Ajeya Kallam Press Meet: న్యాయవ్యవస్థతో ఏపీ ప్రభుత్వం ఢీ, ఏపీ హైకోర్టు జడ్జీల తీర్పుల తీరుపై సీజేఐకి లేఖ రాసిన ఏపీ సీఎం వైయస్ జగన్, మీడియా సమావేశంలో కీలక విషయాలను వెల్లడించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం
AP Principal Advisor Ajeya Kallam (Photo Video Grab)

Amaravati, Oct 11: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై ఏపీ హైకోర్టు స్టేలు విధిస్తున్న సంగతి విదితమే. అయితే దర్యాప్తు దశలో స్టే ఇవ్వవద్దని సుప్రీం కోర్టు పదే పదే చెబుతున్నా.. రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చుకుంటూ వెళుతోంది. దీంతో ఏపీలో ఏ కేసులోనూ, పథకాల అమలులోనూ ఎటువంటి పురోగతి కనపడటం లేదు. రాష్ట్ర ప్రభుత్వంపై (AP Govt) తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అని ఏపీ ప్రభుత్వం ఆరా తీస్తే కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని తెలుస్తోంది. సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ (Justice Ramana) జోక్యంతో ఇవన్నీ జరుగుతున్నాయని గ్రహించిన ఏపీ ప్రభుత్వం ఈ విషయాలను ఆధారాలతో సహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డేకు అందజేసింది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయటమే కాక... తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌తో కలిసి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఎలా ఆస్తులను పోగేసుకున్నారో అందులో వివరించారు. జస్టిస్‌ రమణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు మామూలు న్యాయవాదిగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఎన్ని ఉత్తర్వులిచ్చారో కూడా ముఖ్యమంత్రి ఆధారాలతో సహా వివరించారు.

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు? ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన ఏపీ హైకోర్టు, తదుపరి విచారణ నవంబర్‌ 2కి వాయిదా

వీటన్నిటితో పాటు చంద్రబాబు నాయుడికి, జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ( Justice N.V. Ramana) అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించే మరో ఆధారాన్ని కూడా సీఎం తన లేఖలో ప్రస్తావిస్తూ అందజేశారు. ఈ మేరకు ఆధారాలను కూడా సీజేఐకి (CJI) అందజేసినట్లు శనివారం ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం (Andhra Pradesh Principal Advisor Ajeya Kallam) తెలియజేశారు.

Here's CM YS Jagan Letter

అన్ని ఆధారాలను సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 8న అందించినట్లు వెల్లడించారు. నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో మీడియా సమావేశంలో ఆయన పలు అంశాలు వెల్లడించారు

అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, అక్టోబర్‌ 15 నుంచి అమల్లోకి.., మాస్క్ లేకుంటే నో ఎంట్రీ

అజేయ కల్లం ప్రెస్ మీట్లో వెల్లడించిన అంశాలు ఇవే

అమరావతి భూ కుంభకోణంగా ప్రభుత్వం పేర్కొంటున్న వ్యవహారంలో కేబినెట్‌ సబ్‌కమిటీ విచారణను, సిట్‌ దర్యాప్తును నిలిపేస్తూ ఇటీవల హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.వి.సోమయాజులు ఇచ్చిన ఉత్తర్వులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను దాఖలు చేయటం మీకు తెలుసు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి సైతం... ఈ కుంభకోణంలో మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిటింగ్‌ జడ్జి కుటుంబ సభ్యులపై జరుగుతున్న దర్యాప్తును నిలిపేశారు. అంతేకాక దానికి సంబంధించిన వార్తలు మీడియాలో రాకుండా గ్యాగ్‌ ఉత్తర్వులిచ్చారు. వీటినీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేశాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో జరుగుతున్న పరిణామాలను... ప్రత్యేకించి ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ జోక్యాన్ని దేశ ప్రధాన న్యాయమూర్తికి తెలియజేశాం. దీనికి సంబంధించిన వివిధ పత్రాలనూ ఈ నెల 8న ఆయనకు ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌ రెడ్డి అందజేశారని తెలిపారు.

జస్టిస్‌ ఎన్‌.వి.రమణ తాను హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నపుడు దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదించిన కేసుల్లో ఆయనకు అనుకూలంగా ఇచ్చిన ఉత్తర్వులైతే న్యాయ వ్యవస్థ దుర్వినియోగాన్ని బయటపెడతాయి. ఈ పరిణామాలన్నిటినీ సీజేఐకి లేఖ రూపంలో ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర హైకోర్టు వ్యవహారాలను జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేరుగా ఎలా ప్రభావితం చేస్తున్నారో తెలియజేశారు. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలను, దాంట్లో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి ముందు ఏపీ సీఎం ఉంచారని కల్లం వివరించారు.

మీడియా సమావేశంలో భాగంగా వివిధ పత్రాలను మీడియాకు కూడా అందజేసినా... అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి ఇటీవల దమ్మాలపాటి, సుప్రీం న్యాయమూర్తి కుమార్తెలపై ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని, దానికి సంబంధించిన ఫిర్యాదును మాత్రం ఇవ్వలేదు. హైకోర్టు ఈ వ్యవహారాన్ని మీడియాలో ప్రచురించకుండా “గ్యాగ్‌’ ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో ఇలా చేసినట్లు కల్లం తెలిపారు. అయితే ఈ విషాయన్ని సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి మాత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఈ విషయంలో ముందుకెళ్లేటపుడు అఫిడవిట్లతో సహా ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టంచేశారు.

ఏపీ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి హైకోర్టుపై, సుప్రీంకోర్టుపై, న్యాయవ్యవస్థపై అత్యంత గౌరవ ప్రపత్తులున్నట్లు కల్లం తెలిపారు. సీఎం తన లేఖలోనూ ఈ విషయం పేర్కొన్నారని చెప్పారు. “ఇదంతా కొద్ది మంది గౌరవ న్యాయమూర్తుల వ్యవహార శైలిని సుప్రీంకోర్టుకు వివరించే ప్రయత్నమే. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం గానీ ఎప్పుడూ చట్టాలకు, రాజ్యాంగానికి లోబడే పనిచేస్తాయి. ఏ వ్యవస్థతోనయినా గౌరవపూర్వకమైన విభేదాలే ఉంటాయి’’ అని కల్లం ఉద్ఘాటించారు.

సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నారని అజేయ కల్లాం ఆరోపించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు న్యాయవ్యవస్థను ఎంచుకున్నారని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో అధికార వికేంద్రీకరణ బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించిందని, ఆ వెంటనే ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రతివాదిగా చేస్తూ హైకోర్టులో 30 పిటిషన్లు దాఖలయ్యాయన్నారు.

ఏపీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరీని సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణ ప్రభావితం చేస్తున్నారని అజేయ కల్లాం ఆరోపించారు. సుప్రీం కోర్టు జడ్జి ఎన్వీ రమణ జోక్యం తర్వాతనే హైకోర్టులో పరిణామాలు మారిపోయాయన్నారు. చంద్రబాబు కోరుకున్నట్టుగా కొన్ని ముఖ్యమైన కేసులన్నీ జస్టిస్‌ శేషసాయి, జస్టిస్‌ సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ సోమయాజులు, జస్టిస్‌ రమేష్‌ బెంచ్‌కు మారిపోయాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం ఏకంగా న్యాయమూర్తులపైనే ఆరోపణలు చేయడం రాష్ట్రంలో సంచలనం రేపుతోంది.