Mansoon-Rain (Photo-X)

New Delhi, May 18: నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ఇవాళ అండమాన్ దీవులను తాకాయి. ఈ విషయాన్ని ఐఎండీ వెల్లడించింది. నికోబార్ దీవులు (Andaman Nicobar Islands), మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయని ఐఎండీ తెలిపింది. ప్రతి ఏటా మే 18-20 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులను తాకే ప్రక్రియ జరుగుతుంది. ఈసారి కూడా అలాగే రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 31కి నైరుతి.. కేరళ తీరాన్ని, జూన్ మొదటి వారంలో రాయలసీమను తాకనున్నట్లు ఐఎండీ (IMD) అంచనా వేసింది. ఇక.. ప్రీ మాన్ సూన్ సీజన్ లో తొలి అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి బలహీనపడింది. ఏపీ, యానాంలో ఆగ్నేయ-నైరుతి దిశగా గాలులు వస్తున్నాయి.

 

అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్ తో వర్షాలు కురవనున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో వచ్చే 3 రోజుల్లో భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, 24లోగా అది వాయుగుండంగా బలపడొచ్చని అంచనా వేసింది. ఏపీలోని పలు జిల్లాల్లో నేడు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

Hyderabad Rains: హైద‌రాబాద్ లో భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో బీభ‌త్సం, వ‌నస్థ‌లిపురంలో రోడ్డుపై నిలిచిన వ‌ర‌ద నీరు  

అటు తెలంగాణలో (Telangana Rains) ముందుగానే వర్షాలు దంచికొడుతున్నాయి. సాధారణంగా జూన్ 5 తర్వాత నుంచి వానలు పడతాయి. ఈసారి మాత్రం ముందుగానే విస్తారంగా వానలు కురుస్తున్నాయి. నిన్న కూడా హైదరాబాద్ తో పాటు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మరో వారం రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని హెచ్చరించింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు ఈ నెల 22 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.