్పన చేశారు. మొత్తం ఒక నిమిషం 24 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిబిరాలపై బాంబులను జారవిడిచి ఆ శిబిరాలను ధ్వంసం చేయడం కనిపిస్తుంది. ఫిబ్రవరి 26న మిరాజ్-2000 ఫైటర్లు.. పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశాయి. బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. ఈ వీడియోలో వాయిస్ ఓవర్ ఉంది. ఫిబ్రవరి 14న పుల్వామాలో ఏ విధంగా ఉగ్రదాడి జరిగింది... దానికి ప్రతీకారంగా భారత వైమానిక దళం ఏ విధంగా దాడులు చేసింది తెలుపుతూ వాయిస్ ఓవర్ ఉంది. ఈ ఘటనలో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రధాని మోడీ ప్రకటించారు.ఈ మెరుపుదాడిలోనే అభినందన్ వర్థమాన్ కమాండ్ చేస్తున్న యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలడం, ఆయన సురక్షితంగా బయటపడి, పాక్ సైన్యం చేతులకు చిక్కడం , ఆ తర్వాత వర్థమాన్ ను పాక్ ఇండియాకి అప్పగించడం వంటి సంఘటనలు జరిగాయి.

వీడియో రిలీజ్ వేదికగా పాకిస్తాన్ కు ఐఏఎఫ్ చీఫ్ భదౌరియా హెచ్చరికలు పంపారు. పాక్ తన తీరుని మార్చుకోవాలన్నారు. చొరబాట్లు ఆపేయాలన్నారు. లేకపోతే బాలాకోట్ తరహా దాడులు రిపీట్ అవుతాయన్నారు. శత్రు దేశం నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు ఉందని ఆయన చెప్పారు. బాలాకోట్ దాడులకు ప్రిపేర్ అయ్యే ప్రణాళికను అమలు చేశామని, భవిష్యత్తులో జరిగే దాడులకు కూడా ఇప్పుడే సిద్ధంగా ఉంటున్నామని తెలిపారు. ఏ సవాళ్లనైనా ఎదుర్కొనే సత్తా, సామర్థ్యం భారత వాయుసేనకు ఉందన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి తమకు పూర్తిగా సమాచారం ఉందని సరైన సమయంలో సరైన దాడులకు దిగుతామన్నారు.