India Coronavirus: దేశంలో మళ్లీ కరోనా కల్లోలం, పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, స్కూళ్లు మూసివేత, మళ్లీ వణుకుతున్న మహారాష్ట్ర, ఏపీలో వ్యాక్సిన్ తీసుకున్న వృద్ధుడు మృతి, తెలంగాణలో పెరుగుతున్న కేసులు, తాజాగా దేశంలో 24,882 మందికి కరోనా

కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.

Coronavirus Outbreak. | (Photo- ANI)

New Delhi, Mar 13: దేశంలో గత 24 గంటల్లో 24,882 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 19,957 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,13,33,728కు (India Coronavirus) చేరింది.గడచిన 24 గంట‌ల సమయంలో 140 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,58,446కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,73,260 మంది కోలుకున్నారు. 2,02,022 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశవ్యాప్తంగా 2,82,18,457 మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,58,39,273 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,40,635 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

తెలంగాణలో క‌రోనా కేసులు (Telangana coronavirus) మ‌ళ్లీ పెరిగిపోతున్నాయి. కొత్త‌గా 216 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 168 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,933కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,97,363 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,652గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,918 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 749 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు.

దేశంలో మళ్లీ కొత్త కరోనా స్ట్రెయిన్ కలకలం, బెంగళూరులో నమోదైన రెండు సౌతాఫ్రికా స్ట్రెయిన్‌ వైరస్‌ కేసులు, బళ్లారిలోని ట్రామాకేర్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్న వైద్యులు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక ఆదేశాలను జారీ చేశారు. ప్రతి రోజు కనీసం 50 వేలకు తగ్గకుండా కోవిడ్ పరీక్షలను నిర్వహించాలని వైద్య అధికారులను ఆదేశించారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు ఆయన వర్చువల్ విధానం ద్వారా సమీక్ష నిర్వహించారు. కరోనా టెస్టింగులను పెంచాలని ఆయన ఆదేశించారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించి, కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల వైద్యాధికారులకు ఆదేశాలను జారీ చేశారు.

ఏపీలో పక్షవాతం, మధుమేహం, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వృద్ధుడు కరోనా వ్యాక్సిన్‌ (AP Corona Vaccine) వేయించుకున్న అనంతరం తీవ్ర అనారోగ్యానికి గురై మృతిచెందాడు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి వైద్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం ఒంగూరు గ్రామానికి చెందిన పల్లి కుటుంబరావు (65) వాచ్‌మెన్‌గా పనిచేస్తుంటాడు. పల్లి కుటుంబరావుకు కుటుంబ సభ్యులు ఈనెల 10న ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని వ్యాక్సినేషన్‌ సెంటర్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించారు. కొద్దిసేపు హాస్పిటల్‌లోనే ఉంచి పరిశీలించిన అనంతరం ఇంటికి తీసుకువెళ్లారు.

భారత్‌లో కరోనా సెకండ్ ఇన్నింగ్స్, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23,285 కేసులు నమోదు, మహారాష్ట్రలో వైరస్ వీరవిహారం, 14 వేలకు పైగా కొత్త కేసులు ఈ రాష్ట్రం నుంచే

అనంతరం కుటుంబరావుకు జ్వరం రావటంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. కానీ జ్వరం తగ్గకపోవటంతో శుక్రవారం ఏలూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించటంతో కుటుంబరావు మృతిచెందాడు. మృతుని కుమారుడు పవన్‌కుమార్‌ ఏలూరు టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై ఏలూరు టూటౌన్‌ ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కేంద్ర హాస్పిటల్‌ ఇన్‌ఛార్జ్, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ మాట్లాడుతూ.. కుటుంబరావు కోవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవటం వల్ల మృతిచెందలేదని, అతను పక్షవాతంతో బాధపడుతున్నాడని, మధుమేహం ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. పోస్టుమార్టం అనంతరం నివేదిక ఆధారంగా కుటుంబరావు మృతికి కారణాలు తెలుస్తాయని డాక్టర్‌ ఏవీఆర్‌ తెలిపారు.

మహారాష్ట్రలో (Maharashtra Caronavirus) రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతుండటంతో కొన్ని జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్, మరికొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్, ఇంకొన్ని ప్రాంతాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలో పుణే జిల్లాలో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్లు పుణే డివిజినల్‌ కమిషనర్‌ సౌరభ్‌ రావు తెలిపారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు రాత్రి 10 గంటల వరకే తెరవాలని, ఫుడ్‌ డెలవరీలు రాత్రి 11 గంటల వరకే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో మాత్రమే నడపాలని ఆదేశించారు. 10, 12 తరగతుల బోర్డు పరీక్షల ప్రిపరేషన్స్‌కు ఈ ఆంక్షలు అడ్డుగారావని పేర్కొన్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని కోరారు. సామాజిక కార్యక్రమాలు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు, రాజకీయ తదితర కార్యక్రమాలకు 50 మందికి మించి హాజరుకాకూడదని ఆదేశించారు. ఒకవేళ వీటిని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసు కేసులు పెడతామని హెచ్చరించారు.

ఇక పర్భణి, అకోలా జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించనున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. పర్భణి జిల్లాలోని నగర పరిమితులు, పట్టణాల్లో రెండు రోజుల కర్ఫ్యూ విధించాలని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ నిర్ణయించారు. శనివారం అర్ధరాత్రి మొదలై సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలిపారు. జిల్లాలోని మున్సిపల్‌ కౌన్సిల్స్, నగర పంచాయతీలకు 3 కిలోమీటర్ల పరిధి వరకు కర్ఫ్యూ ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీని నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వాహనాలు, మెడికల్‌ సోర్ట్స్, ఆస్పత్రులతో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు.

హోం డెలవరీలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతి ఉంటుందన్నారు. అలాగే వ్యాక్సిన్‌ తీసుకునే వారికి, కరోనా పరీక్షలు చేయించుకునే వారికి మినహాయింపు ఉంటుందన్నారు. ఎవరైన నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో ఉన్న ప్రార్థన మందిరాలు కూడా మార్చి 31 వరకు మూసే ఉంటాయని తెలిపారు. అందులోని పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు అకోలాలో శుక్రవారం రాత్రి 8 గంటల నంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు లాక్‌డౌన్‌ ఉంటుందని జిల్లా అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలో వివిధ జిల్లాలతో పోలిస్తే నాగ్‌పూర్‌లో కరోనా వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. దీంతో వైరస్‌ కట్టడిలో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నితిన్‌ రావుత్‌ ప్రకటించారు. అనంతరం పరిస్థితులను బట్టి లాక్‌డౌన్‌ కొనసాగించాలా? ఎత్తివేయాలా? అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలందించే కార్యాలయాలు, మార్కెట్లు, మెడికల్‌ షాపులు, కిరాణ షాపులు మినహా బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు ఇతరాలు అన్ని మూసే ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రావుత్‌ హెచ్చరించారు.

ఇక థానే నగరంలోని 11 కరోనా హాట్ స్పాట్లలో శనివారం నుంచి లాక్‌డౌన్ విధించారు. శనివారం నుంచి మార్చి 31వతేదీ వరకు థానేలో లాక్ డౌన్ విధించినట్లు నగర మున్సిపల్ కమిషనర్ విపిన్ శర్మ చెప్పారు. థానే నగరంలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులకు నిరోధించేందుకు లాక్ డౌన్ విధించామని మున్సిపల్ అధికారులు చెప్పారు. గత ఏడాది థానే నగరంలో 16 కరోనా హాట్ స్పాట్లలో లాక్ డౌన్ విధించారు.నిత్యావసర వస్తువులు అందించే మెడికల్ షాపులు, డెయిరీ, కిరాణ దుకాణాలు, కూరగాయల దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు.

థానే నగరంలోని పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని అధికారులు ఆదేశించారు.సినిమాహాళ్లు, పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, బార్ లు, ఆడిటోరియాలను మూసివేశారు. థానే నగరంలో గురు, శుక్రవారాలు రెండు రోజుల్లోనే కరోనాతో ఆరుగురు మరణించారు. థానే జిల్లాలో 8,091 యాక్టివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా నిరోధానికి మహారాష్ట్రలోని పర్బనీ, ధూలే, నాగపూర్ ప్రాంతాల్లో లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించారు.