Hathras,Oct 3: హత్రాస్ రేప్ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబాన్ని విపక్షాలతో పాటు మీడియాను సైతం కలుసుకోనీయకుండా యోగీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. హత్రాస్ ఘటనపై (Hathras Gang Rape) సిట్ ప్రాథమిక నివేదిక ఆధారంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) ఎస్పీ సహా ఐదుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే యోగి ప్రభుత్వం ఈ ఘటనపై ప్రత్యేక బృందం దర్యాప్తు ముగిసే వరకు ఎలాంటి నిరసనలను అనుమతించరాదని నిర్ణయించుకుంది. అందులో భాగంగానే హత్రాస్ జిల్లాలోని బుల్గార్గీ గ్రామాన్ని నిరసనకారులు ముట్టడించారు.
ఈ నేపథ్యంలో ఊరి చుట్టూ బారికేడ్లు పెట్టారు. గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సామూహిక అత్యాచారం, హత్యకు గురైన దళిత బాలిక కుటుంబ సభ్యులు నివశించే ఆ గ్రామంలోకి ఎవరూ వెళ్లకుండా లోపల నుంచి బాధిత కుటుంబం సహా ఎవరూ బయటకు రాకుండా పోలీసులు పహరా కాస్తున్నారు. ఎవరినీ అనుమతించకపోవడంపై అయితే యూపీ సర్కారుపై తీవ్ర విమర్శలు రేకెత్తుతున్న నేపథ్యంలో మీడియాను అనుమతిస్తూ యోగీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది.
ఇక హత్రాస్ హత్యాచార ఘటనను (Hathras rape case) నిరసిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన జరిగింది. పౌరహక్కుల కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు, రాజకీయ నేతలు భారీసంఖ్యలో పాల్గొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వామపక్ష నేతలు సీతారాం ఏచూరి, బృందాకారత్, డీ రాజా, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, భీం ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే హత్రాస్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇందుకు సంబంధించి రెండు ఆడియో క్లిప్‌లు తెగ వైరలవుతున్నాయి. దీనిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి బాధితురాలి కుటుంబంతో మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ టేప్‌లో సదరు వ్యక్తి ఒకరు బాధితురాలి బంధువుతో ‘మీడియా ముందు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేంగా మాట్లాడాలని’ కోరడం వినవచ్చు. అంతేకాక ప్రియాంక, రాహుల్ గాంధీ వచ్చే వరకు ఆగి.. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ప్రకటన చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాక సదరు వ్యక్తి ప్రియాంక గాంధీ వచ్చే వరకు ఇంట్లో ఉండమని బాధితురాలి సోదరుడిని కోరడం వీడియోలో వినవచ్చు. మరో ఆడియో క్లిప్‌లో సదరు వ్యక్తి 25 లక్షల రూపాయలు కాదు 50 లక్షల రూపాయల నష్ట పరిహారం డిమాండ్ చేయాలని సూచించినట్లు వినిపిస్తుంది. ప్రస్తుతం వైరలవుతోన్న ఈ రెండు ఆడియో క్లిప్‌లు హత్రాస్ ఉదంతంలోని రాజకీయ కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవం అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇక బాధితురాలి కుటంబాన్ని పరమార్శించడానికి రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరి కొందరితో కలిసి హత్రాస్ వెళ్లాలని భావించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకోవడమే కాక రాహుల్, ప్రియాంకతో సహా 201 మంది మీద కేసు నమోదు చేశారు.
హత్రాస్ ఘటనలో నిందితులను ఉరి తీయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, వారి మద్దతుదారులు ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
హత్రాస్ ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు ఎగిసి పడుతూ.. ప్రభుత్వంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘తల్లులు, సోదరీమణుల భద్రత, అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అక్కాచెల్లెమ్మలకు, తల్లులకు హానీ చేయాలని భావించే వారికి ఇదే నా హామీ.. మీరు తప్పక ఫలితం అనుభవిస్తారు. మీకు ఎలాంటి శిక్ష లభిస్తుంది అంటే.. అది చూసి భవిష్యత్తులో మరేవ్వరు ఆడవారికి హానీ చేయాలని కలలో కూడా అనుకోరు. యూపీ ప్రభుత్వం ఆడవారి భద్రతకు, అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఇదే మా నిబద్ధత, హామీ’ అంటూ యోగి ట్వీట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో చోటు చేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు తప్పట్లేవు. లైంగిక వేధింపుల కేసుల్లో ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై కూడా పలువురి నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా, బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో తాను యూపీ సీఎం యోగి కంటే సీనియర్‌నని, ఆయనకు అక్కలాంటి దాన్నని ఆమె అన్నారు. తన అభ్యర్థలను, సూచనలను కొట్టిపారేయకుండా చర్యలు తీసుకోవాలని ఆమె పలు సూచనలు చేశారు.
యోగీ తీరు పార్టీకి మచ్చ తెచ్చిందని తెలిపిన ఉమా భారతి
పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు యోగి ఆదిత్యనాథ్‌తో పాటు తమ పార్టీకీ మచ్చ తెచ్చిందని బీజేపీ పార్టీ నేత వ్యాఖ్యానించారు. బాధిత అమ్మాయి కుటుంబాన్ని కలిసేందుకు వస్తోన్ రాజకీయ నాయకులు, మీడియాను అనుమతించాలని యోగికి సూచించారు. దళిత కుటుంబానికి చెందిన కుమార్తె ఈ ఘటనలో మృతి చెందిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆమె అంతిమ సంస్కారాలను పోలీసులు హడావుడిగా జరిపారని చెప్పారు. అనంతరం కూడా ఆమె కుటుంబాన్ని, గ్రామ ప్రజలను ఎవరూ కలవకుండా చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటారని భావించే తాను ఇప్పటివరకు ఈ విషయాల గురించి ఏమీ మాట్లాడలేదని అన్నారు.
అయితే, పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు విచారకరమని ఆమె చెప్పారు. కేసుల్లో సిట్ దర్యాప్తు జరుపుతోన్న సమయంలో బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదనే నిబంధన ఉందా? అని ఆమె నిలదీశారు. వారిని కలవనీయకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యల వల్ల సిట్ దర్యాప్తుపై కూడా అనుమనాలు తలెత్తుతాయని ఆమె చెప్పారు. తమ పార్టీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసిందని, దేశమంతా రామరాజ్యం తీసుకొస్తామని హామీ ఇచ్చిందని అన్నారు.
అయితే, హత్రాస్‌లో పోలీసుల తీరు యోగి సర్కారుతో పాటు తమ పార్టీకి మచ్చ తెస్తోందని చెప్పారు. తాను ప్రస్తుతం కొవిడ్-19కి చికిత్స తీసుకుంటున్నానని ఆమె వివరించారు. కరోనా సోకకపోతే తాను ఇప్పటికే బాధిత కుటుంబాన్ని కలిసేదాన్నని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత తాను బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని తెలిపారు. బాధిత కుటుంబాన్ని కలిసేందుకు నాయకులను అనుమతించాలని యోగి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆమె చెప్పారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో కొన్నిరోజుల కిందట 19 ఏళ్ల యువతిపై కొందరు వ్యక్తులు అత్యంత దారుణమైన రీతిలో దాడికి పాల్పడగా, ఆ యువతి ఢిల్లీలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె నాలుక కోసేసిన దుర్మార్గులు, నడుం విరగ్గొట్టి పైశాచికంగా ప్రవర్తించినట్టు తేలింది. అయితే, ఫోరెన్సిక్ నివేదికలో ఆమెపై అత్యాచారం జరగలేదని తేలిందని పోలీసులు వెల్లడించారు. ఇదిలావుంటే, ఆ అమ్మాయి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా పోలీసులే బుధవారం అర్ధరాత్రి హడావుడిగా దహనం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాంతో ఈ ఘటనలో పోలీసులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ కార్యాలయం జోక్యం చేసుకున్నట్టు అర్థమవుతోంది.