Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రానున్న 5 రోజులు పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన వాతావరణ శాఖ
రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాల్లో భానుడు భగభగల నుంచి ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏపీ, తెలంగాణలో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
బుధవారం తూర్పు విదర్భ పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాం తాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు పేరొన్నది. ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. ముందున్నంత ఎండ లు ఉండకపోవచ్చని, గరిష్ఠంగా 43డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది. మరో 5 రోజులు తెలంగాణకు ఎల్లో అలర్ట్, దంచి కొట్టిన వానలకు హైదరాబాద్ నగరం విలవిల, పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జాం
దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకూ విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా.. ఏపీ వ్యాప్తంగా మరో 5 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, ఉత్తర కోస్తాలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. అలాగే తీరం వెంబడి గంటకు 30 నుంచి40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. మరోవైపు మే 21 నుంచి ఏపీ వ్యాప్తంగా పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్త అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
ద్రోణి ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, అనంతపురం,శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. అలాగే ఎల్లుండి అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
బుధవారం సాయంత్రం 5 గంటల నాటికి శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 38.5మిమీ, మన్యం జిల్లా పాలకొండలో 35.2మిమీ, శ్రీకాకుళం జిల్లా హీరామండలంలో 35.2మిమీ, పాతపట్నంలో 22.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు., చెట్ల కింద ఉండే పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది..