Gold Particles Found In Bore Well: బోరు తవ్విస్తే, బురదతో పాటు పైకి వచ్చిన బంగారాన్ని పోలిన పొడి.. బోరులోంచి బంగారం వస్తోందంటూ ప్రచారం.. ఒడిశాలో ఘటన
నీటి కోసం బోరు తవ్విస్తే అందులోంచి బంగారం రంగులో ఉన్న పొడి బయటికి వచ్చింది.
Newdelhi, March 26: ఒడిశాలో (Odisha) చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. బొలంగీర్ జిల్లా బహాలి గ్రామానికి చెందిన మహ్మద్ జావెద్ తన పొలంలో సాగునీటి కోసం బోరు (Bore Well) తవ్వించాడు. అయితే, ఆ బోరు నుంచి బురద నీటితో పాటు బంగారం (Gold) రంగులో ఉన్న పొడి (Powder) కూడా పైకి వచ్చింది. చూడ్డానికి అచ్చం అది బంగారంలోనే ఉంది. ఇంకేముంది.. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా ఊరంతా పాకిపోయింది.. బోరు వేస్తే బంగారం పడిందంటూ పెద్దయెత్తున ప్రచారం సాగింది.
ఈ సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు రైతు పొలంలోని బోరు వద్దకు చేరుకుని ఆ పొడి నమూనాలు సేకరించారు. ఆ పొడి బంగారమో కాదో తేల్చేందుకు నమూనాలను ల్యాబ్ కు పంపించారు. అంతేకాదు, ల్యాబ్ ఫలితాలు వచ్చేవరకు బోర్ ను మూసివేయాలని ఆదేశించారు.