Ashwatthama's Counter: మేమేమి కేసీఆర్ ఫాంహౌజ్‌లో పాలేర్లం కాదు! సీఎం కేసీఆర్‌పై మరోసారి విరుచుకుపడిన అశ్వత్థామ రెడ్డి, కేసీఆర్ మాటలకు ఎవరూ భయపడొద్దని కార్మికులకు సూచన

ఆర్థికమాంద్యం ఒక్క తెలంగాణలోనే లేదనీ, ప్రపంచమంతా ఉందని చెప్పిన ఆయన...,

File Images of RTC JAC Leader Ashwatthama Reddy & Telangana CM KCR

Nagar Kurnool, October 24: టీఎస్ ఆర్టీసీ సమ్మె (TSRTC Strike)ను ఉద్దేశించి తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) చేసిన వ్యాఖ్యలపై టీఎస్ ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మరోసారి సీఎం కేసీఆర్ పైసంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ ఎవరి జాగీర్ కాదని, తమను ఉద్యోగాల నుంచి తీసేసేందుకు తామేమి కేసీఆర్ ఫాం హౌజ్ లో పాలేర్లం కాదని అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యానించారు. సూర్య, చంద్రులు ఉన్నంత వరకు ఆర్టీసీ ఉంటుందని, ముగింపు ఎవరికి ఉంటుందో ప్రజలు నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

నాగర్ కర్నూల్ సభలో కార్మికులనుద్దేశించి మాట్లాడిన అశ్వత్థామ, కేసీఆర్ వ్యాఖ్యలకు ఎవరూ భయపడొద్దని కార్మికులకు సూచించారు. తన ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే న్యాయస్థానాలు ఊరుకుంటాయా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను అవమానించేలా సీఎం కేసీఆర్ మాట్లాడారు. యూనియన్లు ఉన్నాయి కాబట్టే సంస్థను, ఆర్టీసీ ఆస్తులను కాపాడుకోగలిగామని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు.

తమవేమి గొంతెమ్మ కోర్కెలు కాదనీ, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కరీంనగర్ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల జీతాలు ఉండాలని కేసీఆర్ అనలేదా? అని ప్రశ్నించారు.  ఆర్థికమాంద్యం ఒక్క తెలంగాణలోనే లేదనీ, ప్రపంచమంతా ఉందని చెప్పిన ఆయన, ధనికరాష్ట్రం అని చెప్పిన తెలంగాణ ఈ మూడేళ్లలోనే నష్టాల్లోకి వచ్చిందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేసీఆర్ కు ఎప్పుడు ఎన్నికల పైనే ధ్యాస అని అశ్వత్థామ రెడ్డి విమర్శించారు.  విలీనంపై వనక్కి తగ్గేదే లేదు, ఏ ఒక్క డిమాండును వదులుకోం! 

కేసీఆర్ మాటలకు కార్మికులు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని, అంతిమ విజయం మనదే అని కార్మికులకు సూచించిన అశ్వత్థామ రెడ్డి, ఈనెల 30న సరూర్ నగర్ లో తలపెట్టిన 'సకల జనుల సమరభేరి'కి భారీగా తరలి రావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సమరభేరికి అన్ని వర్గాల ప్రజలు వచ్చేలా చూడాలని కార్మికులకు ఆయన విజ్ఞప్తి చేశారు.