Hathras Gangrape Case: హత్రాస్ ఘటనలో ట్విస్టులే ట్విస్టులు, విధ్వంసాన్ని నిరోధించేందుకే దహన సంస్కారాలు నిర్వహించామని తెలిపిన యూపీ సర్కారు, హత్రాస్‌ను సందర్శించిన 400 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో యువతి గ్యాంగ్ రేప్‌కు (Hathras Gangrape Case) గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు నిరాకరించడంతో పోలీసులే అర్థరాత్రి రహస్యంగా దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై యూపీ సర్కారు (UP Govt) స్పందించింది. తెల్లారితే భారీ స్థాయిలో విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని, అందుకే రాత్రికి రాత్రే ఆ యువతి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించినట్లు యూపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుతో పేర్కొన్నది.
New Delhi. October 6: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో యువతి గ్యాంగ్ రేప్‌కు (Hathras Gangrape Case) గురై హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతిచెందిన. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులు నిరాకరించడంతో పోలీసులే అర్థరాత్రి రహస్యంగా దహనం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. యూపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై యూపీ సర్కారు (UP Govt) స్పందించింది. తెల్లారితే భారీ స్థాయిలో విధ్వంసం జరిగే ప్రమాదం ఉందని, అందుకే రాత్రికి రాత్రే ఆ యువతి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించినట్లు యూపీ ప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుతో పేర్కొన్నది.
ఇంటెలిజెన్స్ వర్గాల ప్రకారం తీవ్రమైన శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు సమాచారం రావడం వల్లే అర్థరాత్రి దహనం చేసినట్లు యూపీ సర్కార్ పేర్కొన్నది. అర్ధరాత్రి 2.30 నిమిషాలకు ఎందుకు దహనం చేయాల్సి వచ్చిందో కూడా తన అఫిడవిట్‌లో సుప్రీంకు (Supreme Court) యూపీ సర్కార్ వివరించింది. బాబ్రీ మసీదు తీర్పు నేపథ్యంలో జిల్లాలో హై అలర్ట్ జారీ చేశారని, ఆ నేపథ్యంలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న భావనతో దహనం చేసినట్లు తెలిపారు.
సఫ్దార్‌గంజ్ హాస్పిటల్‌లో సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన ధర్నా గురించి ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చిందని, ఆ ఘటనకు కులం రంగు పూసారని, అయితే భారీ అల్లర్లను అదపు చేసేందుకు దహనం చేసినట్లు యూపీ సర్కార్ సుప్రీంకు చెప్పింది. హత్రాస్ కేసులో సీబీఐ (CBI) విచారణ చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని యూపీ సర్కార్ తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది. సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ విచారణ కొనసాగాలని యూపీ ప్రభుత్వం అభిప్రాయపడింది.
రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు విషప్రచారం నిర్వహించారని అఫిడవిట్‌లో యోగి ప్రభుత్వం (Yogi Adityanath Govt) ఆరోపించింది. హత్రాస్ ఘటన పట్ల ఇప్పటి వరకు జరిగిన విచారణకు సంబంధించిన వివరాలను సుప్రీంకు సమర్పించారు. అర్థరాత్రి దహనం చేసేందుకు యువతి తల్లితండ్రులను జిల్లా అధికారులు ఒప్పించినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ సర్కార్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఆ యువతి గ్రామానికి చేరుకున్నారు. క్రైమ్ సీన్‌ను సిట్ అధికారులు విజిట్ చేశారు. అయితే రేపు ఈ బృందం తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నది. యూపీ హోంశాఖ కార్యదర్శి భగవాన్ స్వరూప్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్, ఐపీఎస్ ఆఫీసర్ పూనమ్‌లు ఉన్నారు.
ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్ బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించిన ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్) నేత సంజయ్ సింగ్‌పై ఒక వ్యక్తి ఇంకు చల్లాడు. దీంతో అక్కడ కొంత సేపు కలకలం రేగింది. వెంటనే స్పందించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని దీపక్ శర్మగా గుర్తించారు. సంజయ్ సింగ్‌పై అతడు ఎందుకు ఇంకు చల్లాడన్నది దర్యాప్తు చేస్తున్నారు.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని హాత్రాస్ ను సందర్శించిన సుమారు 400 మందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసులు నమోదు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించిన భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో సహా సుమారు 400 మంది సెక్షన్ 144ను ఉల్లింఘించారంటూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి కుటుంబాన్ని సందర్శించేందుకు తొలుత చంద్రశేఖర్ ఆజాద్‌ను పోలీసులు అనుమతించలేదు. ఆ గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి 20 కిలోమీటర్ల మేర నడిచి ఆ గ్రామానికి చేరుకున్నారు.
అక్కడి పోలీసులు అనుమతించడంతో బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ కుటుంబానికి వై కేటగిరి భద్రత కల్పించాలని, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కేసుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రశేఖర్ ఆజాద్‌తోపాటు సుమారు 400 మందిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. సెక్షన్ 144ను వారు ఉల్లంఘించారని పేర్కొన్నారు.
ఇక ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించారంటూ మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో 19 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కొన్ని గ్రూపులు రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నాయని యూపీ డీజీపీ(లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ముందు మాట్లాడితే రూ.50 లక్షలు ఇస్తామని బాధితురాలి కుటుంబ సభ్యులను ప్రలోభపెట్టారని ఆయన ఆరోపించారు.
కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా రాష్ట్రంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, ఇటువంటి వారిని ఉపేక్షించేది లేదని ఆయన అన్నారు. ఈ కేసుకు సంబంధించి కొంతమందిపై ఇప్పటికే దేశ ద్రోహం కేసు నమోదు చేశామని డీజీపీ వివరించారు
ఇక నిర్భయ ఘటన నిందితుల తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది అజయ్ ప్రకాశ్ సింగ్ (ఏపీ సింగ్) మరోసారి అదే తరహా కేసునే ఎంచుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ దళిత బాలికపై హత్యాచారానికి ఒడిగట్టి ఆమె మరణానికి కారణమైన మానవ మృగాల తరఫున వాదించేందుకు సిద్ధమయ్యారు. నలుగురు నిందితులను రక్షించేందుకు వకాల్తా పుచ్చుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అఖిల భారతీయ క్షత్రియ మహాసభ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
హత్రాస్ ఘటనలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు యువకుల తరఫున ప్రమున న్యాయవాది ఏపీ సింగ్ వాదనలు వినిపిస్తారని పేర్కొంది. తమ విజ్ఞప్తిని మన్నించి అమాయకులైన ఠాకూర్ యువకులను రక్షించేందుకు ముందుకొచ్చిన ఏపీ సింగ్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన కొంతమంది తమ వర్గానికి చెందిన యువకులను ఈ కేసులో ఇరికించేందుకు కుట్రపన్నుతున్నారని, దాని నుంచి వారిని కాపాడేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. కాగా అఖిల భారతీయ క్షత్రియ మహాసభ చైర్మన్‌గా కేంద్ర మాజీమంత్రి రాజా మానవేంద్ర సింగ్ ప్రస్తుతం ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నారు. ఈ కేసు నిమిత్తం న్యాయవాదికి అయ్యే ఖర్చును తమ సంఘమే భరిస్తుందని తెలిపారు.
దీని కోసం పెద్ద ఎత్తున చందాలను సైతం వసూలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను ఏపీ సింగ్‌కు అప్పగించామని వెల్లడించారు. క్రిమినల్ న్యాయవాదిగా మంచి పేరును సింగ్.. అత్యంత హేయమైన నేరానికి పాల్పడిన నిర్భయ దోషులను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అనేక వాయిదాల అనంతరం నలుగురు దోషులు ముఖేష్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్‌లను ఉరితీశారు.
మరోవైపు నిర్భయ కేసులో బాధితురాలి పక్షాన వాదనలు వినిపించి.. దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన సుప్రీంకోర్టు న్యాయవాది సీమా సమృద్ధి ఖుష్వహ హత్రాస్ బాధితురాలి తరఫున వాదించేందుకు ముందుకొచ్చారు. నిర్భయ కేసులో ఉన్నట్లే హాత్రాస్ ఘటనలోనూ నలుగురు నిందితులు ఉన్నారు. అయితే నిర్భయ కేసులో నిందితులకు మద్దతు లేదు. కానీ హత్రాస్ ఘటనలో అంతా ఆ నలుగురి వైపే ఉన్నారు. ఆమెపై దాడి మాత్రమే జరిగింది. అత్యాచారం జరగలేదు అని అడిషనల్ పోలీస్ డైరెక్టర్ జనరల్ అంటున్నారు. ‘పోలీసులు ఆమె తల్లిదండ్రులకు చెప్పిన తర్వాతే మృతదేహాన్ని దహనం చేశారు’ అని జిల్లా మేజిస్ట్రేట్ ఇదివరకే సెలవిచ్చారు.
ఇక జిల్లా ఎస్పీ, మిగతా పోలీస్ అధికారులు హత్రాస్ మాటే ఎత్తడానికి లేదన్నట్లుగా ప్రతిపక్ష నేతల్ని, స్వచ్ఛంద సంఘాల వాళ్లను, మీడియాను బుల్గడీ గ్రామంలోకి కాదు కదా, అసలు హాత్రాస్‌లోకే అడుగు పెట్టనివ్వ లేదు. బాధితురాలి వైపు కాకుండా, ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న ఆ నలుగురు నిందితుల వైపు యావత్ జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పని చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. హత్రాస్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ‘అంతర్జాతీయ నిధుల ద్వారా కుల, మత అల్లర్లకు పునాది వేయడానికి ప్రయత్నించడం ద్వారా మా ప్రత్యర్థులు మాపై కుట్ర చేస్తున్నారు. గత వారం రోజులుగా ప్రతిపక్ష పార్టీల అల్లర్లు చూడటానికి ఆసక్తిగా ఉన్నాయి. ఈ కుట్రల మధ్య మేము ముందుకు సాగాలి’ అని అన్నారు.
దేశ వ్యతిరేక వ్యక్తులు రాష్ట్ర అభివృద్ధిని అంగీకరించడం కష్టమని, దేశ అభివృద్ధి పట్ల అంకితభావం చూపాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలను కోరారు. ‘బీజేపీ కార్యకర్తలు దేశ అభివృద్ధికి తమను తాము అంకితం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అల్లర్లు, బంద్‌లతో అట్టుడికే ఉత్తరప్రదేశ్‌నే దేశ వ్యతిరేక వ్యక్తులు కోరుకుంటున్నారు, వారు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అంగీకరించలేరు. కాబట్టి వారు ఇప్పుడు కుట్రలు చేస్తున్నారు’ అని యోగి అన్నారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)