Bhumana Karunakar Reddy Slams Pawan Kalyan (photo-X)

Tirupati, Feb 13: తిరుపతిలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మీరు రావాలని హిందూ సంఘాలు పిలుస్తున్నాయి. తిరుపతిలో జరుగుతున్న స్వామీజీ అమరణ నిరాహార దీక్ష మీకు కనపడటం లేదా అంటూ పవన్ కళ్యాణ్ మీద భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతిలో గురువారం ఉదయం భూమన మీడియాతో మాట్లాడుతూ..సనాతన ధర్మంకు విఘాతం కలిగితే తాను ముందు ఉంటానని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు ఎక్కడ ఉన్నారని వైఎస్సార్‌సీపీ నేత ప్రశ్నించారు.

తిరుమలలో ఓ ప్రైవేట్‌ హోటల్‌కు అనుమతులివ్వడంపై హిందూ సంఘాలు పోరాటం చేస్తున్నా.. పవన్‌ మౌనంగా ఉండడంపై భూమన మండిపడ్డారు. అలాగే కేరళలో తిరుమల లడ్డూపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 20 తేదీన తిరుమలడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో ఆవు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. అయితే.. నిర్ధారణ కాకుండా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నియమించిన సీబీఐ సిట్‌ రిపోర్ట్‌లో ఎక్కడా ‘నిర్ధారణ’ అనే విషయం ప్రస్తావించలేదు.

సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్, టిటిడి భవనం ఎదుట ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సాధువులు

తిరుమల పవిత్రతకు భంగం కలిగింది ఆనాడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఆరోపణలు చేశారు. మరి ఇప్పుడు ఇదే చంద్రబాబు ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చారు. సనాతన ధర్మంకు విఘాతం కలిగిన ముందు ఉంటాను అని చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్‌.. అది వ్యక్తిగతం, రాజకీయాలతో సంబంధం లేదని చెబుతున్నారు. మరి అలాంటప్పుడు ఆ పర్యటనల్లో రాజకీయ విమర్శలు ఎలా చేస్తారు?

కేరళకు వెళ్లి.. తిరుమల లడ్డూ గురించి తప్పుగా మాట్లాడారు. ఇది మాపై వేస్తున్న నింద కాదు.. స్వయంగా వెంకటేశ్వర స్వామి మీద వేస్తున్న నింద. మా హయాంలో అయోధ్యకు పంపిన లక్ష లడ్డూలు కల్తీ నెయ్యితో చేసినవని పవన్‌ అన్నారు. లడ్డూలో కాదు.. కల్తీ మీ బుర్రలో జరిగింది. సౌరవ్ బోరా అనే ప్రస్తుత పాలక మండలి సభ్యుడు రూ. 30 లక్షలు ఖర్చు చేసి లక్ష లడ్డూలు తయారు చేయించారు. ఇప్పుడు ఆయన్ని కూడా అరెస్టు చేయించండి.

పవన్‌ ఒకప్పుడు సూడో హిందువును, నేను బాప్టిజం తీసుకున్నా అన్నారు. తన భార్య క్రిస్టియన్ , పిల్లలు క్రిస్టియన్ అన్నారు. ఆపై కాషాయం కట్టి సనాతన ధర్మం అంటూ ఊగిపోయారు. సనాతన ముసుగులో రాజకీయం చేసి, ప్రత్యర్థులు పార్టీలను నాశనం చేయాలని చూస్తున్నారు. ఆ ముసుగులోనే తిరుమల పవిత్రతను పవన్‌ దిగజార్చుతున్నారు అని భూమన మండిపడ్డారు.