Balakot Hero Abhinandan leads MiG-21 Bison formation on Air Force Day ( Photo-PTI)

New Delhi, October 8:  భారత వాయుసేన 87వ వార్షికోత్సవం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్‌లో ఎంతో ఉత్సాహంగా, కన్నులపండువగా జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సైనిక విన్యాసాలు అందర్నీ అకట్టుకున్నాయి. ముఖ్యంగా బాలాకోట్ హీరో అభినందన్ వర్థమాన్ నడిపిన మిగ్-21 బైసన్ విమానాన్ని మరోసారి నడిపి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అభినందన్ వర్ధమాన్ సహా బాలాకోట్ దాడుల్లో పాల్గొన్న వాయిసేన పైలెట్లు యుద్ధ విమానాలు నడిపి ఇండియన్ ఆర్మీ సత్తాను మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.

గత ఫిబ్రవరి 27న జరిగిన 'డాగ్‌ఫైట్'లో పాక్ ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కూల్చివేసిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఈ పరేడ్‌లో మిగ్-21 బైసన్ విమానాన్ని నడిపి తన సాహసకృత్యాలను మరోసారి భారతీయులకు గుర్తు చేశారు. మూడు మిరేజ్ 2000 విమానాలు, రెండు సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు 'ఎవేంజ్ ఫార్మేషన్'లో గగనతలంలో దూసుకుపోవడం ఐఏఎఫ్ వేడుకల్లో పాల్గొన్న ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

అభినందన్ వర్ధమాన్ మరోసారి..

భారతదేశ 87వ 'ఎయిర్‌ ఫోర్స్ డే' సందర్భంగా వైమానిక దళ బృందాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్‌ ద్వారా హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సేవలు యావత్‌ దేశం గర్వపడేలా ఉన్నాయని ప్రధాని వారిపై ప్రశంసలు కురిపించారు. ఈ రోజు వైమానిక దళం రోజ. గర్వించదగిన దేశం మన వైమానిక యోధులకు మరియు వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలుపుతుంది. భారత వైమానిక దళం భారతదేశానికి అత్యంత అంకితభావంతో,ఎక్స్ లెన్స్ తో దేశానికి సేవలందిస్తోంది అంటూ మోడీ ట్వీట్ లో తెలిపారు. ఘర్షణల సమయంలో,ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయపడుతూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశాన్ని కాపాడుతుందని మోడీ ప్రశంసించారు.

మోడీ ట్వీట్

కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం 87వ ఐఏఎఫ్ దినోత్సవం సందర్భంగా ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. అసమాన ధైర్యం, దృఢచిత్తం, వెలకట్టలేని సేవలకు ఐఏఎఫ్ నిదర్శనమని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐఏఎఫ్ సైతం తమ వాయుసేనకు, వారి కుటుంబాలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ధైర్యం, సాహసం, నిబద్ధత, అంకితభావం, పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని ట్వీట్ చేసింది.

ఎయిర్ షో 

ప్రతి సంవత్సరం.. IAF చీఫ్,ఆర్మీ,నేవీ సీనియర్ అధికారుల సమక్షంలో హిండన్ బేస్ దగ్గర ఎయిర్ ఫోర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అక్టోబర్ 8, 1932న IAF స్థాపించబడింది. అనేక కీలకమైన యుద్ధాలు, మైలురాయి మిషన్లలో IAF పాల్గొంది. ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా,ఈ రోజు ఘజియాబాద్ లోని హిండన్ ఎయిర్ బేస్ దగ్గర ఎయిర్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మొదటిసారి ఫైటర్ హెలికాప్టర్ అపాచీ, హెవీ లిఫ్ట్ హెలికాప్టర్ చినూక్ తన బలాన్ని చూపించింది. భారత వైమానిక దళాన్ని బలోపేతం చేయడానికి ఈ రెండు హెలికాప్టర్లను ఇటీవల భారత వైమానిక దళంలో చేర్చారు.