Heart Attack: కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించొద్దు.. గుండెపోటు మరణాల నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవీయ సూచన.. ఆయన ఏమన్నారంటే?
ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం.
Hyderabad, Oct 31: దేశంలో రోజురోజుకీ గుండెపోటుతో (Heart Attack) మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ముఖ్యంగా టీనేజ్ కుర్రాళ్లు (Teenagers) హఠాత్తుగా చనిపోతున్న ఘటనలు చూస్తున్నాం. దీనికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ (Mansukh) తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. కొవిడ్ పేషెంట్స్ అధిక పని ఒత్తిడికి దూరంగా ఉండాలని, తీవ్రమైన శ్రమతో కూడిన వ్యాయామాలు చేయవద్దని సూచించారు.భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనాన్ని ఉటంకిస్తూ కొవిడ్ బాధితులకు ఈ సూచన చేశారు. ‘తీవ్రమైన కొవిడ్-19 ఇన్ ఫెక్షన్ తో బాధపడ్డవారు.. ఒకటీ లేదా రెండేండ్ల వరకు జాగ్రత్తగా ఉండాలి. అధిక శ్రమతో కూడిన తమ పనుల్ని వాయిదా వేసుకుంటే మంచిది’ అని చెప్పారు. కొద్ది రోజుల క్రితం గుజరాత్ లో దసరా పండుగ సమయంలో గార్బా నృత్యం చేస్తూ 10 మందికిపైగా గుండె పోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే.
కొవిడ్ టీకాతో ఆకస్మిక మరణాలు పెరగలేదు
కొవిడ్ వ్యాక్సినేషన్ దేశంలో యువత ఆకస్మికంగా మరణించే ముప్పును పెంచలేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తాజా అధ్యయనం వెల్లడించింది. గతంలో కొవిడ్ కారణంగా దవాఖానలో చికిత్స పొందడం, అతిగా మద్యపానం, స్వల్ప సమయంలో తీవ్రంగా శారీరక శ్రమ వంటి ఆకస్మిక మరణ ముప్పును పెంచాయని పేర్కొన్నది. 18-45 సంవత్సరాల మధ్య వయస్కులపై ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.