KRMB: శ్రీశైలం, సాగర్ ఇక కృష్ణా బోర్డు పరిధిలోకే, మాకు ఒకే అన్న ఏపీ, జల విద్యుత్ కేంద్రాలు అప్పగించబోమని స్పష్టం చేసిన తెలంగాణ,ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి రావడంపై సందిగ్ధత
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 ఔట్ లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది నిర్వహణ బోర్డు (Krishna River Management Board) తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని కేఆర్‌ఎంబీ వెల్లడించింది.
Telangana, Oct 13: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని 16 ఔట్ లెట్ కేంద్రాలను తన పరిధిలో చేర్చాలని నిర్ణయిస్తూ కృష్ణా నది నిర్వహణ బోర్డు (Krishna River Management Board) తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టు ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుందని కేఆర్‌ఎంబీ వెల్లడించింది. మంగళవారం జలసౌధలో కేఆర్‌ఎంబీ బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన 15వ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
గెజిట్‌లోని రెండో షెడ్యూల్‌లో ఈ రెండు ప్రాజెక్టులపై (Krishna projects ) ఉన్న డైరెక్ట్ ఔట్‌లెట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్య క్రమంలో బోర్డుకు అప్పగించాలన్నారు. శ్రీశైలంలో 7, నాగార్జునసాగర్‌లో 9 డైరెక్ట్ ఔట్‌లెట్లు ఉన్నాయని, తమ నుంచి ప్రతిపాదన వచ్చాక వాటిని అప్పగిస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. ఇందుకు ఏపీ సానుకూలంగా స్పందించగా, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ చెప్పింది. బోర్డు పరిధిలోకి ఔట్‌లెట్లపై ఏపీ ఓకే చెప్పినా, తెలంగాణ క్లారిటీ ఇవ్వకపోవడంతో 14 నుంచి గెజిట్ అమల్లోకి రావడంపై సందిగ్ధత నెలకొంది.
అయితే జల విద్యుత్ కేంద్రాలను బోర్డు పరిధిలోకి తీసుకురావడానికి తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో గడువులోగా గెజిట్ అమల్లోకి వస్తుందా లేదా అనే దానిపై సందేహం నెలకొంది. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు చేయాల్సి ఉందని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ తెలిపారు. బోర్డు మెంబర్ రవికుమార్ పిళ్లై ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ 5 ప్రాజెక్టుల్లో 29 ఔట్‌లెట్లను గుర్తించి, వాటి నుంచి గెజిట్ అమలుకు చర్యలు చేపట్టాలని సూచించిందన్నారు. రెండు రాష్ట్రాలకు కామన్ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌తో పాటు పులిచింతల, సుంకేసుల, ఆర్డీఎస్‌తో గెజిట్ అమలుకు చర్యలు ప్రారంభిస్తామన్నారు.
ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ చీప్ నారాయణ రెడ్డి బోర్డు సభ్యులు రవికుమార్ పిళ్లై, ముతాంగ్, రాయ్పురే పాల్గొన్నారు. ఉప సంఘం 30 కేంద్రాలకు సంబంధించి రూపొందించిన నివేదికపై ఈ బోర్డు సమావేశంలో చర్చించారు.
ఏపీ వాటర్ రీసోర్సెస్ సెక్రటరీ శ్యామలరావు మాట్లాడుతూ.. ప్రాజెక్టులోని అన్ని ఔట్‌లెట్లనూ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణలోని జూరాల ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తీసుకోవాలని కోరారు. దీనికి తెలంగాణ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ అభ్యంతరం తెలిపారు. గెజిట్‌లోంచి పవర్ ప్రాజెక్టులను మినహాయించాలన్నారు. ఏపీ సెక్రటరీ జోక్యం చేసుకుంటూ గెజిట్ వచ్చిందే తెలంగాణ ఏకపక్ష కరెంట్ ఉత్పత్తిపై అని తెలిపారు. తెలంగాణ కరెంట్ ఉత్పత్తిపై సుప్రీంకోర్టులో ఏపీ కేసు వేసిందని, న్యాయ పరిధిలో ఉన్న దాన్ని బోర్డు పరిధిలోకి ఎలా తీసుకుంటారని రజత్ కుమార్ అడిగారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులోని అన్ని ప్రధాన ఔట్‌లెట్లను తీసుకునేందుకు బోర్డు చైర్మన్ తీర్మానం ప్రతిపాదించారు. దానికి ఏపీ ఆమోదం తెలపడంతో మొత్తం 16 ఔట్‌లెట్లను బోర్డు అధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఆయా ఔట్‌లెట్లను ప్రతిపాదిస్తూ బోర్డు నుంచి ప్రపోజల్ పంపుతామని, దాన్ని ఆమోదిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర్వులివ్వాలని కోరారు. ఏపీ అధికారులు ఇందుకు సానుకూలత వ్యక్తం చేయగా, తమ ప్రభుత్వాన్ని సంప్రదించి ఆమోదం తీసుకుని జీవో ఇస్తామని తెలంగాణ అధికారులు వెల్లడించారు.
ప్రాజెక్టుల నిర్వహణకు సీడ్ మనీ విడుదల చేయాలని చైర్మన్ కోరాగా, తామిచ్చే నిధుల వినియోగంపై క్లారిటీ లేకుండా రిలీజ్ చేయడం సాధ్యం కాదని రెండు రాష్ట్రాల అధికారులు అన్నారు. ప్రాజెక్టులను తాము బోర్డులకు అప్పగిస్తే వాటి ఓనర్‌షిప్ విషయంలో క్లారిటీ కావాలన్నారు. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణకు సంబంధించిన లోన్‌ల రీపేమెంట్ సహా అనేక అంశాలుంటాయని, వాటిని ఎలా డీల్ చేస్తారన్నారు. తాము కేవలం ప్రాజెక్టుల మానిటరింగ్, మెయింటనెన్స్ చూస్తామని, ఏ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టుకు ఆ రాష్ట్రమే ఓనర్‌గా ఉంటుందని బోర్డు చైర్మన్ క్లారిటీ ఇచ్చారు.
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లోని 16 ఔట్‌లెట్లను 3 నెలలు ఆయా రాష్ట్రాలే మెయింటెయిన్ చేయాలని బోర్డు చైర్మన్ సూచించారు. ఆయా కాంపోనెంట్ల నిర్వహణ ఎలా చేయాలో తాము స్టడీ చేస్తామని, దశలవారీగా ఒక్కో ఔట్‌లెట్ హ్యాండోవర్ చేసుకుంటామని తెలిపారు. ఆయా ఔట్‌లెట్లలో పనిచేస్తున్న సిబ్బంది, ఇతర వివరాలతో తాము త్వరలోనే రెండు రాష్ట్రాలకు ప్రపోజల్ పంపుతామని చెప్పారు. వాటి ఆధారంగా రెండు రాష్ట్రాలు జీవోలిస్తే ఈ నెల 14 నుంచి గెజిట్ అమలు చేస్తామన్నారు. సమావేశంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలు మురళీధర్, నారాయణరెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.
కృష్ణా నీళ్ల పునః పంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, దీనికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున అది తేలేవరకు గెజిట్ అమలు వాయిదా వేయాలని కోరామని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ తెలిపారు. శ్రీశైలంలో 12, నాగార్జునసాగర్‌లో 18 పాయింట్లపై సమావేశంలో చర్చించారని తెలిపారు.
బోర్డుల పరిధిలోకి వెళ్లే ఔట్‌లెట్లు
శ్రీశైలం
ఏపీ: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, మల్యాల పంపింగ్ స్టేషన్ (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్), ముచ్చుమర్రి లిఫ్ట్ స్కీం, రైట్ బ్యాంక్ పవర్ హౌస్, స్పిల్‌వే
తెలంగాణ : కల్వకుర్తి లిఫ్ట్ స్కీం, లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌస్
నాగార్జునసాగర్
ఏపీ: కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, జవహర్ పవర్ స్టేషన్
తెలంగాణ: ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, మెయిన్ పవర్ హౌస్, లాల్‌బహదూర్ పవర్ హౌస్, ఏఎమ్మార్పీ లిఫ్ట్ స్కీం, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు, వరద కాలువ, స్పిల్ వే
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)