Hyderabad Rains (photo-ANI)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం సాయంత్రం రాజధాని హైదరాబాద్‌ నగరంలో భారీ వర్షంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, బాచుపల్లి, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, బేగంపేట్‌, ప్యారడైజ్‌, చిలకలగూడ, అల్వాల్‌, జవహర్‌నగర్‌, మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నాగారం, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌, గాజులరామారం, సూరారం, బహదూర్‌పల్లి, షేక్‌పేట, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రెహమత్‌నగర్‌, ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

అనేక ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం కావడంతో పలు చోట్ల వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రధాన జంక్షన్లలో వాహనాల రద్దీ పెరిగి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షంతో ప్రధాన మార్గాలు ఎక్కడికక్కడ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో ట్రాఫిక్(traffic jam) స్తంభించిపోయింది. దీంతో భాగ్యనగరంలో ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ క్రింది మ్యాపులో రెడ్ లైన్ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ నిండిన పలు ప్రాంతాలను క్లియర్ చేస్తున్నారు.  మే 31న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, వర్షాలపై గుడ్ న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ నగరవాసులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షం కురుస్తుండటం, నగరమంతా జలమయం కావడంతో.. ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. అత్యవసరమైతే తప్ప.. ఇంటి నుంచి కాలు బయటపెట్టొద్దని తెలిపింది. ఇదే సమయంలో సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచింది. 040-21111111 లేదా 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని పేర్కొంది. డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలను సైతం సిద్ధం చేసింది. అటు.. మేయర్ గద్వాల విజయలక్ష్మి సైతం అధికారుల్ని అప్రమత్తం చేశారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించి.. అధికారులతో మాట్లాడారు. మ్యాన్‌హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరికల్ని ఏర్పాటు చేయాలని, ఆ ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

Here's Videos

నగరంలో మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. రోడ్లు కూడా నిండకుండల్లా నిండిపోవడంతో.. నగరవ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ దెబ్బతో వాహనదారులందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ పరిస్థితిని సమీక్షించిన తర్వాత.. నగరవాసులు అవసరమైతేనే బయటకు రావాలని, లేకపోతే ఇళ్లల్లోనే జాగ్రత్తగా ఉండాలని మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. డీఆర్ఎఫ్ బృందాలు రెడీగా ఉండాలని ఆదేశించారు.

మరోవైపు, వచ్చే 5 రోజులపాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గురువారం మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కి.మీల వేగంతో గాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ ఐదు రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో హెచ్చరికలను జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్‌ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు పేర్కొంది. రాష్ర్టంలోకి క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్నట్లు పేర్కొంది.