Bandi Sanjay (Photo-ANI)

Hyderabad, March 26: తెలంగాణలో (Telangana) సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) కి సిట్ (SIT) నోటీసులు పంపడంతో పాటు ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఉంటే సమర్పించాలని సిట్ ఆ నోటీసుల్లో కోరింది. నోటీసుల్లో పేర్కొన్న ప్రకారం బండి సంజయ్ నేడు సిట్ ఎదుటకు రావాల్సి ఉంది. అయితే, నేటి సిట్ విచారణకు బండి సంజయ్ దూరం కానున్నారు. బండి సంజయ్ తరఫున సిట్ ముందుకు బీజేపీ లీగల్ టీమ్ రానుంది.

PM Modi Security Breach: వీడియో ఇదిగో, ప్రధాని పర్యటనలో మళ్లీ భద్రతా వైఫల్యం, బారికేడ్లను దూకి మోదీ కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన యువకుడు, అలర్ట్ అయిన పీఎం సిబ్బంది

ఎందుకు హాజరు కావట్లేదు?

మరికొద్ది రోజుల్లో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే, పలు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార బీజేపీ కూడా పెద్దయెత్తున రాజకీయ సభలను నిర్వహిస్తున్నది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా బీదర్ సభలో నేడు ప్రసంగించనున్నారు. ఈ సభలో బండి సంజయ్ కూడా పాల్గొనాల్సి ఉంది. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంకావాల్సి ఉంది. అందుకే, నేడు ఆయన సిట్ విచారణకు హాజరు కావట్లేదని తెలుస్తున్నది.

నలుగురు నిందితులకు పోలీస్ కస్టడీ

టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నలుగురు నిందితులకు పోలీస్ కస్టడీ విధించారు. నిందితులకు నేటి నుంచి మూడు రోజుల పాటు సిట్ కస్టడీ అమలు కానుంది. ఈ కేసులో ప్రవీణ్ (ఏ1), రాజశేఖర్ (ఏ2), ఢాక్యా (ఏ4), కేతావత్ రాజేశ్వర్ (ఏ5)లను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు కోర్టు సిట్ కు అనుమతించింది. పేపర్ లీక్ కేసులో సిట్ ఇప్పటివరకు మొత్తం 13 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.