CM YS Jagan Letter Row: సీఎం వైయస్ జగన్ లేఖ ప్రకంపనలు, చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిమాండ్, ఢిల్లీ లాయర్ ఇంటిపై ఐటీ దాడులు, 217 కోట్ల రూపాయలు స్వాధీనం
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan), మరికొందరు దీనిని సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
New Delhi, October 16: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) రాసిన లేఖపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (Prashant Bhushan), మరికొందరు దీనిని సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ మీద చర్య తీసుకోవాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (Bar Council of India) డిమాండ్ చేసింది. తన స్వప్రయోజనాల కోసం న్యాయమూర్తులను బెదిరించేందుకే ఆయనీ లేఖ రాశారని.. దీనిని న్యాయవ్యవస్థ స్వతంత్రతపైనే దాడిగా అభివర్ణిస్తున్నామని కౌన్సిల్ చైర్మన్, సీనియర్ న్యాయవాది మనీష్ కుమార్ మిశ్రా గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణను (Justice NV Ramana) లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్‌రెడ్డి దుశ్చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత బార్ భుజస్కంధాలపైన ఉంది’ అని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. జగన్ చర్య కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని ఢిల్లీ బార్ అసోసియేషన్ పేర్కొంది. జస్టిస్ ఎన్‌వీ రమణ, ఆంధ్ర హైకోర్టు న్యాయమూర్తులపై ఆ సీఎం చేసిన ఆరోపణలు దురుద్దేశపూరితమైనవని తెలిపింది.
ఏపీ సీఎం జగన్ లేఖపై సుప్రీంకోర్టు ఫుల్ కోర్టును సమావేశపరిచి చర్చించి తీవ్రమైన చర్య తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డేకు ప్రముఖ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ గురువారం లేఖ రాశారు. జగన్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు, నల్లధనం, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని.. శిక్ష పడితే ఆయనకు కనీసం పదేళ్లు జైలు పడుతుందని తెలిపారు.
ఇదిలా ఉంటే పన్ను ఎగవేసినందుకు మరియు 217 కోట్ల రూపాయల "నగదు" అందుకున్నారనే ఆరోపణలతో ఆదాయపు పన్ను (ఐ-టి) శాఖ చండీఘడ్ న్యాయవాదిపై దాడులు (I-T raids Chandigarh advocate) చేసిందని పన్ను అధికారులు గురువారం తెలిపారు. శోధనల సమయంలో 5.5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. హర్యానా, జాతీయ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోని న్యాయవాదులతో సంబంధం ఉన్న 38 ప్రాంగణాలపై ఐటీ విభాగం బుధవారం దాడి చేసినట్లు ఐ-టి అధికారులు తెలిపారు.
న్యాయవాదిపై జరిపిన దాడుల సమయంలో 5.5 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సేషన్ (సిబిడిటి) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ న్యాయవాది సింగ్ అసోసియేట్స్ (Singh & Associates) పేరుతో న్యాయవాద రంగంలో కొనసాగుతున్నారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీతో ఈ వ్యవహారం ముడిపడి ఉందని సమాచారం.
పన్ను శాఖ కోసం పాలసీని రూపొందించే సిబిడిటి కి సంబంధించిన ఒక కేసులో న్యాయవాది "ఒక క్లయింట్ నుండి రూ .117 కోట్లు నగదు రూపంలో అందుకున్నాడు, అయితే అతను తన రికార్డులలో కేవలం 21 కోట్ల రూపాయలు మాత్రమే చూపించాడు, అది చెక్ ద్వారా పొందింది" అని ఐటీ అధికారులు తెలిపారు. మరొక సందర్భంలో, ప్రభుత్వ రంగ సంస్థతో మధ్యవర్తిత్వ చర్యల కోసం మౌలిక సదుపాయాలు మరియు ఇంజనీరింగ్ సంస్థ నుండి 100 కోట్ల రూపాయల నగదును అందుకున్నట్లు సిబిడిటి పేర్కొంది. అయితే ఆ న్యాయవాది పేరు మాత్రం బయటకు చెప్పలేదు.
ఇక న్యాయమూర్తులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో స్వతంత్ర విచారణ జరిపించాలని, ఆరోపణలు ప్రజల్లోకి వెళితేనే చర్యలకు వీలుంటుందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అభిప్రాయపడ్డారు.ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటంలో కానీ, ఆ లేఖను బయటపెట్టడంలో కానీ ఎలాంటి తప్పూ లేదని అన్నారు.
ప్రజల గొంతు నొక్కేయడం ద్వారా న్యాయ వ్యవస్థలో విశ్వసనీయత నిలబడదని ఆయన స్పష్టంచేశారు. తాజా వ్యవహారంపై ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా విచారణ జరుపుతారని తాను భావిస్తున్నట్లు ప్రశాంత్ భూషణ్ తెలిపారు. దీంతో పాటు అమరావతి ల్యాండ్ స్కామ్ ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటాన్ని తప్పుపట్టారు.