Newyork, March 26: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త నిబంధనలతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నారు. తాజాగా, ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్ సందేశం పంపి మరోసారి కలకలం సృష్టించారు. ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనన్నది ఆ మెయిల్ సారాంశం. ఆఫీసుకు వచ్చి పనిచేయడంపై ఆప్షన్లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పారు.
"Office Is Not Optional": Elon Musk Emails Twitter Employees At 2:30 AM https://t.co/0Rra9IvdQW pic.twitter.com/rsqW3c4B2w
— NDTV News feed (@ndtvfeed) March 25, 2023
అసలేమైంది అంటే?
శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయానికి ఇటీవల మస్క్ వెళ్ళారు. ఆ సమయంలో సగం మంది ఉద్యోగులు ఆఫీసుకు డుమ్మా కొట్టారు. దీంతో అసహనానికి గురైన మస్క్ ఉద్యోగులపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే అర్దరాత్రి అని కూడా చూడకుండా ఉద్యోగులకు ఈమెయిల్ చేశారు. శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం సగం మేర ఉద్యోగుల్లేక ఖాళీగా కనిపించిందని మెయిల్ లో ప్రత్యేకంగా పేర్కొంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
మొదటినుంచి కూడా ఇంతే..
ట్విట్టర్ ను కొనుగోలు చేశాక ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనే లక్ష్యంగా మస్క్ అడుగులు వేస్తున్నారు. తన వద్ద పనిచేసే ఉద్యోగులు వారంలో కనీసం 40 గంటలు పనిచేయాల్సిందేనని గత నవంబరులో హుకుం జారీ చేశారు. దాంతో టార్గెట్లు అందుకోవడానికి కొందరు ట్విట్టర్ ఉద్యోగులు ఆఫీసుల్లోనే నిద్రిస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. అంతేకాదు, వివిధ దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఇంటికి సాగనంపారు. కొన్నిచోట్ల తగినంత మంది సిబ్బంది లేక ట్విట్టర్ ఆఫీసులు మూతపడ్డాయి.