New Delhi, March 12: భారత్‌లో మొన్నటివరకు తగ్గుతూ పోయిన కోవిడ్19 కేసులు ఇప్పుడు క్రమేణా పెరుగుతున్నాయి. ఒకవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నప్పటికీ, వైరస్ వ్యాప్తి అంతకు మించిన వేగంతో జరుగుతోంది. ఒకరోజును మించి ఒకరోజు కొత్త కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 23,285 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే కూడా ఈరోజు సుమారు వెయ్యి కేసులు ఎక్కువగా వచ్చాయి, 2021లో ఇదే అత్యధికం. ఒక్క మహారాష్ట్రలోనే గడిచిన ఒక్కరోజులో 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు హాట్ స్పాట్ ప్రాంతాల్లో కఠిన లాక్డౌన్ అమలు చేయాలని మహా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
ఇక, తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయం నాటికి 1,13,08,846కు చేరింది. నిన్న ఒక్కరోజే 117 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,58,306 కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 15,157 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,09,53,303 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,97,237 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.86 శాతానికి పడిపోగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.74 శాతానికి పెరిగాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.40% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 23,285 new #COVID19 cases, 15,157 recoveries, and 117 deaths in the last 24 hours
Total cases: 1,13,08,846
Total recoveries: 1,09,53,303
Active cases: 1,97,237
Death toll: 1,58,306
Total vaccination: 2,61,64,920 pic.twitter.com/S9878BAVe3
— ANI (@ANI) March 12, 2021
ఇక మార్చి 11వరకు దేశవ్యాప్తంగా 22,49,98,638 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 7,40,345 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
మరోవైపు, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కూడా కొనసాగుతోంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా లబ్దిదారుల సంఖ్య 2.6 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం 2,61,64,920 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.