Car Burial Ceremony: కారుకు అంత్యక్రియలు.. 1,500 మంది సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం కార్యక్రమం.. ఎందుకంటే? (వీడియోతో)
ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. మీరు చదువుతున్నది నిజమే.
Newdelhi, Nov 9: గుజరాత్ (Gujarat) లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు కుటుంబం తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు (Car Burial Ceremony) నిర్వహించింది. మీరు చదువుతున్నది నిజమే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమ్రేలి జిల్లాలో పదర్ షింగా గ్రామంలో సంజయ్ పోలారా అనే రైతు కుటుంబం నివసిస్తున్నది. వ్యవసాయంతో పాటు పోలారా సూరత్ లో నిర్మాణ వ్యాపారంలోకి దిగారు. అయితే, తొలుత వ్యాపారంలో లాభాలేమీ రాలేదు. అయితే, కుటుంబ అవసరాల నిమిత్తం తీసుకున్న వాగన్ ఆర్ కారు ఎప్పుడైతే, పోలారా జీవితంలో భాగమైందో ఆయన ఆర్ధిక పరిస్థితే మారిపోయింది. పట్టిందల్లా బంగారమైంది. అలా 12 ఏండ్లు గడిచిపోయాయి.
Here's Video:
అలా అంత్యక్రియలు
ఏండ్లుగా వాడటంతో సదరు లక్కీ కారు నడవలేని స్థితికి వచ్చింది. దీంతో తమకు అదృష్టాన్ని తీసుకొచ్చిన తమ కారుకు ఘనంగా అంత్యక్రియలు నిర్వహించాలని పోలారా కుటుంబం నిర్ణయించింది. సాధువులు, ఆధ్యాత్మిక గురువులు సహా 1,500 మంది ప్రజల సమక్షంలో సంజయ్ పోలారా కుటుంబం పదర్ షింగా గ్రామంలోని తమ పొలంలో గురువారం హిందూ సంప్రదాయం ప్రకారం ఈ అంత్యక్రియల కార్యక్రమం నిర్వహించింది.
రూ.4 లక్షలు ఖర్చు చేసి ఘనంగా..
12 ఏండ్ల పాటు వాడిన వాగన్ ఆర్ కారును మొదట పూలతో అలంకరించి ఇంటి నుంచి పొలం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆ తర్వాత పొలారా కుటుంబం వేద మంత్రోచ్ఛారణల నడుమ కారును 15 అడుగుల గోతిలో పూడ్చి పెట్టారు. తద్వారా భవిష్యత్తు తరాలు ఆ కారును గుర్తుంచుకొంటాయని భావించారు. ఇందుకోసం తన కారుకు రూ.4 లక్షలు ఖర్చు చేసి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు.
మా కుటుంబానికి గౌరవం
‘ఈ కారు మాకు సంపద తీసుకొచ్చింది. దీని వల్ల వ్యాపారంలో విజయం లభించింది. మా కుటుంబానికి గౌరవం వచ్చింది. అందుకే దీన్ని అమ్మడం కన్నా, దీనికి సమాధిని నిర్మించడం ద్వారా నివాళి అర్పించాను’ అని పొలారా తెలిపారు.