Hyd, Oct 14: తెలంగాణలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి ఆపై తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కామారెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస్‌రెడ్డి (35), అపర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు విఘ్నేష్ (6), అనిరుధ్ (4)ఉన్నారు. శనివారం రాత్రి 7.30 గంటలకు దుర్గమ్మ నిమజ్జనానికి పిల్లలను తీసుకుని శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు.
రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్ చేసింది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఫిర్యాదు చేయడంతో పోలీసులతో పాటు స్థానికులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం గ్రామశివారులోని ఓ వ్యవసాయ బావిలో పిల్లల మృతదేహాలు కనిపించాయి. అప్పటికి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి ఆచూకీ తెలియలేదు. ఆయన చెప్పులు, మొబైల్ బావి వద్దే ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.
భార్య వేరే వ్యక్తితో మాట్లాడుతుందని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న భర్త.. రంగారెడ్డిలో ఘోరం
దీంతో పిల్లల మృతదేహాలను బయటకు తీసి బావిలోని నీటిని మోటారు సాయంతో తోడించారు. అనంతరం బావి లోపల శ్రీనివాస్‌రెడ్డి మృతదేహం లభ్యమైంది. తండ్రీకుమారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్రికెట్ బెట్టింగ్, జూదానికి అలవాటు పడిన శ్రీనివాస్ రెడ్డి రూ.లక్ష వరకు అప్పు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.