Delimitation of Assembly Constituencies: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇప్పట్లో లేదు, 2031 తర్వాతనే చేపడతామని తెలిపిన కేంద్రం, ఎంపీ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు
New Delhi, August 3: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన (Delimitation of Assembly Constituencies) 2031 తర్వాతే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మంగళవారం లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు. ‘ఏపీ విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాలను 153 నియోజకవర్గాలుగా పెంచాల్సిన అవరం ఉంది. ఎప్పుడు పెంచుతారు?’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ (Telangana, AP Assembly delimitation only after 2026 Says Union Home Affairs Minister Nityanand Roy) సమాధానం ఇచ్చారు. రాజ్యంగంలోని ఆర్టికల్ 170లో చెప్పినట్లు 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన (Telangana, AP Assembly delimitation) జరుగుతుందని నిత్యానంద్ రాయ్ తెలిపారు. ఇదిలా ఉంటే 2024 లో ఎన్నికలు జరిగే సమయంలో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా నియోజకవర్గాలు పెంచాలని రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.
విభజన చట్టం ఇలా చెబుతోంది, “రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 లో ఉన్న నిబంధనలకు లోబడి మరియు ఈ చట్టంలోని సెక్షన్ 15 కి ఎలాంటి పక్షపాతం లేకుండా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల శాసనసభ సీట్ల సంఖ్య పెంచుకోవచ్చు. ఇది ఏపీలో 175 నుంచి 225 కు అలాగే తెలంగాణలో 119 నుంచి 153 వరకు నియోజకవర్గాల డీలిమిటేషన్‌ను ఎన్నికల కమిషన్ నిర్ణయించవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరియు ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సి ప్రభుత్వం నియోజకవర్గాలను డీలిమిట్ చేయాలని కేంద్రంపై ఒత్తిడి తెచ్చాయి. ఇలా చేస్తే తెలంగాణా రాష్ట్రం 34 అసెంబ్లీ స్థానాలు మరియు ఆంధ్రప్రదేశ్‌కు 50 సీట్లు అదనంగా వచ్చేవి. ఇది రాజకీయ పార్టీలకు, ప్రత్యేకించి పాలక పక్షాలకు, ఎన్నికలకు అభ్యర్థులను నామినేట్ చేసేటప్పుడు ఎక్కువ మంది నాయకులకు చోటు కల్పించడానికి సహాయపడుతుంది.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే 2026 తర్వాత దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలలో డీలిమిటేషన్‌ని చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2026 వరకు మొదటి సెన్సస్ వరకు ఎలాంటి డిలిమిటేషన్ ఉండకూడదని 2002 లో కేంద్రం చట్టాన్ని సవరించింది. అందువలన ప్రస్తుత నియోజకవర్గాలు కొనసాగుతాయి. తెలంగాణ రాష్ట్రం, ఏపీలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యతోనే జరుగుతాయి.
ఇతర రాష్ట్రాలతో పాటు 2026 మొదటి జనాభా లెక్కల తర్వాత మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరుగుతుందని కేంద్రం తాజాగా తెలిపింది. అంతేకాకుండా దేశంలో లోక్ సభ స్థానాల సంఖ్యను పెంచడానికి కేంద్రం ఆలోచిస్తోంది. ఈ అంశంపై కేంద్రం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటే, "2026 తర్వాత మొదటి జనాభా గణనలో" అసెంబ్లీ సెగ్మెంట్‌లతో పాటు లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ కూడా జరిగే అవకాశం ఉంది.