Andhra Pradesh: మిరాకిల్..ఆరు కాళ్లు, రెండు తలలతో జన్మించిన దూడ, కాసేపటికే మృతి, కడపలో పంది పిల్ల ఆకలి తీర్చిన ఆవు
అలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వింతగా మారుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది.
Amaravati, Sep 28: కొన్ని సార్లు చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వింతగా మారుతూ ఉంటాయి. తాజాగా ఏపీలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పామర్రు గ్రామంలోని యాదవపురానికి చెందిన గోపాలకృష్ణకు చెందిన చూడి గేదె 10 నెలలు అవుతున్నా ఈనక పోవడంతో పశు వైద్యుడు శశికుమార్ వద్దకు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యుడు గేదె లోపల ఉన్న దూడ ఆకృతిలో తేడా ఉందని గుర్తించారు. పశువుకు శస్త్ర చికిత్స చేసి దూడను బయటికి తీశారు. దూడ 2 తలలు, 6 కాళ్లతో (Buffalo Gives Birth to Calf With Two Heads and Six Legs) జన్మించి కొద్దిసేపటికే మృతి (Baby Dies Shortly After Delivery) చెందింది.
వికారాబాద్ జిల్లాలో కూడా ఇలాంటి వింత ఘటనే జరిగింది. ఓ గేదె.. రెండు తలల దూడకు జన్మనిచ్చింది. రెండు తలలు, రెండు నోళ్లు, నాలుగు కళ్లు, నాలుగు చెవులు, నాలుగు కాళ్లతో ఒకటే శరీరం ఉన్న అరుదైన దూడ జన్మించింది. స్థానికుల వివరాల ప్రకారం.. బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామంలో సెప్టెంబర్ 24న ఓ గేదె దూడకు జన్మనివ్వగా అది రెండు తలలతో జన్మంచింది. గ్రామానికి చెందిన వీరారెడ్డికి ఉన్న పశువుల్లో ఓ గేదె ఈతకు ఇబ్బంది పడుతుంటే పశువైద్యుడికి సమాచారం అందించాడు. వైద్యుడు వచ్చి గేదెను పరీక్షించి కడుపులో రెండు తలలున్న దూడ ఉందని గ్రహించి, జాగ్రత్తగా దూడను కడుపులోంచి తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, రెండు తలలున్న దూడను చూసేందుకు తరలి వస్తున్నారు. రెండు తలలతో పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోతున్నారు. జన్యుపరమైన లోపంతోనే ఇలా జన్మిస్తుంటాయని పశువైద్యుడు తెలిపారు.
ఇక కడప జిల్లాలో ఆవు పంది పిల్ల ఆకలి తీర్చిన ఘటన చోటు చేసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో నడుచుకుంటూ వెళ్లిన పంది.. ఆవు దగ్గరకెళ్లి పాలు తాగింది. ఈ వింత ఘటనను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. తమ ఫోన్లలో ఈ దృశ్యాలు బంధించారు. ఈ వీడియో కాసేపట్లోనే వైరల్‌గా మారింది. సాధారణంగా ఏ జంతువులైనా సరే.. తమ బిడ్డలకే పాలిస్తాయి. కానీ ఎంతో అరుదుగా ఇతర జంతువులు పాలు తాగనిస్తాయి. ఇలా వేరే జాతికి చెందిన జంతువులకు.. అందులోనూ పెద్ద వాటికి పాలివ్వడం మాత్రం అరుదే.
ఆ మధ్య శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట కోవెల వీధి సమీపంలో.. ఓ ఆవు పంది పిల్లకు పాలిచ్చింది. అలా ఒకటి కాదు రెండు కాదు.. నెల రోజులకుపై పంది పిల్లకు ఆవు పాలిచ్చింది. దాని ఆకలిని తీర్చింది. ఈ మధ్యే ప్రకాశం జిల్లాలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మార్కాపురం పట్టణ బస్టాండ్ ఆవరణలో ఆవులు సంచరిస్తుంటాయి. ఆకులు, పేపర్లు తింటూ అక్కడే రాత్రిళ్లు నిద్రిస్తుంటాయి. అదే ప్రాంతంలో పందులు కూడా సంచరిస్తుంటాయి. ఒక్కోసారి ఆవులు సేద తీరుతున్న చోటుకే పందులు కూడా వచ్చి సేదతీరుతాయి. ఈ క్రమంలో ఓ ఆవు నిద్రిస్తుండగా.. పందులు దాని దగ్గరకు వెళ్లాయి. హాయిగా పడుకుని సేదతీరున్న ఆ ఆవు పొదుగు చుట్టూ పందిపిల్లలు చేరాయి. అలా అవి ఆవు పాలు తాగాయి.