Uttar Pradesh CM Yogi Adityanath | File Image | (Photo Credits: PTI)

New Delhi, October 4: హత్రాస్‌ జిల్లాలో కామాంధుల చేతుల్లో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు (CBI Probe Ordered) ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP Chief Minister Yogi Adityanath) ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో (Hathras Gang Rape) నిర్లక్ష్యంగా దర్యాప్తు చేసినందుకు ఎస్పీ హత్రాస్ విక్రాంత్ వీర్, సీఐ రామ్ షాబాద్ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. బాలిక హత్యోదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని కూడా యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది.

హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై ( Hathras Rape Case) దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇలాఉండగా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా, మరో ముగ్గురు పార్టీ నాయకుల ప్రతినిధి బృందం బాధిత దళిత బాలిక కుటుంబాన్ని ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని బూల్‌గారి గ్రామంలోని వారి ఇంట్లో కలిసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారికి హామీ ఇచ్చారు.

బాధిత బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని కాంగ్రెస్ నేతలు రాహుల్‌, ప్రియాంక్‌ చెప్పారు. కాగా హత్రాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 144 ను అమలు చేసిన నేపథ్యంలో.. గ్రామం, పరిసరాల్లో భారీ పోలీసుల మోహరింపుల మధ్య వీరి పర్యటన కొనసాగింది. ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శి అవనిష్ అవస్థీ, డీజీపీ హెచ్‌సి అవస్థీ కూడా బాధితుడి కుటుంబాన్ని నిన్న కలుసుకున్నారు.ఈ విషయాన్ని పరిశీలిస్తున్న సిట్ ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. అన్యాయానికి వ్యతిరేకంగా.. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఎవరూ నొక్కలేరని రాహుల్‌ అన్నారు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా హాథ్రస్‌లో బాధిత యువతి ఇంటి వద్దకు భారీగా జనం చేరుకున్నారు.

హత్రాస్ రేప్ ఘటన, ఎస్పీ సహా ఐదుగురు పోలీస్ సిబ్బంది సస్పెండ్, దేశ రాజధానిలో పెద్ద ఎత్తున నిరసనలు, సంచలనంగా మారిన వీడియో క్లిప్‌లు

ఇదిలా ఉంటే ఈ ఘటనకు (Hathras Case) బాధ్యత వహిస్తూ యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. గత వారం రోజుల నుంచి హత్రాస్ ఘటనపై ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ సంఘటనలో లైంగికదాడి జరగలేదని యూపీ పోలీసులు పోస్ట్ మార్టం, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఫలితాలపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా హత్రాస్ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్ మంత్రి ఎస్‌కే ఖన్నా శనివారం మాట్లాడుతూ.. "పోస్టుమార్టం, ఫోరెన్సిక్, వైద్య నివేదికల ఆధారంగా లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించబడలేదు. ఇప్పటికీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నది. సిట్ నివేదిక దాఖలు చేసిన వెంటనే ఆదర్శవంతమైన దర్యాప్తు అనుసరిస్తుంది" అని చెప్పారు.

బాధితురాలిని చిత్రహింసలకు గురిచేశారు, హాథ్రస్ ఘటనలో దారుణ విషయాలు వెలుగులోకి, అత్యాచారం జరిగినట్లుగా ధృవీకరించిన పోస్ట్ మార్టం నివేదిక

హత్రాస్ ఘటనను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. హత్రాస్‌లో జరిగినట్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులు బాధపడకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ సుష్మా మౌర్య తన పిటిషన్‌లో విజ్ఞప్తిచేశారు.

హత్రాస్‌ ఘటనపై శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఏడీ) నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ స్పందించారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు పర్యవేక్షణలో కేసు విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ‘బాధితురాలి చివరి కర్మలను ఆమె కుటుంబ అనుమతి లేకుండా బలవంతంగా నిర్వహించింది’ అని ఆరోపించారు. ‘ఈ చర్యను శిరోమణ అకాళీదళ్‌ ఖండిస్తుందని, ఈ దారుణమైన చర్యకు కారణమైన పోలీస్‌, సివిల్‌ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. కాగా పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ కూతురి అంత్యక్రియలు నిర్వహించడం పట్ల మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం గ్రామంలోకి విలేకరులను అనుమతించడంతో బాధితురాలి కుటుంబం మీడియాతో మాట్లాడింది. ‘ఆ రోజు ఎవరి మృతదేహాన్ని దహనం చేశారో తెలుపాలి. ఒకవేళ అది మా సోదరి మృతదేహమైతే ఇంత దారుణంగా ఎలా అంత్యక్రియలు నిర్వహిస్తారు. పోస్ట్‌మార్టం నివేదిక చూపించాలని కోరితే.. నీకు ఇంగ్లిష్‌ రాదు.. అది అర్థం కాదు అని వారు (అధికారులు) చెప్పారు. రెండ్రోజులుగా మమ్మల్ని ఇంటి నుంచి బయటకు వెళ్లనీయడం లేదు’ అని మృతురాలి సోదరుడు మీడియాకు తెలిపారు.

ఈ పరిస్థితులు ఇలా ఉంటే నిందితులతో సహా బాధితురాలి కుటుంబ సభ్యులకు కూడా నార్కో ఎనాలసిస్‌ పరీక్షలు చేయాలన్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) సూచనల్ని హత్రాస్‌ బాధిత కుటుంబం ఖండించింది. ఆ సూచనలు చేసినవారే టెస్టులు చేయించుకోవాలని మండిపడింది. హత్రాస్ గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న 20 ఏళ్ల యువతిపై సెప్టెంబర్‌ 14న నలుగురు వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడి పాశవికంగా హతమార్చారు. ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత వారం ఆమె మరణించింది.

ఇదిలా ఉంటే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి హత్రాస్‌ ఘటన నిరసనల సెగ తగిలింది. వారణాసి వచ్చిన ఇరానీని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆమె కారును చుట్టుమట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాధితురాలికి న్యాయం చేయాలని, రాహుల్ గాంధీ‌, ప్రియాంక గాంధీ హథ్రాస్‌ పర్యటనకు అనుమతినివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పష్టం చేశారు. రాహుల్‌, ప్రియాంక హథ్రాస్‌ పర్యటనపై ఆమె మండిపడ్డారు. రాజస్తాన్‌ అత్యాచారాల విషయాన్ని ప్రస్తావిస్తూ ఆమె ఎదురుదాడికి దిగారు. రాజస్తాన్‌ ఘటనలపై సీఎం అశోక్‌ గహ్లోత్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేస్తున్నారు. హత్రాస్‌ ఘటన విషయంలో రాహుల్‌, ప్రియాంక ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.