Covid Update: శుభవార్త..కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం, ఏపీలో కొత్తగా 232 కరోనా కేసులు నమోదు, నలుగురు మృతితో 7115 కు చేరుకున్న మరణాల సంఖ్య
కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి
Amaravati, Jan 3: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రాష్ట్రంలో 40,177 కరోనా పరీక్షలు నిర్వహించగా, 232 మందికి పాజిటివ్‌గా (new coronavirus cases) నిర్థారణ అయ్యింది. దీంతో ఏపీలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 88,3082కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కోవిడ్ బారినపడి గడచిన 24 గంటల్లో చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం నలుగురు మృతిచెందగా, ఇప్పటివరకు 7115 మంది మరణించారు.
గత 24 గంటల్లో 352 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 8,72,897 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3,070 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో రికార్డుస్థాయిలో కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నేటివరకు 1,19,72,780 శాంపిల్స్‌ను పరీక్షించారు.
ఇండియాలో కోవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ల (covishield and covaxin) అత్యవసర అనుమతికి డిసీజీఐ (DCGI) ఆమోదం తెలిపింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా డీసీజీఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుంది.
నిపుణుల కమిటీ అన్ని అంశాలు పరిశీలించాకే రెండు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇచ్చిందని తెలిపారు. డిసీజీఐ అనుమతితో మరో వారం రోజుల్లోనే భారత్‌లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీజీసీఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్దికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు.