TTD: ఈ నెల 8న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు కోటా విడుదల, 10వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం, పూర్తి వివరాలు ఇవే..
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది.
తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవా టికెట్లు ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను బుధవారం రిలీజ్ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వెల్లడించింది. ఈ నెల 8 నుంచి ఈ టికెట్లకు రిజిస్ట్రేషన్ ను ప్రారంభిస్తామని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) తెలిపింది. బుధవారం ఉదయం 10 గంటలకు బుకింగ్ ప్రారంభించి శుక్రవారం (10వ తేదీ) ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ కు అవకాశం కల్పిస్తామని వివరించింది.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులకు లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవా టికెట్లను (Online booking for arjita sevas) కేటాయించనున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ఈ నెల 22 నుంచి 28 తేదీ వరకు ఆయా సేవల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందని తెలిపింది. స్వామి వారి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను ఈ నెల 9 న ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ (https://ttdsevaonline.com) ద్వారా ఈ సేవలకు సంబంధించిన దర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చని వివరించింది.
కాగా, మంగళవారం కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు 8 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోందని అధికారులు తెలిపారు. సోమవారం శ్రీవారిని 71 వేల మంది భక్తులు దర్శించుకున్నారు.