TSRTC Strike | CM KCR Review | File Photo

Hyderabad, October 23: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం (TSRTC Merge) చేయాలనే డిమాండును మినహాయించి కార్మిక సంఘాల ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (CM KCR) మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్ లో అధికారులతో సమీక్ష జరిపారు. అయితే 'ఆర్టీసీ విలీనం' డిమాండును కార్మిక సంఘాలు తమంతట తామే వదులుకున్నాయని పేర్కొన్న సీఎం, కార్మికుల ఇతర డిమాండ్లను పరిశీలించడానికి ఆర్టీసీ ఒక కమిటీని నియమించారు. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

'ఆర్టీసీ విలీనం' ప్రధాన డిమాండుతో కార్మిక సంఘాలు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటిస్తేనే తాము చర్చలు జరుపుతామని కార్మిక సంఘాల నాయకులు మొదట ప్రకటించారు. కానీ హైకోర్టులో విచారణ సందర్భంగా మాత్రం విలీనం డిమాండ్ ఒక్కటే ప్రధానం కాదని కార్మిక సంఘాల తరఫున వాదించిన న్యాయవాది వాదనలు ఈ సమీక్షలో అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కార్మికులు విలీనం డిమాండును తామంతట తామే వదులుకున్నారని భావించిన సీఎం, హైకోర్టు సూచించిన మిగతా 21 అంశాలను పరిశీలించి, వాటిపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఐదుగురు E.D లు మరియు ఒక ఆర్థిక సలహాదారు కలిగిన ఈ కమిటీ ఒకటి రెండు రోజుల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది.  ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఎన్ని డిమాండ్లు సాధ్యమవుతాయనేది తెలియజేస్తూ హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. టీఎస్ ఆర్టీసీకు ప్రజా మద్ధతు ఎందుకు దొరకలేదు?

1000 అద్దె బస్సుల టెండర్లకు నోటిఫికేషన్

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తక్షణం వెయ్యి బస్సులను అద్దెకు తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్టీసీ సమ్మె జరుగుతుండగా ఈ టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ హైకోర్టులో కొంతమంది ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. కేసీఆర్ నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటే కుదరదు, సీఎం పదవి శాశ్వతం కాదు

 రాష్ట్ర కాంగ్రెస్ మరియు బీజేపిల వైఖరిపై మండిపడిన సీఎం

ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రోద్భలంతో చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెకు కాంగ్రెస్, బీజేపి పార్టీలు మద్దతు పలకడం అనైతికమని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. ఆర్టీసీ విషయంలో కాంగ్రెస్, బీజేపిలు చేస్తున్న వాదనలు విచిత్రంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో కార్మికులు చేస్తున్న డిమాండ్లను కాంగ్రెస్, బీజేపి పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా? అని సీఎం నిలదీశారు.

రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టీసీ)ను, రూట్లను ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అధికారం, అవకాశం కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం చట్టం చేసింది. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా ఇక్కడి బీజేపి నాయకులు మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని మూసేసింది. కానీ ఆ పార్టీలు తెలంగాణ విషయంలో మాత్రం విచిత్రంగా, విభిన్నంగా మాట్లాడుతున్నారు అని సీఎం వ్యాఖ్యానించారు.

"1950లో జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మోటార్ వెహికిల్ యాక్టును రూపొందించారు. దాని ప్రకారమే రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఏర్పడ్డాయి. ఆర్టీసీ వాహనాలు నడిచే రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వవద్దని కూడా ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టంలోని 3వ సెక్షన్ లో సవరణలు చేస్తూ నరేంద్ర మోదీ సర్కార్ ఈ ఏడాది 2019 బడ్జెట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు ఆమోదించి, చట్టం చేసింది. మోటార్ వెహికిల్ (అమెండ్మెంట్) యాక్టు 2019’ పేరిట అమలవుతున్న చట్టంలో ఆర్టీసీలో ప్రైవేటు రంగానికి అవకాశం కల్పించాలని నిర్ణయించారు.

ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యం అందించడానికి, తక్కువ ధరల్లో ప్రయాణం సాగించడానికి పోటీ అనివార్యమని కూడా కేంద్రం పేర్కొంది. మొబైల్ రంగంలో, విమానయాన రంగంలో ప్రైవేటుకు అవకాశం కల్పించడం వల్ల ఆయా రంగాల్లో రేట్లు తగ్గాయని, సౌకర్యాలు పెరిగాయని కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకోవడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని కేంద్ర బడ్జెట్లోనే చెప్పారు. అలాంటిది బీజేపి నాయకులు తెలంగాణలో మాత్రం ఆర్టీసీ విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తున్నారు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.

కేంద్రం తెచ్చిన చట్టాన్నే అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, స్థానిక బీజేపి నాయకులు రాద్దాంతం చేస్తున్నారని, దీనిపై ప్రధాని మోదీ మరియు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని భావిస్తున్నట్లుగా సీఎం కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.