Covid Updates in India: తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్ వర్కర్ మృతి, దేశంలో తాజాగా 13,203 మందికి కరోనా, ఏపీలో 158 మందికి కోవిడ్ పాజిటివ్
కరోనా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్ (హెల్త్‌కేర్ వర్కర్) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది.
Amaravati, Jan 25: దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం దేశంలో గత 24 గంటల్లో 13,203 మందికి కరోనా (Covid Updates in India) నిర్ధారణ అయింది. అదే సమయంలో 13,298 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,67,736కు చేరింది.గడచిన 24 గంటల సమయంలో 131 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,470 కు పెరిగింది.
దేశంలో కరోనా (Corona Virus) నుంచి ఇప్పటివరకు 1,03,30,084 మంది కోలుకున్నారు. 1,84,182 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 16,15,504మందికి వ్యాక్సిన్లు వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 19,23,37,117 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 5,70,246 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
ఏపీలో గడచిన 24 గంటల్లో 44,382 కరోనా పరీక్షలు నిర్వహించగా 158 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 24, విశాఖ జిల్లాలో 22, కృష్ణా జిల్లాలో 20 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2, కడప జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు. అదే సమయంలో 155 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో నేటివరకు 8,87,010 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,387 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ప్రస్తుతం 1,476 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా 7,147 మంది కరోనాతో మృతి చెందారు.
దేశమంతా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్న వేళ.. అక్కడక్కడా కొన్ని బాధాకర ఘటనలు బయటకు వస్తున్నాయి. తాజాగా కరోనా వ్యాక్సిన్ (Coronavirus Vaccine) తీసుకున్న వరంగల్ అర్బన్ జిల్లా న్యూ శాయంపేట యూపీహెచ్‌సీ పరిధిలోని దీన్‌దయాళ్ నగర్‌కు చెందిన అంగన్‌వాడీ టీచర్ (హెల్త్‌కేర్ వర్కర్) గన్నారపు వనిత (45) ఆదివారం రాత్రి ఛాతీనొప్పితో మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటి నుంచి వనిత కొద్దిపాటి అనారోగ్యంగా ఉందని కాలనీవాసులు చెబుతున్నారు.
ఈ నెల 19న మధ్యాహ్నం 12 గంటలకు న్యూ శాయంపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టీకా తీసుకున్న 45 ఏళ్ల మహిళా ఆరోగ్య కార్యకర్త ఆదివారం తెల్లవారుజామున మరణించినట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై జిల్లా సైడ్ ఎఫెక్ట్స్ పర్యవేక్షణ కమిటీ నుంచి రాష్ట్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి నివేదిక పంపాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఆ నివేదికను కేంద్ర సైడ్ ఎఫెక్ట్స్ కమిటీకి పంపుతామన్నారు.