File Images of RTC JAC Leader Ashwatthama Reddy & Telangana CM KCR

Hyderabad, October 17: తెలంగాణ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి (Ashwatthama Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లోని టీఎంయూ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తన ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేస్తుందని ఆరోపించారు.

ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో 'నేనే రాజు, నేనే మంత్రి' అంటే కుదరదని సీఎం కేసీఆర్ (CM KCR) ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది నేతలు వస్తుంటారు, పోతుంటారు, ఎన్టీఆర్ కన్నా కేసీఆర్ గొప్ప మేధావా? అని వ్యాఖ్యానించిన అశ్వత్థామ రెడ్డి సీఎం పదవి ఎవరికీ శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీ సమ్మె పరిష్కారం కాకపోతే రాజ్యాంగ సంక్షోభం రావొచ్చని తెలిపారు. 1993-94 నాటి వైశ్రాయ్ సంఘటనలు కేసీఆర్ మరిచిపోకూడదని పేర్కొన్నారు.   దురుద్దేశ్యపూర్వకం, వారికి ఎంత చేసినా లాభం లేదు. - కేసీఆర్!

ఆర్టీసీ సమ్మెపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు తమకు మద్ధతుగా మాట్లాడుతున్నారు. కొంతమంది మంత్రులు ఆర్టీసీ కార్మికులను విమర్శించి తర్వాత ఇంటికి వెళ్లి ఏడుస్తున్నారని అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె విషయంలో మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేంధర్, జగదీశ్ రెడ్డి లాంటి వారు మౌనం వీడాలని ఆయన కోరారు. మేధావులు మౌనంగా ఉండటం మంచిది కాదని అన్నారు.  (తెలంగాణ ఉద్యమం 2.0)

ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు తాము ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని, హైకోర్ట్ సూచనలను పరిగణలోకి తీసుకొని తమను చర్చలకు ఆహ్వానించాలని, విలీనం ఎలా సాధ్యం అవుతుందో ప్రభుత్వానికి వివరిస్తామని చెప్తామన్నారు. ఆర్టీసీ ఆస్తులను దోపిడీ చేసే ప్రయత్నం జరుగుతుందని, ప్రభుత్వ వైఖరిని హైకోర్టులో ఎండగడతామని తెలిపిన అశ్వత్థామ రెడ్డి, తమ సమ్మెకు మద్ధతుగా ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.