Covid Second Wave: కరోనా కొత్త నిజాలు, ఫిబ్రవరి నాటికి వైరస్ ఖేల్ ఖతం, 9 గంటల పాటు మనిషి చర్మంపై కరోనా, సెకండ్ వేవ్‌ను తోసిపుచ్చలేమని తెలిపిన కేంద్రం
ఈ సంధర్భంలో కోవిడ్-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది.
New Delhi, October 18: ఇండియాలో కరోనా వైరస్ ముమ్మర దశను దాటిందని వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి మహమ్మారి అంతం అవుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. ఈ సంధర్భంలో కోవిడ్-19 నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాలను విధింగా పాటించాలని ప్రజలను కోరింది. 2021 ఫిబ్రవరి నాటికి వైరస్ తోకముడిచే నాటికి దేశవ్యాప్తంగా ఒక కోటి ఐదు లక్షల మంది మహమ్మారి బారినపడతారని కమిటీ అంచనా వేసింది.
ఇదిలా ఉంటే శీతాకాలంలో భారత్‌లో రెండో విడత కరోనా వైరస్ కేసుల ఉధృతి (Covid Second Wave) పెరిగే అవకాశం లేకపోలేదని నీతి ఆయోగ్ సభ్యులు వీకే పాల్ హెచ్చరించారు. వ్యాక్సిన్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే దాన్ని పౌరులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చేలా అన్ని వనరులూ సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రానున్న శీతాకాలంలో కరోనా వైరస్ వ్యాప్తి (Coronavirus Second Wave) మరోసారి ఉండే అవకాశాలు ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్నది.
గడిచిన మూడు వారాల్లో కొత్త కరోనా వైరస్ (2020 Coronavirus Pandemic in India) కేసుల నమోదు, మరణాల సంఖ్య తగ్గినట్లు కేంద్రం తెలిపింది. అయితే, సెకండ్ వేవ్‌ను తోసిపుచ్చలేమని పేర్కొన్నది. ఇక భారత్‌లో ప్రస్తుతానికి కరోనా వైరస్‌లో ఎలాంటి మార్పు (మ్యుటేషన్) లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. ఇంతవరకూ కరోనా మార్పు జరిగినట్టు ఎలాటి ఆనవాళ్లూ లేవని చెప్పారు. 'నేను ఈ మేరకు మీకు హామీ ఇవ్వగలుగుతున్నానని సండే సంవాద్ కార్యక్రమంలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి చెప్పారు. వార్తా పత్రికల ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతుందనడానికి సరైన శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని మరో ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలోనూ వార్తాపత్రికలు చదవడం పూర్తిగా సురక్షితమన్నారు. కోవిడ్-19 వాక్సిన్‌కు సంబంధించి ఇండియాలో ప్రస్తుతం ట్రయల్స్ జరుగుతున్నాయని, సీరం ఇండియా, భారత్ భయోటెక్‌లు క్లినికల్ ట్రయిల్స్ జరుపుతున్నాయని తెలిపారు. ఫేజ్-3 క్లినికల్ ట్రయిల్స్‌లో వేలాది మంది పార్టిసిపెంట్లు, ఒక్కోసారి 30,000 నుంచి 40,000 మంది పాల్గొంటున్నట్టు చెప్పారు.
దేశంలో 90 శాతం మంది ప్రజలు ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధికి గురైనట్లు నిపుణులు చెప్తున్నారు. సెప్టెంబరు 17 న దేశంలో అత్యధిక సంఖ్యలో క్రియాశీల కేసులు 10.17 లక్షలు నమోదు కాగా, ఆ తరువాత ఆ సంఖ్య క్రమంగా తగ్గుతూ 7.83 లక్షలకు చేరుకున్నది. సుమారు 66 లక్షల మంది రోగులు కోలుకున్నారు. శనివారం నాటికి దేశంలో 61,893 కేసులు నమోదు కాగా, 72,583 మంది రోగులు నయమయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 74.92 లక్షలు. శనివారం నాడు సోకిన 1031 మంది మరణించగా.. మొత్తం 1.14 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 2 తర్వాత మొదటిసారి మరణించిన వారి సంఖ్య 1000 దాటింది.
ఇదిలా ఉంటే ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మానవ చర్మంపై 9 గంటల వరకు యాక్టివ్‌గా ఉంటుందని జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఫ్లూ వంటి వ్యాధి కారకాలు మానవ చర్మంపై సుమారు 1.8 గంటలు జీవించి ఉండగా కరోనా వైరస్ మాత్రం 9 గంటల వరకు జీవిస్తున్న విషయాన్ని కనుగొన్నారు. కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి ఒక రోజు తర్వాత సేకరించిన చర్మాన్ని వారు పరీక్షించారు. ఇన్‌ఫ్లూఎంజా ఏ వైరస్(ఐఏవీ)తో పోల్చితే మానవ చర్మం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాదం ఎక్కువని చెప్పారు. మానవ చర్మం మహమ్మారిని వ్యాప్తిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. దీంతో కరోనా వైరస్ ఎంత ఎక్కువ సమయం మానవుల చర్మంపై ఉంటే అది వ్యాప్తి చెందే ప్రమాదం అంతగా ఉంటుందని తెలిపారు.
శానిటైజర్‌లో వినియోగించే ఇథనాల్ వల్ల కరోనాతోపాటు ఫ్లూ వైరస్ 15 సెకండ్లలో ఇన్‌యాక్టివ్‌గా మారడాన్ని జపాన్ పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మానవ చర్మంపై 9 గంటల వరకు జీవించే కరోనా వైరస్‌ను నాశనం చేసేందుకు తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సమర్ధించారు. జర్మన్ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయాన్ని క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జర్నల్‌లో ప్రచురించారు.