2024 భారత దేశం ఎన్నికలు: ప్రారంభమైన 5వ దశ పోలింగ్.. 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ఓటింగ్.. బరిలో నిలిచిన 695 మంది అభ్యర్థులు, ఓటు హక్కు వినియోగించుకోనున్న 8.95 కోట్ల మంది ఓటర్లు.. రేసులో రాహుల్ గాంధీ, రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు ప్రముఖులు
పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు.
Newdelhi, May 20: 2024 లోక్ సభ ఎన్నికల్లో (Loksabha Elections) భాగంగా ఐదవ దశ పోలింగ్ (Fifth Phase Elections) ఈ ఉదయం ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 695 అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ఈ దశలో ఓటర్ల సంఖ్య 8.95 కోట్లు కాగా ఇందులో మహిళలు 4.26 కోట్లుగా ఉన్నారు. ఈ దశలో మహారాష్ట్రలో 13 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో 14 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 7 సీట్లు, బీహార్ లో 5 సీట్లు, ఝార్ఖండ్ లో 3 సీట్లు, ఒడిశాలో 5 సీట్లు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్ లో ఒక్కొక్క సీటుకు ఎన్నికలు జరగనున్నాయి. గత నాలుగు దశల్లో పోలింగ్ శాతం 66.95గా నమోదైంది. 45.1 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 379 సీట్లలో పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఆరవ, ఏడవ దశ ఎన్నికలు వరుసగా మే 25, జూన్ 1న జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఎన్నికల బరిలో ప్రముఖులు వీరే
ఈ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతీ ఇరానీ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కేంద్ర మంత్రి పియూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, నవీన్ పట్నాయక్ తదితర ప్రముఖులు తలపడుతున్నారు.