Cable TV Prices Hike: కేబుల్ టీవీ వినియోగదారులకు బిగ్ షాక్, భారీగా పెరుగనున్న చార్జీలు, నెలవారీ టీవీ బిల్లులు పెంచుతూ పలు సంస్థల ప్రకటన
దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ (Broadcasters) సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
New Delhi, JAN 06: ఇంట్లో ఉన్నప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం.. రోజువారీ వార్తలు, ఇతర సమాచారం కోసం టీవీ చానెళ్లు (TV Channels) వీక్షిస్తుంటాం.. కరోనా మహమ్మారితో సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల కాలం వచ్చేసింది. కరోనా వేళ అందరూ వర్క్ ఫ్రం హోం కింద పని చేయడం, లెర్నింగ్ ఫ్రం హోం (WFH) ద్వారా పాఠాల బోధన అంతా ఆన్ లైన్ లోనే సాగింది. ఆ టైంలోనే అన్ని టీవీ చానెళ్లు మొబైల్ ఫోన్లలో కొన్ని కార్యక్రమాలు ఫ్రీగా అందుబాటులోకి తెచ్చాయి. కానీ, ఇప్పుడు కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ధరలతోపాటు కంటెంట్ ఖర్చులు పెరిగి పోవడంతో (Content Expenses) ఆయా టీవీ చానెళ్ల (TV Channels) సంస్థలకు ఖర్చులు ఎక్కువయ్యాయి. వాటిని వినియోగదారులపై మోపేందుకు బ్రాడ్ కాస్టర్లు (Broadcasters) సిద్ధం అయ్యాయి. దేశంలోని ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ (Broadcasters) సంస్థల్లో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, వయాకాం 18 సంస్థలు తమ ఖాతాదారుల నెలవారీ టీవీ బిల్లులు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
భారీగా స్పోర్ట్స్ ఈవెంట్లు ప్రసారం చేసే నెట్ వర్క్ 18, వయాకాం18 డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఇండియా కాస్ట్.. తమ కస్టమర్లపై చానెళ్ల సబ్ స్క్రిప్షన్ చార్జీ 20-25 శాతానికి పెంచనున్నట్లు ప్రకటించాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్ 9-10 శాతం, సోనీ 10-11 శాతం పెంచుతున్నట్లు తెలిపింది. డిస్నీ స్టార్ ఎంత చార్జీ పెంచుతున్నట్లు వెల్లడించలేదు. ప్రతిపాదిత చార్జీల పెంపుపై రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ (RIO)లో ప్రచురించిన 30 రోజుల తర్వాత పెంచిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు అమల్లోకి వస్తాయి. దీని ప్రకారం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి బ్రాడ్ కాస్టర్ల సబ్‌స్క్రిప్షన్ చార్జీలు పెరగనున్నాయి.