Corona Alert: దేశంలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్ కేసులు.. గత 24 గంటల్లో 1,071 కేసులు.. 130 రోజుల తర్వాత ఇదే మొదటిసారి.. మొత్తంగా 5,915కు పెరిగిన యాక్టివ్ కేసులు.. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరి మృతి
దేశంలో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 130 రోజుల తర్వాత ఒక్క రోజే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి.
Newdelhi, March 20: గడిచిన మూడేండ్లుగా యావత్తు ప్రపంచాన్ని గడగడలాడించి ఇటీవల శాంతించినట్టు కనిపించిన కరోనా మహమ్మారి (Coronavirus) మళ్లీ బుసలు కొడుతుంది. దేశంలో కొవిడ్ కేసులు (Covid cases) మళ్లీ పెరుగుతున్నాయి. 130 రోజుల తర్వాత ఒక్క రోజే 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య (Active Cases) 5,915కి పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1,071 కొత్త కేసులు నమోదైనట్టు తెలిపింది. అలాగే, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళలో కరోనా బారినపడి ఒక్కొక్కరు మరణించినట్టు పేర్కొంది. వీరితో కలిపి దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,30,802కు పెరిగినట్టు వివరించింది. ఇక, ఝార్ఖండ్‌లో రెండు హెచ్3ఎన్2 ఇన్‌ప్లూయెంజా, ఐదు కరోనా కేసులు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు తెలిపారు.
కొవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో కఠినమైన నిఘా ఉంచాలని ఇటీవల కేంద్రం ఆరు రాష్ట్రాలకు లేఖ రాసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో, కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాలకు అప్రమత్తంగా ఉండాలని, కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరగడాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరిన విషయం తెలిసిందే.