Hyderabad, October 23: తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (TSRTC Merge) చేయాలనే డిమాండ్‌పై తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) బుధవారం స్పష్టం చేశారు. అదే కాకుండా ఏ ఒక్క డిమాండును వెనక్కి తీసుకోబోమని ఆయన వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి సీఎం కేసీఆర్‌కు ఉన్న ఇబ్బందేమిటో తెలియజేయాలని ఆయన కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని డిమాండ్ చేసిన ఆయన, తాము చేస్తున్న పోరాటం అన్యాయం అని తేలితే రేపట్నించే విధులకు హాజరవుతామని ప్రకటించారు.
తెలంగాణ వస్తే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తామని ప్రకటించిన సీఎం కెసీఆర్, ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు ఎవరూ అధైర్యపడకూడదని, ఐక్యంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గురువారం ఇందిరా పార్కు వద్ద చేపట్టే ధర్నాకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆర్టీసీ కార్మికులకు పిలుపునిచ్చారు. రేపట్నించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ కార్మికులకు ధైర్యం చెబుతామని అశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చు
కాగా, హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే విలీనం డిమాండ్ పై పట్టుబట్టబోమని ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నట్లుగా మంగళవారం సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో కార్మికులు విలీనం డిమాండును తామంతట తామే వదులుకున్నారని తెలిపిన సీఎం కేసీఆర్, హైకోర్టు సూచించిన మిగతా 21 అంశాలను పరిశీలించటానికి కమిటీ వేశారు. ఆర్టీసీ విలీనం జరగదు, ప్రధాని మోదీ ఆలోచనలనే ఆచరణలో పెడుతున్నామన్న సీఎం కేసీఆర్
తాజాగా 'విలీనమే' తమ ప్రధాన డిమాండ్ అని మరోసారి అశ్వత్థామ రెడ్డి ప్రకటించడంతో ఆర్టీసీ ఎపిసోడ్ మళ్ళీ మొదటికి వచ్చింది. అయితే, అశ్వత్థామ రెడ్డి కమెంట్స్‌ను సీఎం పరిగణలోకి తీసుకోకపోవచ్చని తెలుస్తుంది. ఈనెల 28న మరోసారి ఆర్టీసీ సమ్మెపై హైకోర్ట్ , ప్రభుత్వం నుంచి పురోగతి ఆశిస్తున్న నేపథ్యంలో హైకోర్ట్ సూచించిన 21 డిమాండ్లను తాము పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నా, కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదనే విషయాన్ని ప్రభుత్వం, హైకోర్టు దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిని బట్టి మరోవారం రోజుల పాటు ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకునే అవకాశం లేనట్లుగా స్పష్టమవుతుంది.