Cyclone Tauktae: తీరం దాటిన తౌక్టే తుఫాను, అయినా పెను ముప్పే, మళ్లీ 23న అండమాన్‌లో అల్పపీడనం, భారీ వర్షాలతో వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు
అరేబియా సముద్రంలో పుట్టిన అత్యంత తీవ్ర తుపాను తౌక్టే సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం (Cyclone Tauktae Crosses Gujarat Coast) దాటింది.రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది.
New Delhi, May 18: అరేబియా సముద్రంలో పుట్టిన అత్యంత తీవ్ర తుపాను తౌక్టే సోమవారం రాత్రి గుజరాత్‌లోని పోరుబందర్ – మహువా మధ్య తీరం (Cyclone Tauktae Crosses Gujarat Coast) దాటింది.రాత్రి 9.30 గంటల ప్రాంతంలో తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. ఇది కొన్ని గంటల పాటు కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. గుజరాత్ సీఎం రూపానీ కూడా దీన్ని ధ్రువీకరించారు.
గంటకు సుమారు 185 కి.మీ.ల వేగంతో పెను గాలులు, 3 మీటర్లకు పైఎత్తున లేస్తున్న భీకర అలలు, అతి భారీ వర్షాలతో (Cyclone Tauktae Highlights) ఈ తుఫాను కల్లోలం రేపుతోంది. వెళ్తూవెళ్తూ 14 మందిని బలితీసుకుంది. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో వేర్వేరు ఘటనల్లో ఆరుగురు చనిపోయారు. రెండు పడవలు నీట మునగడంతో ముగ్గురు నావికులు గల్లంతయ్యారు. అలాగే, కర్ణాటకలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
తీరప్రాంత జిల్లాలైన అమ్రేలి, జునాగఢ్, గిర్ సోమ్‌నాథ్, భావ్‌నగర్ జిల్లాలో తీవ్ర ప్రభావం ఉంటుందని, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఆయన తెలిపారు. 23 ఏళ్ల తర్వాత గుజరాత్‌ను తాకుతున్న అత్యంత భీకరమైన తుపాను తౌక్టేను పరిగణిస్తున్నారు. అరేబియా సముద్రంపై అల్లకల్లోలం సృష్టిస్తూ దూసుకువచ్చిన ‘తౌక్టే’ తీర ప్రాంతాల్లో తీవ్ర విధ్వంసానికి కారణమైంది.
పెనుగాలులు, అలల ధాటికి రెండు బార్జ్‌లు (యంత్ర సామగ్రి రవాణాకు వినియోగించే భారీ బల్లపరుపు పడవలు) సోమవారం సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వాటిలోని సుమారు 410 మంది సిబ్బందిని రక్షించడానికి నౌకాదళం రంగంలోకి దిగింది. సోమవారం అర్ధరాత్రికి వీరిలో 60 మందిని రక్షించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ల్లో సోమవారం పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిశాయి.
గుజరాత్ తీరం అల్లకల్లోలం
గుజరాత్‌లో నేడు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. సముద్రం మంగళవారం ఉదయం వరకు అల్లకల్లోలంగా ఉంటుందని, పరిస్థితి కొంత కుదుటపడుతుందని తెలిపింది. తుపాను (Cyclone Tauktae) మార్గంలో ఉన్న నౌకాశ్రయాల్లో అత్యంత ప్రమాద పరిస్థితిని సూచించే 9 లేదా 10 ప్రమాద హెచ్చరికలను జారీ చేయాలని వాతావరణ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మనోరమ సూచించారు. గుజరాత్‌లో లోతట్లు ప్రాంతాల నుంచి దాదాపు రెండు లక్షల మందిని సహాయ కేంద్రాలకు తరలించారు.
54 ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయని అధికారులు తెలిపారు. జునాగఢ్, అమ్రేలి, గిర్ సోమనాథ్, నవ్‌సారి జిల్లాల్లో మంగళవారం కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుపాను తౌక్టేను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, విద్యుత్, రహదారులు సహా సంబంధిత శాఖల సిబ్బందితో సహాయ బృందాలను ఏర్పాటు చేశామని గుజరాత్ సీఎం రూపానీ తెలిపారు.
తుపాన్ ప్రభావం వల్ల డియూ,అమ్రేలి, భావనగర్, బోటాడ్, అహ్మదాబాద్, గాంధీనగర్, మెహసన, సబర్ కాంత, బాణాస్ కాంత ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షం కురుస్తోంది. తుపాన్ ప్రభావం వల్ల ముందుజాగ్రత్తగా సూరత్ నగరంలోని విమానాశ్రయాన్ని మూసివేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సూరత్ కు రాకపోకలు సాగించాల్సిన విమానసర్వీసులను రద్దు చేశారు.
సీఎంలతో ప్రధాని సమీక్ష
తుపాను ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడారు. తుపాను పరిస్థితిని, సహాయ చర్యల సన్నద్ధతను వారితో చర్చించారు. సాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వారికి హామీ ఇచ్చారు. తుపానుపై మహారాష్ట్ర సీఎం ఠాక్రే, గుజరాత్ సీఎం రూపానీ, గోవా సీఎం సావంత్, డయ్యూడామన్ ఎల్జీ ప్రఫుల్‌తో ప్రధాని సమీక్ష జరిపారు.
వణికిన మహారాష్ట్ర
మహారాష్ట్ర తీర ప్రాంత జిల్లాల్లో తౌక్టే తుపాను విధ్వంసం సృష్టించింది. ముంబై, థానెలను భారీ వర్షాలు ముంచెత్తాయి. సోమవారం రోజంతా బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను సోమవారం రాత్రి 8 గంటల వరకు నిలిపివేశారు. 55 విమానాలు రద్దు అయ్యాయి. లోకల్ ట్రైన్ సర్వీస్‌కు అంతరాయం కలిగింది. తుపాను పరిస్థితిని సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమీక్షించారు. తీర ప్రాంతం నుంచి దాదాపు 12 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సముద్రంలో చిక్కుకుపోయిన 12 మంది మత్స్యకారులను ఆదివారం రాత్రి కోస్ట్‌గార్డ్ దళం రక్షించింది. ముంబైలోని కొలాబాలో సోమవారం ఉదయం 8.30 నుంచి ఉదయం 11 గంటల మధ్య 79.4 మిమీల వర్షపాతం నమోదైంది.
మహారాష్ట్రలో బాంబే హై ప్రాంతంలోని హీరా ఆయిల్ ఫీల్డ్స్ నుంచి ‘పీ 305’ బార్జ్ కొట్టుకుపోతోందన్న సమాచారంతో నౌకాదళం రంగంలోకి దిగింది. యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ కొచ్చి’లో సహాయ సిబ్బంది ‘పీ 305’లో ఉన్న 273 మంది సిబ్బందికి కాపాడేందుకు బయల్దేరారు. మరో యుద్ధ నౌక ‘ఐఎన్‌ఎస్ తల్వార్’ ఈ సహాయ కార్యక్రమంలో పాలు పంచుకుంటోంది. ముంబై తీరానికి ఈ ఆయిల్ ఫీల్డ్స్ 70 కి.మీ.ల దూరంలో ఉన్నాయి. తుపాను సహాయ చర్యల కోసం ఇతర నౌకలను సిద్ధంగా ఉంచినట్లు నౌకాదళ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ తెలిపారు. ‘సహాయం కోరుతూ జీఏఎల్ కన్‌స్ట్రక్టర్ బార్జ్ నుంచి సమాచారం వచ్చింది. ముంబై తీరానికి 8 నాటికన్ మైళ్ల దూరంలో అది ఉంది. ఆ బార్జ్‌లో 137 మంది సిబ్బంది ఉన్నారు. వారిని కాపాడడం కోసం ఐఎన్‌ఎస్ కోల్‌కతా యుద్ధ నౌక బయల్దేరి వెళ్లింది’ అని ఆయన వెల్లడించారు.
తుపాను కారణంగా కొంకణ్ ప్రాంతంలో ఆరుగురు చనిపోయారు. వారిలో ముగ్గురు రాయ్‌గఢ్‌లో, ఇద్దరు నవీ ముంబైలో, ఒకరు సింధు దుర్గ్‌లో వేర్వేరు తుపాను సంబంధిత కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. బాంద్రా– వర్లీ సీ లింక్‌ను తాత్కాలికంగా మూసేశారు. రాయ్‌గఢ్, పాల్ఘార్, రత్నగిరి, థానే ప్రాంతాల్లో దాదాపు గంటకు 100 కిమీల వేగంతో గాలులు వీచాయి. ఈ ప్రాంతాల్లో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ముంబై సహా పలు ప్రాంతాల్లో సహాయ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీ సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు, రెండు బోట్లు మునిగిపోయిన ఘటనల్లో ముగ్గురు గల్లంతయ్యారు. రాయ్‌గఢ్‌లో దాదాపు 2 వేల ఇళ్లు ధ్వంసమయ్యాయి.
కర్నాటకలో తుఫాను విధ్వంసం
తౌక్టే తుపాను వల్ల కన్నడనాట తీరప్రాంత జిల్లాలు అతలాకుతలమయ్యాయి. పెనుగాలులు, అలల తాకిడికి మంగళూరు వద్ద అరేబియా సముద్రంలో చిన్న చేపల పడవ మునిగిపోయింది. స్థానికులు ముగ్గురిని కాపాడగా, ఇద్దరు చనిపోయారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. తుపాన్ ప్రభావంతో ఈ నెల 20 తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. కావేరినది నీటిమట్టం గణనీయంగా పెరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలో 108 ఇళ్లు దెబ్బతిన్నాయి. 380 మందిని సహాయక కేంద్రాలకు తరలించారు. ఇళ్లు కూలి, విద్యుత్ ప్రమాదాలతో ఆరుగురు దాకా మరణించారు.
అరేబియా సముద్రంలో చిక్కుకున్న 9 మందిని 40 గంటల అనంతరం సురక్షితంగా కాపాడారు. మంగళూరు నుంచి 13 నాటికల్ మైళ్ల దూరంలో రాతిబండల మధ్య కోరమండల్ అనే టగ్‌బోట్‌లో 9 మంది మంగళూరు రిఫైనరీ కాంట్రాక్టు ఉద్యోగులు శనివారం నుంచి చిక్కుకున్నారు. తుపాను వల్ల ముందుకు వెళ్లలేకపోయారు. రక్షించాలని వీడియో కాల్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో సోమవారం కోస్టుగార్డు సిబ్బంది నౌకలు, ఒక హెలికాప్టర్‌తో చేరుకుని అందరినీ సురక్షితంగా కాపాడారు. ఐదుమందిని హెలికాప్టర్ ద్వారా మంగళూరుకు తీసుకొచ్చారు.
తుపాన్‌తో ఇళ్లు కూలిపోయినవారికి రూ.5 లక్షలు, బోట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. ఓ మోస్తరు ఇంటి మరమ్మతుల కోసం రూ. లక్ష చొప్పున అందిస్తామన్నారు. తుపాను వల్ల రాష్ట్రంలో 6 మంది మృతిచెందగా 22 జిల్లాల్లో 121 పల్లెల్లో 333 ఇళ్లు దెబ్బతిన్నాయి. 30 హెక్టార్లలో పంటలు నాశనమైయ్యాయని 57 కిలోమీటర్లు రోడ్లు దెబ్బతిన్నాయని రాష్ట్ర ప్రకృతి విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.
తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు
అరేబియా సముద్రంలో పుట్టి కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలను వణికించి గుజరాత్ వద్ద తీరం దాటిన తౌక్టే తుపాను ప్రభావం తెలంగాణపైనా పడింది. దాని ప్రభావంతో మొన్న హైదరాబాద్‌లో భారీ వర్షం పడగా, నేడు నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్, కృష్ణానగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, బండ్లగూడ, జాగీర్, కిస్మత్‌పూర్, గండిపేట, గగన్‌పహాడ్, మలక్‌పేట, దిల్‌సుఖ్ నగర్, కొత్తపేట, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో వర్షం పడింది.కొన్ని ప్రాంతాల్లో ఇంకా పడుతూనే ఉంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు వెసులుబాటు ఉండడంతో నిత్యావసరాల కోసం బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు.
23న అండమాన్‌లో అల్పపీడనం?
ఉత్తర అండమాన్ సముద్రం పరిసరాల్లో ఈ నెల 23న అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. తరువాత ఇది బలపడి తుఫాన్‌గా మారొచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 26 తరువాత తుఫాన్ ఉత్తర ఒడిసా-పశ్చిమ బెంగాల్‌లో తీరం దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు గడువు కంటే ముందుగా కేరళలో ప్రవేశించి అవకాశాలున్నాయని వివరించారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)