Manjamma Jogathi: ట్రాన్స్‌జెండర్ మంజమ్మ జోగతికి పద్మశ్రీ అవార్డు, రాష్ట్రపతిని చీర కొంగుతో దీవించిన కర్ణాటక జానపద నృత్యకారిణి, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అవార్డు స్వీకరించే సమయంలో ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు.
Bengaluru, Nov 11: కర్ణాటక జానపద నృత్యకారిణి, ట్రాన్స్‌జెండర్ మంజమ్మ జోగతి (manjamma jogathi) నాట్యంలో చేసిన సేవలకు గాను రాష్ట్రపతి కోవింద్ (President Ramnath Kovind) చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నది. అవార్డు స్వీకరించే సమయంలో ఆమె చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారు. అలాగే చూస్తూ ఉండిపోయారు. అవార్డు స్వీకరించేందుకు వెళ్లిన మంజమ్మ (Transgender, Matha B Manjamma Jogati) వారి స్టైల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను దీవించింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన పద్మ అవార్డుల వేడుక సమయంలో ఈ ఘటన జరిగింది.
కర్నాటకకు చెందిన ట్రాన్స్‌జెండర్ మంజమ్మకు ఫోక్ డ్యాన్స్ క్యాటగిరీలో పద్మశ్రీ అవార్డు దక్కింది. అయితే ఆ అవార్డును అందుకునేందుకు రాష్ట్రపతి కోవింద్ వద్దకు వెళ్లిన ఆమె..తన చీర కొంగుతో కోవింద్‌కు దిష్టి తీసి.. శుభం కలిగేలా దీవనెలు చేసింది. మంజమ్మ తన చీరతో కోవింద్‌కు గుడ్‌లక్ చెప్పిన తీరు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యపరిచింది. ట్రాన్స్‌జెండర్లు దీవిస్తే మంచి జరుగుతందన్న ఓ నమ్మకం ఉంది.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆమె జీవిత చరిత్రలోకి వెళితే.. బల్లారి జిల్లాలో మంజూనాథ్ శెట్టిగా మంజమ్మ జన్మించింది. ఆమె పదవ తరగతి వరకు చదువుకున్నది. 15 ఏళ్ల వయసులో తనలో స్త్రీ లక్షణాలు ఉన్నట్లు గుర్తించింది. ఆ సమయంలో ఆమె పేరెంట్స్ ఆమెను హోస్‌పేట్‌లోని ఆలయానికి తీసుకువెళ్లారు. అక్కడ జోగప్ప పూజలు చేశారు. దేవతతో ఆమెకు పెళ్లి చేశారు. అప్పటి నుంచి మంజూనాథ్ శెట్టి కాస్త మంజమ్మ జోగతిగా మారింది.
Here's ANI video
అయితే ఆ తర్వాత ఆమె తన సొంత ఇంటికి వెళ్లలేదు. మొదట్లో ఆమె చీర కట్టుకుని వీధుల్లో భిక్షాటన చేసేది. లైంగిక వేధింపులకు గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. చివరకు ఓ నృత్యకారుడు ఆమెకు డ్యాన్స్ నేర్పాడు. దాంతో ఆమెకు కొత్త జీవితం దొరికింది. జోగప్ప జానపద నృత్యం నేర్చుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక్కడే కల్లవ జోగతితో పరిచయం ఏర్పడింది. అక్కడ మంజమ్మ నాట్య రూపమైన జోగతి నృత్య (జోగప్పల జానపద ప్రదర్శన) నేర్చుకుంది. అనంతరం కల్లవ జోగతి మరణం తర్వాత ఆ కళాబృందానికి మంజమ్మ నాయకత్వం వహించింది. కర్నాటక జానపది అకాడమీకి అధ్యక్షురాలిగా నియమితులైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా మంజమ్మ నిలిచారు. కర్నాటక ప్రభుత్వం తరపున జానపద అకాడమీ తన కార్యక్రమాలను నిర్వహిస్తుంది.